మహావతార్ బాబాజీ ఆశీస్సులు

పరమహంస యోగానందగారి ఆశ్రమాలను దర్శించుటకు (అక్టోబరు 1963 – మే 1964లో) శ్రీ దయామాత భారతదేశానికి వచ్చినప్పుడు, మహావతార్ బాబాజీ తన స్వశరీరంతో నివసించిన పవిత్రమైన హిమాలయాలలోని గుహను దర్శించుట జరిగింది. ఆ తరువాత ఆ పవిత్ర యాత్ర యొక్క విశేషాలను బహిరంగంగా వివరించుటకు దయామాత నిరాకరించారు. అయితే ఒకసారి ఎన్సినీటస్ ఆశ్రమములో జరిగిన సత్సంగములో ఒక భక్తుడు, బాబాజీ గుహ యాత్రా విశేషాలను తమకు తెలియచేయవలసినదని అడిగినప్పుడు, దివ్య అంతర్గత ప్రేరణ ప్రభావము వలన అందుకు దయామాత ఒప్పుకున్నారు. ఆ యాత్ర విశేషాలు అందరికి గొప్ప స్ఫూర్తిని ఇస్తాయనే ఉద్దేశ్యంతో క్రింద తెలియచేయుచున్నాము.

సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, ఎన్సినీటస్, కాలిఫోర్నియా, ఆగస్ట్ 24, 1965లో ఇచ్చిన ప్రసంగం నుండి.

మహావతార్ బాబాజీకి, పరమహంస యోగానందగారికి, ఒక ప్రత్యేక సంబంధము ఉంది. గురుదేవులు తాను ఇండియా వదలి ఈ దేశానికి (అమెరికాకు) వచ్చే ముందు తనకు మహావతార్ బాబాజీ కలకత్తాలో దర్శనమిచ్చిన సంఘటన గురించి పదే పదే చెప్పేవారు. మహావతార్ బాబాజీని గురించి గురుదేవులు చెప్పిన ప్రతిసారి, మా హృదయాలు భక్తి ప్రపత్తులతోనూ, దివ్య ప్రేమతోనూ నిండిపోయేవి. ఆ సందర్భాలలో నా గుండె భక్తి ప్రపత్తులలో నిండి పోయేటట్లనిపించేది.

గురుదేవుల మహాసమాధి తరువాత, బాబాజీ గురించిన ఆలోచనలు నా మనస్సులో దృఢపడుతూ వచ్చాయి. మన ఇతర పరమ గురువులపైనున్న భక్తి ప్రపత్తుల కంటే, బాబాజీపైన నా హృదయంలో ఒక ప్రత్యేక అనుభూతి ఎందుకు కలుగుతున్నదో నాకు ఆశ్చర్యమేసేది. మహావతార్ బాబాజీ పైన నా హృదయంలో ప్రత్యేకమైన అనుభూతి కలుగుటకుగల కారణము నాకు తెలియదు; వారి నుండి ఎలాంటి సంకేతము రాలేదు. బాబాజీ యొక్క పవిత్ర దర్శనము నాకు కలుగుతుందని గాని, కలగాలని కాని నేనెప్పుడు అనుకోలేదు. ఎందుకంటే “నేను అందుకు అర్హురాలిని కాదు అని నా ఆలోచన.” బహుశా రాబోవు జన్మలలో బాబాజీ దర్శనము కలుగవచ్చునేమో? అని అనుకునేదాన్ని నేను. ఎప్పుడుగాని ఆధ్యాత్మిక అనుభవాల గురించి నేను ఆరాటపడలేదు, కోరనూ లేదు. అయితే భగవంతుని ప్రేమను కోరేదాన్ని, ఆయన ప్రేమను పొందాలనుకునేదాన్ని. భగవంతుణ్ణి ప్రేమించడములో నాకు ఆనందము కలిగేది. జీవితంలో ఇతర కానుకలను నేనెప్పుడూ కోరలేదు.

