శ్రీ దయామాత జ్ఞాపకాలలో

(జనవరి 31, 1914 – నవంబరు 30, 2010)
భగవంతుని అంకిత సేవలో వినయ ప్రేమ మూర్తి

శ్రీ దయామాత దివ్య చిరునవ్వు.

నవంబర్ 30, 2010న మన ప్రియతమ సంఘమాత మరియు అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాత అమర దైవసాన్నిధ్యానందం కోసం ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడి వెళ్ళారు. గురుదేవులచే ఎంపికచేయబడి, ఆయన ఆశయ సాధనకోసం, గురుదేవుల బోధనలను అనుసరించే వారికి ఒక ఆధ్యాత్మిక జననిగా ఆయన కార్యచరణ ఆశయాలను ముందుకు నడిపించడానికి ఒక దిశానిర్దేశ శక్తిలా, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థల సన్యాసులకు మరియు సభ్యులందరికీ జ్ఞానం, కరుణ, ప్రేరణలతో మార్గనిర్దేశం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన శ్రీ పరమహంస యోగానందగారి సంస్థకు ఆధ్యాత్మిక అధిపతిగా 55 సంవత్సరాలు పైగా నడిపించారు. తమ జీవితాలు ప్రేమ, సానుభూతులతో స్పృశించబడిన వారందరూ ఈ పరిపూర్ణ ఆధ్యాత్మిక మూర్తి లేని లోటును జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవిడ తరచూ చెప్పినట్లుగా, “దైవ ప్రేమ ఈ జీవితపు హద్దులు దాటి వ్యాపిస్తుంది,” అందుచేతనే మన మనస్సు, హృదయాల్లో, శ్రీ దయామాత, గురుదేవుల ఆదర్శాలకు పూర్తిగా అంకితమై, ఆ భగవంతుని బిడ్డలందరినీ ఆదరించిన తల్లిలా చిరస్మరణీయురాలుగా ఉండిపోతారు.

ఒక అసాధారణ జీవితం

Daya Mata Standing.శ్రీ దయామాత ఒక అసాధారణ జీవితాన్ని గడిపారు. అందులో దాదాపు 80 సంవత్సరాలు గురువుదేవుని ఆశ్రమాల్లో సన్యాసినిగా గడిపారు, ఆమె ఆలోచనలన్నీ ఎపుడూ భగవంతుని మీద ప్రేమతో నిండి ఉండేవి, ఆమె చేసే పనులన్నీ భగవత్సేవ కోసమే ఉండేవి. ఆమె ఒక అరుదైన శక్తిని, ప్రేమను అందరికి పంచడంతోపాటు శ్రీ పరమహంస యోగానందవారి ఆధ్యాత్మిక కార్యాచరణాన్ని, మానవతా సేవా కార్యక్రమాలను నడిపించే మహోన్నత బాధ్యతను కూడా నిర్వహించారు. నిజమైన సార్ధక నామధేయురాలుగా “దయతో నిండిన తల్లి”గా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ షరతులు లేని ప్రేమ, దయను పంచారు. ఆధ్యాత్మిక సహాయం కోసం తన్నాశ్రయించిన అసంఖ్యాక ఆత్మలకోసం అనునిత్యం ప్రార్థనలు చేశారు.

నిజమైన వినయానికి ఒక్క అసాధారణమైన ఉదాహరణ, శ్రీ దయమాతగారు తన చైతన్యంలో ఎల్లప్పుడూ భగవంతుణ్ణి అత్యున్నత స్థానంలో ఉంచారు. ఆవిడ ఒకసారి ఇలా అన్నారు, “చాలాసార్లు నేను దేవుని ఎదుట, అలాగే గురుదేవుల ముందు కూడా నన్ను నేనుగా గుర్తు చేసుకుంటాను, ఎక్కువగా కాదు, తక్కువగా కాదు. నేను పరిపూర్ణతను సాధించాననే భావంగాని, నాలో గొప్ప ప్రతిభ ఉందని, అసాధారణ సామర్థ్యాలున్నాయనిగాని నేనెప్పుడు అనుకోను; నా జీవితాశయం ఒక్కటే—భగవంతునిపై నాకున్న ప్రేమలో పరిపూర్ణతను సాధించడం.” ఈ లక్ష్యం పై ఆమెకున్న ఆ విశ్వాసము వలన శ్రీ దయామా ఆ భగవంతుని దివ్యప్రేమను అనేక దివ్యాత్మలకు పంచే ఒక స్వచ్ఛమైన సాధనం అయ్యారు.

గురువుదేవుల బోధనల ద్వార భగవత్సేవ మరియు మానవాళి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. సంతులమైన జీవితం ఎలా గడపాలో చూపించిన ఆదర్శమూర్తి శ్రీ దయామాత, ఆధ్యాత్మిక దైనందిక కార్యక్రమాల్లో రాజీపడకుండా, ఆశ్రమ నిర్వహణ బాధ్యతల వత్తిడిలో కూడా సంతృప్తిని, ఆనందాన్ని అనుభవించగల్గారు. ఆవిడ ఒకసారి ఇలా అన్నారు, “నా విధులన్నీ నేను సక్రమంగా నిర్వహించగల్గుతున్నానంటే వాటిని నా దైనందిన ఆధ్యాత్మిక సాధనలతో పాటు కాదు, వాటివల్లనే. శ్రీ పరమహంస యోగానందగారు నేర్పిన విధంగా ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం నేను చేసే ధ్యానంతోపాటు మిగతా సమయాల్లో నా మనస్సును సదా ఆ భగవంతుని మీద కేంద్రీకరించడం—ఆ సాధన నుండే నాకు శక్తి, ప్రేరణ మరియు మార్గదర్శకత్వం లభిస్తాయి.”

