యోగదా సత్సంగ

సన్యాస పరంపర

భగవదన్వేషణకు, శ్రీ శ్రీ పరమహంస యోగానంద ఆధ్యాత్మిక, మానవతా కార్యానికి అంకితమైన సన్యాసుల సమూహం

YSS_Monastics_Ranchi

ఉపోద్ఘాతం

భగవంతుడిని దర్శించాలనుకునేవారు ఈ సంపూర్ణ సమర్పిత మార్గాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. వారికి భగవంతుడు తప్ప మరో ధ్యాస ఉండదు. ఆ త్యాగమయుల ఆకాంక్షల ప్రకారం జీవించే వారికి ఆయన తనను తాను వెల్లడిస్తాడు: ‘భగవంతుడే నా జీవితం. భగవంతుడి పట్లే నా ప్రేమ. నా హృదయాన్ని ఎడతెగని ఆరాధన వైపు నడిపించే దేవాలయం దేవుడు. దేవుడే నా లక్ష్యం. భగవంతుని నుండి అరువు తెచ్చుకున్న శక్తి లేకుండా ఏ కర్తవ్యం నిర్వహించబడదు, కాబట్టి ఆయనను కనుగొనడమే నా అత్యున్నత కర్తవ్యం.

— పరమహంస యోగానంద

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.)కు పరమహంస యోగానంద స్థాపించిన, అంకితమైన సన్యాసుల క్రమమే మూలాధారమై ఉంది.

వై.ఎస్.ఎస్. సన్యాసులు భారతదేశం మరియు చుట్టుపక్కల దేశాలలోని ప్రాంతాలలో ఆధ్యాత్మిక, మానవతా, సేవా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పరమహంసజీ మరియు ఆయన ప్రత్యక్ష శిష్యుల రచనలను, రికార్డింగులను ప్రచురించడం, ఆధ్యాత్మిక సలహాలు అందించడం, సత్సంగాలు, సభలు, ఉపన్యాస పర్యటనలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. భవనాల నిర్వహణ, ఉద్యానవనాలలో ధ్యాన తరగతులు మరియు ఆశ్రమాల నిర్వహణ, వై.ఎస్.ఎస్. పాఠాలు మరియు పుస్తకాల పంపిణీని పర్యవేక్షించడం, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థ యొక్క పనిని కొనసాగించడానికి అవసరమైన అనేక పరిపాలనా కార్యకలాపాలు, కార్యాలయాల నిర్వహణ మరియు అనేక ఇతర విధులను వారు నెరవేరుస్తున్నారు.

ఏదేమైనప్పటికీ, ప్రతి యోగదా సత్సంగ సన్యాసి యొక్క ప్రధానమైన విధానం ఏమిటంటే, స్వచ్ఛమైన ప్రేమ మరియు భగవంతుని పట్ల వాంఛతో ప్రతిరోజూ ఎదగడం — అహంతో కూడుకున్న అన్ని తక్కువ స్థాయి కోరికలన్నింటినీ అదుపులో వుంచుకోవటం — తద్ద్వారా, ప్రతి క్షణం, ప్రతి రోజూ, జీవితంలో అంతిమ క్షణం వరకు ఆ భగవంతుని ఉనికిని అనుభవిస్తూ ముక్తిని పొందడం.

Paramahansa Yoganandaji with Daya Mataji

శ్రీ పరమహంస యోగానంద శ్రీ దయామాతతో. శ్రీ దయామాత సన్యాసం స్వీకరించిన తొలి తరం శిష్యులలో ఒకరు. ఆమె 1931లో ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమంలోకి ప్రవేశించిన వెంటనే, గురువు ఆమెతో ఇలా అన్నారు: “నువ్వు నా గూటిలోని అండానివి నువ్వు. అనంతర కాలంలో చాలా మంది నిజమైన భక్తులు ఈ మార్గంలోకి ఆకర్షితులవుతారని నాకు నువ్వు వచ్చినప్పుడే తెలుసు.”

శతాబ్దాల నాటి సంప్రదాయం

అన్ని యుగాలలోనూ, మానవ ఆత్మ యొక్క అత్యంత ప్రగాఢమైన ప్రేరణ, అన్వేషణ, పరిపూర్ణమైన ప్రేమ, అవగాహన, ఆనందం, పరిపూర్ణత, సత్యం కోసమే. ప్రపంచంలోని అన్ని గొప్ప మతాలలో, ఆ దైవిక అన్వేషణకు తమను తాము హృదయపూర్వకంగా సమర్పించడానికి కుటుంబ జీవితాన్ని మరియు ప్రాపంచిక వాంఛలను విడిచిపెట్టడానికి నిర్ణయించుకున్న వారు ఉన్నారు.