పోయినసారి నేను భారతదేశానికి పోయినప్పుడు, నాతో ఉన్న ఇద్దరు భక్తులు బాబాజీ గుహను చూడాలనే కోరికను వెలిబుచ్చారు. మొదట బాబాజీ గుహను చూడాలనే కోరిక నాలో లేదు. అయినప్పటికి ఆ గుహను గురించి వాకబు చేశాము. ఆ గుహ హిమాలయ పర్వతశ్రేణులలో రాణిఖేత్ దగ్గర, నేపాల్ కు సమీపంలో ఉన్నదని తెలుసుకున్నాం. అయితే అప్పట్లో విదేశస్థులకు భారతదేశ ఉత్తర సరిహద్దులలోనికి ప్రవేశము లేదని ఢిల్లీ నుండి మాకు సమాచారము అందింది. కావున ఆ యాత్ర అసాధ్యమనిపించింది. అయినా నేను నిరుత్సాహపడలేదు. ఎందుకంటే జగజ్జనని అనుగ్రహముంటే “అసాధ్యాలు సాధ్యమవుతాయి, అద్భుతాలు జరుగుతాయి, జరిగాయి” అనే విషయము నాకు బాగా తెలుసు. ఒకవేళ మేము ఆ యాత్రను చేయరాదని జగన్మాత భావిస్తే, అది కూడా మా మంచికే జరిగిందని అనుకుంటాము.

ఒకటి రెండు రోజుల తరువాత, “బాబాజీ గుహ ఉన్న ప్రదేశము ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మేము సంప్రదింపులు జరిపాము, వారి గుహను దర్శించుటకు మన బృందానికి ప్రత్యేక అనుమతి ఇచ్చారు” అని యోగాచార్యుడు వినయ నారాయణ్ నాకు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో మేము ఆ యాత్రకు బయలుదేరాము. హిమాలయాల చలిని తట్టుకొనుటకు కావలసిన వెచ్చని దుస్తులు మా వద్ద లేవు. మా వద్ద రెండు చీరలు, పైన కప్పుకునేందుకు రెండు ఉన్ని శాలువలు మాత్రమే ఉన్నాయి. గుహను చూడాలనే తొందరలో కొంత మూర్ఖంగా ప్రవర్తించామేమో! అనిపించింది.

మేము ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు వెళ్ళాము, సాయంత్రం ఎనిమిది గంటలకు గవర్నర్ ఇంటికి చేరుకున్నాము. ముఖ్యమంత్రి మరియు ఇతర అతిథులతో కలిసి భోజనము చేసాము. 10 గంటలకు ముఖ్యమంత్రితో సహా కాట్ గోదమ్ కు పోయే రైలు ఎక్కాము. మరుసటి రోజు ఉదయం కాట్ గోదమ్ రైల్వే స్టేషన్ చేరినాము. అచ్చటి నుండి ఆ కారులో ద్వారహాట్ అనే పర్వత గ్రామానికి మేము చేరాలి. ఆ పల్లెలో మాలాంటి యాత్రికులు బస చేయడానికి సౌకర్యాలున్నాయని మాకు తెలిసింది.

బాబాజీ ఉనికికి ఒక దివ్య నిదర్శనము

1963లో రాణిఖేత్ సమీపంలోని హిమాలయాలలోని మహావతార్ బాబాజీ గుహలో దయామాత ప్రగాఢ దివ్య భగవదనుసంధానములో ఉన్నప్పుడు తీసిన ఫోటో. “భగవంతుని సాన్నిధ్యంలో నిశ్శబ్ద స్వరము బిగ్గరగా మాట్లాడింది. సాక్షాత్కార తరంగాలు నా చైతన్యం గుండా ప్రవహించాయి. నేను ఆ రోజు సమర్పించిన ప్రార్థనలు ఫలించాయి.”

కాట్ గోదమ్ రైల్వే స్టేషన్లోని గదిలో నేనొక్కదాన్నే కూర్చొని ఉన్నాను. మిగతా వాళ్ళందరూ కారు కోసము బయటకు వెళ్లారు. లోతైన భావం మరియు భక్తితో, భారతదేశంలో మనం పిలిచే జప యోగాన్ని – దైవ నామాన్ని పదే పదే ఉచ్చరించడం – నేను ఆచరిస్తున్నాను. ఆ సమయంలో నా మనస్సు ఒకే ఒక ఆలోచనతో నిండిపోయింది. ఏ ఇతర ఆలోచనలు నా మది చేరలేదు. నేను బాబాజీని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆ సమయంలో ఒక అనిర్వచనీయమైన జలదరింపు (ఆనందము)తో నా గుండె నిండిపోయింది.

ఉన్నట్లుండి ప్రపంచ స్ఫురణ పోయింది. నా మనస్సు ఉన్నత చైతన్య స్థితిలోకి పోయింది. మధురానంద పారవశ్యములో బాబాజీని దర్శించాను. అవిలాలోని సెయింట్ థెరిసా “నేను రూపములేని ఏసు ప్రభువును చూస్తాను” అంటే ఏమో ఇప్పుడు అర్థమయ్యింది నాకు. నామ రూప రహిత పరమాత్మ తన సంకల్పమనే దుస్తులతో జీవుడుగా రూపుదిద్దుకోవడమంటే ఏమో? ఇప్పుడు తెలియవచ్చింది. భౌతిక రూపం కన్నా, మనో నేత్ర దృశ్యం కన్నా నేను చూచిన బాబాజీ రూపము ఎంతో స్పష్టంగాను ఖచ్చితంగాను ఉంది. అంతరంగంలోనే నేను బాబాజీకి ప్రణమిల్లి వారి పాద ధూళిని కళ్ళకద్దుకున్నాను.

మాలో కొందరికి గురువుగారు ఇలా చెప్పేవారు: “మన సంస్థ అధిపతిని గురించి మీరు బెంగపడవద్దు. ఈ సంస్థను నడిపించే అధిపతులను బాబాజీ ఎప్పుడో ఎన్నుకొన్నారు.” మన సంస్థకు అధ్యక్షురాలుగా నన్ను పాలకమండలి ఎన్నుకొన్నది. నేను వారిని, “నన్నెందుకు ఎన్నుకొంటున్నారు?” అని అడిగాను. ఇప్పుడు కూడా బాబాజీ పాదాల వద్ద విలపిస్తూ ఇలా ప్రార్థించాను: “నేను అర్హురాలినికాను, కాని వారు నన్ను ఎన్నుకున్నారు. ఇది ఎలా జరిగింది?”

అప్పుడు మధురమైన కంఠంతో బాబాజీ ఇలా బదులిచ్చారు, “అమ్మా! మీ గురువుగారిని సందేహించవద్దు. ఆయన నిజమే చెప్పారు, ఆయన చెప్పింది నిజమే.” బాబాజీ ఈ మాటలు అంటూ ఉంటే, ఒక పరమానందభరిత శాంతి నన్ను ఆవరించింది. ఆ శాంతిసాగరంలో నేను మునిగిపోయాను. ఇలా ఎంతసేపు గడిచిందో నాకు తెలియదు.

గదిలోనికి మా బృందం సభ్యులు వస్తున్నట్లు తెలిసింది. నేను నెమ్మదిగా కనులు తెరిచాను, అప్పుడు ఆ పరిసరాలకు ఏదో కొత్తదనము వచ్చినట్లు అనిపించింది. ముందు జన్మలలో నేను ఇక్కడ ఉండినట్లు, ఆ పరిసరాలు నాకు బాగా పరిచయమున్నట్లు తోచింది. పూర్వజన్మల స్మృతులు మేల్కొన్నట్లు అనిపించింది!

మేము ద్వారహాట్ కొండపైకి పోవుటకు కారు సిద్ధమయింది. ఆ కొండ దారిలో మేము ప్రయాణము సాగించాము. ప్రతి దృశ్యము, ప్రతి వస్తువు నాకు ముందే పరిచయమయినట్లు తోచింది. కాట్ గోదమ్ రైల్వే స్టేషన్ అనుభవము (బాబాజీ దర్శనము) తరువాత ఎటు చూచినా బాబాజీ రూపమే కనిపించసాగింది. రాణిఖేత్ లో మేము కొంతసేపు ఆగినాము. ముఖ్యమంత్రిగారు మాతో వస్తున్నందున ఆ పట్టణ అధికారులు మాకు స్వాగతం పలికారు.