ఈ శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని అనుసరించి, యోగదా సత్సంగ సన్యాసులు తమ జీవితంలో నాలుగు అంశాలను అనుసరించి ఈ సర్వసంగ పరిత్యాగ దీక్షను స్వీకరిస్తారు : అవి నిరాడంబరత, బ్రహ్మచర్యం, విధేయత, విశ్వసనీయత. తూర్పు, పశ్చిమాలు రెండు చోట్లా ఉన్న మత నియమాలలో, ఇటువంటి ప్రమాణాలు సన్యాస జీవితానికి పునాది.

భారతదేశపు ప్రాచీన స్వామి క్రమం

శ్రీ పరమహంస యోగానంద, ఆయన గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్, భారతదేశంలోని ప్రాచీన సన్యాస పరంపరలో ఒక భాగం. శతాబ్దాల క్రిందటి ఈ సన్యాశాశ్రమ నియమం ఆదిశంకరాచార్య ద్వారా ప్రస్తుత రూపంలో పునర్నిర్మించబడింది. పూజ్య గురువుల పరంపర నేటికీ కొనసాగుతోంది. సన్యాస పరంపరను విడిచిపెట్టిన వారందరూ వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆదిశంకరాచార్యుల నుండి గుర్తించారు. వారు నిరాడంబరతను (ఆస్తితో సంబంధం లేనివారు), పవిత్రతను ఆచరిస్తామని, మఠాధిపతికి లేదా ఆధ్యాత్మిక అధికారానికి విధేయత చూపుతామని ప్రతిజ్ఞ చేస్తారు. స్వామి శ్రీయుక్తేశ్వర్ మరియు శ్రీ పరమహంస యోగానందకు చెందిన గిరి (“పర్వతం”) శాఖతో సహా సన్యాస పరంపరలో 10 ఉపవిభాగాలు ఉన్నాయి. సన్యాస దీక్షను స్వీకరించే వై.ఎస్.ఎస్. సన్యాసులు కూడా అదే పరంపరకు చెందుతారు.

శ్రీ దయామాత (1914-2010) మరియు ప్రాపంచిక జీవితాన్ని త్యజించి తమ జీవితాలను పూర్తిగా భగవంతునికి సమర్పించాలని కోరుకునే ఇతర అంకితభావం గల శిష్యుల రాకతో పరమహంస యోగానందగారు 1930వ దశకం ప్రారంభంలో మొదటి ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. సన్యాసుల సంఘాన్ని స్థాపించారు. 1952లో పరమహంసజీ పరమపదించిన తర్వాత, ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్.లోని సన్యాసుల సంఘాలు ఆయన తరువాత ఆ సంఘం అధ్యక్షులుగా మరియు ఆధ్యాత్మిక అధిపతులుగా వచ్చిన శిష్యుల నాయకత్వంలో అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి.

భారతదేశం, USA మరియు యూరప్ ‌లోని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆశ్రమ పరిసరాలలో సన్యాస శిక్షణా కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో శ్రీ దయామాత చాలా చురుకైన ఆసక్తిని కనబరుస్తూ, ఆమె సుదీర్ఘ పదవీకాలంలో కీలక పాత్ర పోషించారు. ఎస్.ఆర్.ఎఫ్. వైస్ ప్రెసిడెంట్ ‌గా పనిచేసిన శ్రీ మృణాళినీమాత (1931–2017) ద్వారా అనేక దశాబ్దాలుగా ఈ ప్రయత్నాలలో ఆమెకు సహాయం అందించారు. 2011లో వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలిగా శ్రీ దయామాత తర్వాత శ్రీ మృణాళినీమాత బాధ్యతలు స్వీకరించారు. 2017లో శ్రీ స్వామి చిదానంద గిరి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ యొక్క సన్యాసుల సంఘాలకు మార్గనిర్దేశం చేసే బాధ్యతను ఆయన స్వీకరించారు. ఈ సంఘాలు నేటికీ అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వందలాది మంది సన్యాసులతో నిండి ఉన్నాయి. వారు తమ జీవితాలను భగవదన్వేషణకు, మానవాళికి సేవ చేయడానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆశ్రమ దైనందిన జీవితం

ఒక సన్యాసిగా, నా జీవితం భగవంతుని అపరిమిత సేవకు, ఆయన సందేశంతో అనేక హృదయాలను ఆధ్యాత్మికంగా మేల్కొల్పడానికి అర్పించబడింది …. భగవంతుడు మరియు నా గురువు మరియు పరమగురువులు నా ద్వారా ప్రారంభించిన ఈ సంస్థాగత కార్యం, తమ జీవితాలను భగవంతుని సేవకు, ప్రేమ యొక్క అత్యున్నత లక్ష్యాల సాధనకు అంకితం చేసిన వారిచే నిర్వహించబడుతుంది.