చివరికి మారుమూల ఉండే ద్వారహాట్ గ్రామాన్ని చేరుకున్నాము. ఆ గ్రామము హిమాలయ పర్వతశ్రేణికి అడుగున ఉంది. అచట ఉన్న చిన్న ప్రభుత్వ భవనంలో బస చేశాము. విదేశీయులు పవిత్రమైన బాబాజీ గుహను దర్శించడానికి వస్తున్నారని విని, మమ్ము చూడడానికి ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న ప్రజలందరు వచ్చారు. ఆ ప్రాంతంలో బాబాజీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బాబాజీ అంటే “గౌరవనీయులైన తండ్రి” అని అర్థము. ఇప్పుడు మనమందరము సత్సంగము జరుపుకొనుచున్నట్లే, ఆ రోజు కూడా మేము సత్సంగము జరుపుకున్నాము. ఆ పల్లె ప్రజలు మమ్ము అనేక ప్రశ్నలు వేశారు. వారిలో చాలామందికి ఇంగ్లీషు అర్థమైంది. అర్థం కాని వారి కోసం సమీపంలోని వారు ఎవరైనా అనువదించేవారు.

ఒక భవిషద్దర్శనము

సత్సంగము తరువాత గ్రామ ప్రజలు వెళ్ళిపోయారు. ఆ తరువాత మేము కొంతసేపు ధ్యానము చేసి, వెచ్చని నిద్ర సంచులు ధరించి నిద్రపోయాము. అర్ధరాత్రి సమయాన నాకు అధిచేతన అనుభవమొకటి కలిగింది. ఒక నల్లని మేఘము నాపైకి వచ్చి నన్ను కబళించుటకు ప్రయత్నించింది. అప్పుడు నేను “భగవాన్ – నన్ను కాపాడు” అని గట్టిగా అరిచాను. నా అరుపులకు భయపడి నా గదిలో నిద్రిస్తున్న ఆనందమాత ఉమామాతగార్లు మేల్కొని ఏమి జరిగిందన్నారు. “దీనిని గురించి తరువాత మాట్లాడుకుందాం! నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. మీరు నిద్రపోండి” అని అన్నాను. ధ్యానసాధన ద్వారా మనకు అతీంద్రియ జ్ఞానము లభిస్తుంది. నాకున్న అతీంద్రియ జ్ఞానము ద్వారా ఈ దర్శనము వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొన్నాను. త్వరలో నాకు పెద్ద జబ్బు రావచ్చునని నాకే కాకుండా యావత్ ప్రపంచానికి ఏదో కీడు సంభవించవచ్చు అని అనిపించింది. అయితే నేను ఆ పరమాత్మ శరణు కోరడంవలన ఆ కారు మేఘము నన్ను పూర్తిగా మ్రింగలేదు. వాస్తవానికి కొన్నాళ్ళ తరువాత నేను పెద్ద ఆపదను ఎదుర్కొన్నాను. ఇలాగే ప్రపంచానికి కూడా పెద్ద కీడు సంభవిస్తుంది. దాని నుండి బయటపడుటకు భగవంతుణ్ణి గట్టిగా ప్రార్థించవలసి ఉంటుంది.

ఆ మరుసటి రోజు ఉదయము తొమ్మిది గంటలకు బాబాజీ గుహకు నడవడము ప్రారంభించాము. దారిలో కొంతసేపు గుర్రాలపైన, కొంతసేపు డోలిలలోనూ ప్రయాణము సాగింది. (ఒక కుర్చీలాంటి దానిని నాలుగు వైపుల నాలుగు తాళ్ళతో రెండు బలమైన కొయ్యలకు కట్టి ఉంటారు. ఈ రెండు కొయ్యలను ముందు ఇద్దరు, వెనుక ఇద్దరు కూలీలు తమ భుజాలమీద వేసుకొని నడుస్తారు. నడవలేనివాళ్ళను కుర్చీలో కూర్చొబెట్టుకొని మోసుకుపోతారు. దీనిని డోలి అని అంటారు.