— పరమహంస యోగానంద

ఒకే లక్ష్య సాధనకు ఒక్కటైన విభిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు

సన్యసించినవారి యొక్క సమున్నత ఆదర్శం ఏమిటంటే, భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రేమించడం, తోటి జీవులను ప్రేమించడం. కేవలం సిద్ధాంతంలో మాత్రమే కాక రోజువారీ జీవితంలోని అన్ని పరస్పర చర్యలలోనూ, ప్రతి వ్యక్తిలో భగవంతుని ప్రతిరూపాన్ని చూడటంలోనూ, ప్రతి ఒక్కరి అవసరాలను మన స్వంత అవసరాలుగా భావించడంలోనూ వారందరికీ సారూప్యత ఉంటుంది. “ఒకప్పుడు మనం అపరిచితులం. కానీ మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం సోదరసోదరీమణులం అవుతాము” అని పరమహంసజీ అన్నారు.

వై.ఎస్.ఎస్. సన్యాసులు విభిన్నమైన నేపథ్యాల నుండి వచ్చారు – విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన వారు, విభిన్న మత విశ్వాసాలతో పెరిగినవారు, విభిన్న విద్యార్హతలు కలిగినవారు, విభిన్న వృత్తులలో రాణించినవారు వారిలో ఉన్నారు. కానీ సన్యాసులందరికీ ఉమ్మడిగా ఉన్నది దేవుని కోసమే జీవించాలనే తీవ్రమైన కోరిక.

స్వీయ-క్రమశిక్షణ, ఆత్మపరిశీలన, అంకితభావంతో కూడిన ధ్యానం మరియు ప్రేమతో కూడిన సేవలో తనను తాను పూర్తిగా సమర్పించుకోవడం ద్వారా సన్యాసి, అపరిమిత ఆత్మానందాన్ని, ఆ భగవంతుడు మాత్రమే ఇవ్వగల అత్యున్నత ప్రేమను అనుభవించడానికి ప్రయత్నిస్తాడు.

వై.ఎస్.ఎస్. ఆశ్రమంలో సన్న్యాసుల నిత్య జీవితం

ఆశ్రమంలో దైనందిన జీవితం

వై.ఎస్.ఎస్. ఆశ్రమంలో సన్న్యాసుల నిత్య జీవితం

‘‘ఆశ్రమంలో జీవితం చాలా నిరాడంబరంగా, నిర్మలంగా ఉంది. అదే సమయంలో చాలా గొప్ప బహుమతిలా అనిపిస్తోంది. నిజమైన, శాశ్వతమైన ఆనందానుభూతి, సంతృప్తి, నా అంతరంగానికి అనంతమైన భద్రత మరియు పోషణ లభిస్తున్నాయన్న లోతైన భావన నాకు కలుగుతోంది.’’

— తొమ్మిదేళ్లుగా ఆశ్రమంలో ఉన్న సన్యాసి

సన్యసించిన వ్యక్తి యొక్క రోజువారీ సమయసారిణి, ఆ ఆశ్రమం, అతనికి కేటాయించిన పనిపై ఆధారపడి ఉంటుంది. కానీ అది ఎల్లప్పుడూ సమతుల్య ఆధ్యాత్మిక జీవితం కోసం పరమహంసజీ నొక్కిచెప్పిన ప్రాథమిక అంశాలను కలిగి ఉంటుంది: ధ్యానం మరియు ప్రార్థన, సేవ, ఆధ్యాత్మిక అధ్యయనం, ఆత్మపరిశీలన, వ్యాయామం, వినోదం మరియు నిశ్శబ్ద ఏకాంత సమయం.