కొండపైకి నడిచాము. నిజం చెప్పాలంటే నడుస్తూనే ఉన్నాము. ఒక్కొక్క చోట దారి చాలా ఎత్తుగా నిటారుగా ఉంది, అటువంటి ప్రదేశాలలో మోకాళ్ళపైనా చేతులమీద ఎగబాకాము. దారిలో రెండు చోట్ల రెండు విశ్రాంతి గృహాల వద్ద కొంతసేపు సేద తీర్చుకున్నాము. రెండవ విశ్రాంతి గృహము ఒక ప్రభుత్వ భవనము. గుహ నుండి తిరుగు ప్రయాణంలో ఈ భవనంలోనే మేము బస చేయవలసి ఉంది. సాయంత్రం ఐదు గంటలకు సూర్యాస్త సమయానికి గుహను చేరాము. అది సూర్యుని కాంతియో లేదా పరమాత్మ తేజమో తెలియదు కానీ అచట వాతావరణము మొత్తము బంగారు వన్నె రంగులో మెరుస్తూ ఉంది.

ఆ ప్రదేశంలో చాల గుహలున్నాయి. ఒక పెద్ద బండరాయి వద్ద ఒక పెద్ద గుహ ఉంది. బహుశా ఆ బండరాతిపై బాబాజీ నిలబడి ఉన్నప్పుడు లాహిరీ మహాశయులు బాబాజీని చూచి ఉండవచ్చు. అక్కడే ఇంకొక గుహ కూడా ఉంది. దానిలోకి పోవాలంటే, మోచేతులు మోకాళ్ళపై ప్రాకుతూ లోపలికి పోవాలి. బాబాజీ నివసించేది ఈ గుహయే కావచ్చు. బాబాజీ నివాసమున్న నూరేండ్ల తరువాత ఆ గుహ ద్వారము ప్రకృతి వైపరీత్యాలకు గురియై ఎంతగానో మారినట్లు ఉంది. గుహ లోపల చాలాసేపు ధ్యానం చేశాము. మన గురువుగారి శిష్యులందరికి, యావత్ ప్రపంచానికి మేలు జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించాము. అంతటి ప్రశాంతత, నిశ్చలతను నేను ముందెన్నడు అనుభవించి ఉండలేదు. ఆ దివ్య సన్నిధిలో నిశ్శబ్ద స్వరము గట్టిగా మాట్లాడింది. సాక్షాత్కార తరంగాలు నా చైతన్యం గుండా ప్రవహించసాగాయి. ఆ రోజు నేను చేసిన ప్రార్థనలు ఫలించాయి.

మా సందర్శన స్మారక చిహ్నంగా మరియు దివ్యమైన మహావతార్ కు గురుదేవుల శిష్యుల గౌరవం మరియు భక్తికి చిహ్నంగా, సెల్ఫ్-రియలైజేషన్ చిహ్నం కలిగిన ఒక చిన్న కండువాను గుహలో మేము ఉంచాము.

చీకట్లో మేము తిరుగు ప్రయాణము ప్రారంభించాము. మా యాత్రలో చాల మండి గ్రామవాసులు కూడా పాల్గొన్నారు. వారిలో కొందరు తెలివిగా కిరోసిన్ లాంతర్లు తెచ్చారు. ఆ పరమాత్మను కీర్తిస్తూ మేము కొండక్రిందికి దిగాము. దారిలో 9గంటలకు మాతోపాటు వచ్చిన ఒక అధికారి ఇల్లు చేరుకొన్నము. ఆ ఇంట్లో కొంత విశ్రాంతి తీసుకున్నాము. ఆ ఇంటి బయట వేసిన చలిమంట చుట్టూ కూర్చొని చలి కాచుకున్నాము. అప్పుడు మేము మంటల్లో కాల్చిన ఉర్లగడ్డలు, నల్లని బ్రెడ్ (రొట్టె) తిన్నాము, టీ త్రాగినాము. నిప్పులపై/మంటపై వేడి చేసిన రొట్టె కారు నలుపుగా ఉంది. ఆ పవిత్ర హిమాలయ ప్రాంతంలో, ఆ చల్లటి రాత్రిలో ఆ భోజనము ఎంతో రుచిగా అనిపించింది. ఆ ఆహారాన్ని నేనెన్నటికీ మరువలేను.