గురు కార్యానికై సేవ

వై.ఎస్.ఎస్. సన్యాసులు వివిధ రూపాలలో సమాజం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి, మానవతా కార్యానికి సేవలు అందిస్తున్నారు:

 • పరమహంసజీ మరియు ఆయన ప్రత్యక్ష శిష్యుల రచనలు మరియు రికార్డింగులను (అన్ని మాధ్యమాలలో) ప్రచురించడం
 • ఆధ్యాత్మిక సలహాలను అందించడం
 • సత్సంగాలు, సభలు, ఉపన్యాస పర్యటనలు నిర్వహించడం
 • భారత ఉపఖండంలో 200 కంటే ఎక్కువ కేంద్రాలు, మండళ్ళకు మార్గదర్శకత్వం
 • వై.ఎస్.ఎస్. భవనాలు, ధ్యాన ఉద్యానవనాలు మరియు ఆశ్రమాలను నిర్వహించడం
 • వై.ఎస్.ఎస్. పాఠాలు, పుస్తకాలు, ఈబుక్ ‌లు మరియు రికార్డింగుల పంపిణీని పర్యవేక్షించడం
 • ఈ ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థ యొక్క పనిని కొనసాగించడానికి అవసరమైన అనేక పరిపాలన, కార్యాలయం మరియు ఇతర విధులను నిర్వహించడం
భక్తులకు ఆధ్యాత్మిక సలహాలు అందిస్తున్న వై.ఎస్.ఎస్. సన్న్యాసి

ఈ విభిన్న కార్యకలాపాలలో ఆధునిక పద్ధతులు ఉపయోగించబడుతున్నప్పటికీ, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురువులు పరమహంస యోగానందగారి ద్వారా ప్రపంచానికి అందించడానికి నిర్దేశించిన కొన్ని ప్రత్యేక నియమాల స్వచ్ఛతను, స్ఫూర్తిని ఎల్లప్పుడూ కాపాడుకోవడమే మార్గదర్శక సూత్రం. ప్రతి వై.ఎస్.ఎస్. సన్యాసి యొక్క అత్యున్నతమైన ఆకాంక్ష ఏమిటంటే, భగవదన్వేషణలో, భగవంతుని మార్గంలో దినదినాభివృద్ధి సాధించటం. దానివల్ల అందరి పట్ల అవగాహన కలుగుతుంది, అందరికీ కరుణతో సేవ చేయడం సాధ్యపడుతుంది.

‘‘నిజాయితీ, నిబద్ధత కలిగిన మహితాత్ములతో నిండిన నా గురు ఆశ్రమాలలో జీవించడం, సేవ చేయడం మరియు భగవంతుడిని అన్వేషించడం, స్వేచ్ఛగా ఉండడం ఎంతో గొప్ప దీవెన అని నేను మరింతగా గ్రహించాను.’’

— ఏడేళ్లుగా ఆశ్రమంలో ఉన్న సన్యాసి

సన్యాస జీవితంలో నాలుగు దశలు

నా జీవితాన్ని, నా దేహాన్ని, నా ఆలోచనలను, నా వాక్కును
నేను నీ పవిత్ర చరణాల వద్ద సమర్పించాను.
ఎందుకంటే అవి నీవి; ఎందుకంటే అవి నీవే.

— పరమహంస యోగానంద

YSS ఆశ్రమాలలో సన్యాస జీవితంలో నాలుగు దశలు ఉన్నాయి. ఈ సమర్పిత జీవితం, సన్యాస దీక్ష స్వీకరించే సమయంలో వారు చేసిన ప్రమాణాల పట్ల వారి నిబద్ధతను క్రమంగా లోతుగా పెంచడానికి ఈ జీవనశైలి ఉపకరిస్తుంది. ఈ దశలకు నిర్దిష్టమైన గడువు ఏమీ ఉండదు. అది ఎల్లప్పుడూ వ్యక్తిగత ప్రాతిపదికన పరిగణించబడుతుంది. సన్యాస జీవితానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకోవడానికి ఆ పరిత్యాగి యొక్క సంసిద్ధత, సాధనలను బట్టి ప్రతి సన్యాసి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఆధారపడి ఉంటుంది.

మీరు భగవంతుని పిలుపును విన్నారా?

సన్యాస జీవితం

నీ మనస్సును నాకు సమర్పించు. నా భక్తుడివి అవ్వు. అన్ని విషయాలు నాకు విడిచిపెట్టు. నాకు ప్రణమిల్లు. నువ్వు నాకు ప్రియమైనవాడివి, కాబట్టి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను: నువ్వు నన్ను చేరుకుంటావు! అన్ని ఇతర ధర్మాలను విడిచిపెట్టి, నన్ను మాత్రమే స్మరించు!

— పరమహంస యోగానంద

మీ జీవితాన్ని సంపూర్ణంగా భగవంతుడికి, గురువుకు, వారు నిర్దేశించిన భాగవత్కార్యానికి అంకితం చేయాలని మీకు హృదయపూర్వకంగా అనిపిస్తోందా?

అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కలిసి కష్టపడుతున్న దేవుణ్ణి అన్వేషించే మహితాత్ముల సంఘంలో భాగస్వాములు కావాలని మీరు ఆరాటపడుతున్నారా?

అలా అయితే, మీరు పరిత్యాగ జీవితాన్ని ఆ అంతరాత్మ పిలుపుకు సమాధానంగా పరిగణించవచ్చు.

సాధారణ అవసరాలు (ప్రతి దరఖాస్తుదారు యొక్క పరిస్థితులు మరియు అర్హతలకు వ్యక్తిగత పరిశీలన ఉంటుంది):

 • ఒంటరిగా ఉన్నవారు
 • మంచి శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉన్నవారు
 • కుటుంబం మరియు ఇతర బాధ్యతలు లేనివారు
 • యోగదా సత్సంగ పాఠాల విద్యార్థి
 • 18 మరియు 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు
 • ఇంగ్లీషును బాగా అర్థం చేసుకుని మాట్లాడగలిగేవారు

ఆధ్యాత్మికంగా మద్దతునిచ్చే వాతావరణంలో పరమహంస యోగానందగారి మానవతా కార్యానికి సేవలందిస్తూనే, భగవంతునితో మీ వ్యక్తిగత సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి వై.ఎస్.ఎస్. ఆశ్రమంలో నివసించడం ఒక ఆశీర్వాదాన్ని, అవకాశాన్ని అందిస్తుంది.

మమ్మల్ని సంప్రదించేందుకు మీకు శుభాహ్వానం

పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో స్వీయ-అభివృద్ధి, ధ్యానం మరియు మానవాళికి సేవ చేయడానికి అంకితమైన జీవితాన్ని గడపడానికి అవకాశం గురించి మరింత తెలుసుకోవడానికి, మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

సన్యాసం: ఆదర్శాలు, అంకితభావం మరియు భక్తితో కూడిన జీవితమే సన్యాస జీవితం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు 2019లో వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని స్మృతి మందిరంలో సన్యాస పరంపరలో చేరిన నూతన దీక్షాపరులతో
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి 2019లో వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని స్మృతి మందిరంలో సన్యాస పరంపరలో చేరిన నూతన దీక్షాపరులతో

వంద సంవత్సరాల క్రితం, జూలై 1915లో, పరమహంస యోగానందగారు భారతదేశంలోని శ్రీరాంపూర్‌లో తన గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ నుండి సన్యాస దీక్షను స్వీకరించడం ద్వారా ఆయన భారతదేశపు ప్రాచీన సన్యాసుల పరంపరలో భాగస్వాములయ్యారు. ఈ సంఘటన ఇరవై రెండేళ్ళ ముకుంద లాల్ ఘోష్ జీవితంలో ఒక మలుపు మాత్రమే కాదు, ఆ సమయంలో ఆయన స్వామి యోగానంద గిరిగా మారారు. ఆ పరిణామం 20వ శతాబ్దంలో ప్రపంచ ఆధ్యాత్మికతపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. ఆయన తన సన్యాస వారసత్వ నిర్మాణంలో భాగంగా స్థాపించిన సన్యాసుల సంప్రదాయం కారణంగానైనా దానిని ఒక అద్భుతమైన మలుపుగానే పరిగణించాలి.

ఈ రోజు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సన్యాస సమూహాలతో పరమహంస యోగానందగారి సన్యాస పరంపర వర్ధిల్లుతోంది. ఈ సన్యాస పరంపర వై.ఎస్.ఎస్. యొక్క వృద్ధిని సుస్థిరం చేసింది. భారత ఉపఖండంలో యోగా యొక్క విస్తృత వ్యాప్తికి అది సహాయపడుతోంది.

ఆహ్వానం

ఒంటరిగా వుండి, 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సులో, మంచి శారీరక, మానసిక ఆరోగ్యంతో, కుటుంబ బాధ్యతలు లేకుండా, సన్యాస సమూహాలలో పరిత్యాగిగా ఆ భగవదన్వేషణకు, ఆయనను సేవించడానికి తమను తాము అంకితం చేయాలనే హృదయపూర్వక ఆకాంక్ష ఉన్నవారు యోగదాను సంప్రదించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి సమాచారం కోసం సత్సంగ శాఖా ఆశ్రమం, రాంచీని సంప్రదించగలరు.