అర్ధరాత్రి సమయానికి మా దారిలోనున్న ఒక ప్రభుత్వ విశ్రాంతి భవనం చేరుకొన్నము. రాత్రి మొత్తము ఆ భవనంలోనే గడపాలి. ఆ తరువాత చాల మంది ఇలా అన్నారు. “ఆ కొండ ప్రాంతంలో భయంకరమైన పాములు, పులులు, చిరుతపులులు రాత్రులలో సంచరిస్తూ ఉంటాయి. కావున ఎవరు రాత్రులలో ఆ గుహకు ప్రయాణము చేయరు. భగవంతునిపైన మీకున్న నమ్మకమే మిమ్ములను సురక్షితంగా ఇక్కడికి చేర్చింది.” తెలియకపోవడం ఒక్కొక్కసారి మంచిదే అవుతుంది. భయపడవలసినదేమీ జరగలేదు. ప్రమాదముందని తెలిసి ఉండినా సరే! మాకు రక్షణ ఉండేది. అయినప్పటికి బాబాజీ గుహకు రాత్రులలో ప్రయాణము చేయడము మంచిది కాదు.

ఆ రోజంతా కాట్ గోదమ్ రైల్వే స్టేషన్ అనుభవము నా మనస్సులో నిలిచి ఉంది. గత జన్మల స్మృతులు (జ్ఞాపకాలు) నా మదిలోకి వస్తూనే ఉన్నాయి.

"నా స్వభావము ప్రేమ"

ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నేను ధ్యానానికి కూర్చున్నాను. అప్పుడు నా గది బంగారువన్నె కాంతితో మెరిసిపోయింది. ఆ బంగారు కాంతి మిరుమిట్లుగొలుపు నీల వన్నెలకాంతిగా మారింది. ఆ కాంతిలో మన ప్రియతమ బాబాజీగారు సాక్షాత్కరించారు. ఈసారి వారు ఇలా అన్నారు, “అమ్మా! తెలుసుకో! నన్ను దర్శించుట కొరకు ఈ ప్రదేశానికి (గుహకు) రానవసరము లేదు. ఎవరయితే భక్తి ప్రపత్తులతో నమ్మి పిలుస్తారో వారు నా స్పందనను అనుభూతి చెందుతారు.” ఇదే బాబాజీ ఇచ్చిన సందేశము మనందరికి. ఎంత సత్యము! మౌనంగా పిలిస్తే తక్షణమే బాబాజీ స్పందనను అనుభూతి చెందుతారు.

అప్పుడు నేను ఇలా అన్నాను, “బాబాజీ! మా గురువుగారు ఇలా బోధించేవారు. మాకు వివేకపూర్వక జ్ఞానము అవసరమయినప్పుడు యుక్తేశ్వర స్వామిని ప్రార్థించండి, ఎందుకంటే వారు జ్ఞానావతారులు; పరమానందాన్ని ఎప్పుడయిన చవిచూడాలనిపిస్తే, అప్పుడు లాహిరీ మహాశయులను ప్రార్థించండి.” అయితే బాబాజీ, “మీ స్వభావమేమిటో నాకు తెలియచేయండి” అలా నేను అడిగానో లేదో నా హృదయము ప్రేమతో, పరిపూర్ణ ప్రేమతో కొన్ని లక్షల ప్రేమానుభావాలతో నిండిపోయింది.

బాబాజీ, దివ్యప్రేమ స్వరూపులని వారు తన నోటితో చెప్పకనే నాకు తెలిసిపోయింది. అయినప్పటికి బాబాజీ మృదుమధుర కంఠంతో ఇలా అన్నారు, “నా తత్వము ప్రేమ. ఎందుకంటే ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు.”

ఇలా చెబుతూనే, ఆ దివ్య నీలరంగు కాంతిలోనే నెమ్మదిగా బాబాజీ అదృశ్యులయ్యారు.

మన గురువుగారు శరీరాన్ని చాలించుటకు కొన్ని రోజుల ముందు చెప్పిన మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. నేను వారిని ఇలా అడిగాను, “గురుదేవా! సాధారణంగా ఒక వ్యవస్థను స్థాపించిన నాయకుడు చనిపోయిన తరువాత ఆ వ్యవస్థ నెమ్మదిగా క్షీణించిపోతుంది. కావున మీరు లేకుండా ఈ వ్యవస్థను ఎలా నడుపగలము? భౌతిక రూపంలో మీరు లేనప్పుడు ఎవరు ఈ సంస్థను నడుపగలరు? ఎవరు మాకు ప్రేరణను కలిగించగలరు?” అప్పుడు గురువుగారు, “నేను ఈ ప్రపంచాన్ని వదిలిపోయిన తరువాత ప్రేమ మాత్రమే నా స్థానంలో ఉండి ఈ సంస్థను నడిపించగలదు. ఆ పరమాత్మ ప్రేమను రాత్రి పగలు బేధము లేకుండా త్రాగు. అప్పుడు ప్రేమ తప్ప ఏదీ అవసరము లేదని తెలుసుకుంటావు. ఆ దివ్య ప్రేమను అందరికి పంచిపెట్టు.” ఇదే బాబాజీ సందేశము కూడా! ఇదే ఈ యుగ సందేశము కూడా!

“భగవంతుని ప్రేమించుము – అందరి కోసము ప్రేమించుము.” అనే సనాతన ధర్మాన్నే ఈ భూమిపై అవతరించిన మహాత్ములందరు ప్రబోధించారు. ఈ సత్యాన్నే మనమందరము మన జీవితాలలో ఆచరించాలి. ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇది చాల అవసరము. ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? ద్వేషము, స్వార్థము, లోభము (దురాశ) ప్రపంచాన్ని నాశనము చెందించకుండా ఉండేందుకు మనము దివ్యసైనికులుగా మారి ప్రేమ, దయ, ఆప్యాయత – అనే ఆయుధాలతో పోరాడాలి. ఇదే ప్రస్తుతమున్న అత్యవసర పరిస్థితి.

నా ప్రియమైన ఆత్మస్వరూపులారా! నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. గుర్తుంచుకోండి! బాబాజీ ఉన్నారు. జీవించే ఉన్నారు. వారి సందేశము సనాతన దివ్యప్రేమ. స్వార్థము, సంకుచితముతో కూడిన వ్యక్తిగత సాధారణ మానవ సంబంధాలకు సంబంధించిన ప్రేమను నేను ప్రస్తావించడము లేదు. క్రీస్తు తన శిష్యులకు, మన గురువుగారు మనకు అందించిన నిర్నిబంధమైన ప్రేమను గురించి మీకు విన్నవించుకుంటున్నాను. ఇలాంటి ప్రేమనే మనమందరము అందరికి అందించాలి. ఆ ప్రేమ కొరకు పరితపించాలి. ప్రేమ, దయ, సానుభూతి కోసము పరితపించని వారెవరు ఈ గదిలో లేరు.

మనము ఆత్మస్వరూపులము. ఆత్మ స్వభావము పరిపూర్ణత. కావున పరిపూర్ణత లేని దానితో మనము తృప్తి పడకూడదు. అయితే మనకు ప్రియమైనవాడు, మనకు తల్లి, తండ్రి, మిత్రుడు – అన్నీ ఆయనే ! ఆ పరమాత్మను తెలుసుకుంటేగాని పరిపూర్ణత అంటే ఏమిటో తెలియదు.

Share this on

This site is registered on Toolset.com as a development site.