ఒక అపూర్వ శిష్య కుటుంబం

ఫే రైట్ గా జనవరి 31, 1914 సాల్ట్ లేక్ సిటీ, వుటహలో జన్మించిన, శ్రీ దయామాత ఒక విశిష్టమైన కుటుంబంలో పెరిగారు. ఆమె తల్లి, చెల్లెలు మరియు ఇద్దరు తమ్ముళ్ళు, అందరుకూడా, శ్రీ పరమహంస యోగానందగారి శిష్యులైనారు. చెల్లెలు ఆనందమాత 1933లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థలో సన్యాస దీక్షను స్వీకరించి చాలా సంవత్సరాలు ఆ సంస్థ పాలకమండలికి కార్యదర్శిగా మరియు కోశాధికారిగా పని చేశారు. వారి తల్లిగారైన శ్యామామాత 1935లో ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఈ ఇద్దరూ కూడా అంకితభావంతో గురుదేవుల వద్ద ఉండే అత్యంత సన్నిహిత బృందంలో, తమ తుదిదాకా సంస్థకు సేవ చేశారు. తమ్ముడు సి.రిఛర్డ్ రైట్ గురువుదేవుల సుధీర్ఘమైన భారతదేశయాత్రలో ఆయనకు సెక్రటరీగా సహాయపడ్డారు. ఆయన తన డైరీలో వ్రాసుకున్న యాత్రా విశేషాలు పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక విశిష్ట గ్రంథం ‘ఒక యోగి ఆత్మకథ’లో ఉదహరించబడ్డాయి. ఆయన మరియు శ్రీ దయామాతగారి మరో తమ్ముడు డీల్ రైట్ ఇద్దరూ వారి జీవితకాలం మొత్తం ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. సహచరులుగా సేవ చేశారు.

మరింత సంతృప్తినిచ్చేదానికోసం తపన

శ్రీ దయామాతకు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ప్రగాఢమైన కోరికుండేది. ఎనిమిది సంవత్సరాల వయసులో భారతదేశం గురించి మొట్టమొదటిసారిగా విన్నప్పటి నుంచి స్కూల్లోనే అనూహ్యమైన ఒక అంతర్గత జాగృతం కలిగింది. దానితోపాటు తన జీవిత లక్ష్య సాధనకు భారతదేశం మార్గదర్శకమవుతుందని విశ్వాసం కలిగింది. ఇంటికి వచ్చిన వెంటనే అమ్మతో నేను వివాహం చేసుకోనని, భారతదేశం వెళ్తానని చెప్పారు.

చర్చికి వెళ్ళిరావడంలోని అనుభవంలో తనకు ఏదో లోటు అనిపిస్తుంది, మరింత ఎక్కువ సంతృప్తి కోసం ఏదైనా చేయాలనే తపన కలిగింది. తన పదిహేనవ ఏట ‘భగవద్గీత’ పుస్తకం ఒకటి ఆమెకు లభించినప్పుడు, ఆ పుస్తకం ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపింది, ఎందుకంటే దాని ద్వారా ఆమె ఈ విషయాలు నేర్చుకున్నారు, భగవంతుణ్ణి చేరుకోవచ్చని, ఆయన్ని తెలుసుకోవచ్చని, దివ్యత్వం తొణికిసలాడే ఆ పరమాత్ముని బిడ్డలుగా, స్వీయసాధనతో—దైవంతో ఏకత్వాన్ని పొందడం-అనే తమ ఆధ్యాత్మిక జన్మహక్కును సాక్షాత్కారం చేసుకోవచ్చని అర్థమైంది. అప్పుడే శ్రీ దయామాత భగవంతుణ్ణి తెలుసుకోవడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు.

శ్రీ పరమహంస యోగానందతో శ్రీ దయామాత తొలి సమావేశం

1931లో సాల్ట్ లేక్ సిటీలోని హోటల్ న్యూ హౌస్ లో జరిగిన బహిరంగ ఉపన్యాసానికి 17 ఏళ్ల శ్రీ దయామాత తన తల్లి మరియు చెల్లెలితో కలిసి హాజరయ్యారు. ఉపన్యాసకర్త శ్రీ పరమహంస యోగానందగారు యోగశాస్త్రం గురించి అమెరికా అంతటా ప్రయాణిస్తూ, ప్రసిద్ధమైన, జన ఆదరణతో క్రిక్కిరిసిన, అనేక ఉపన్యాస వేదికల్లో తరగతులు, ప్రసంగాలు చేస్తున్నకాలం. సాల్ట్ లేక్ సిటీలోని బిడియస్తురాలైన ఈ చిన్నారి, గురువుగారిని కలుసుకొనే అవకాశం వస్తుందని ఎవరూ అనుకోరు. అయితే శ్రీ దయామాత రక్తసంబంధిత వ్యాధితో చాలా కాలం నుంచి బాధపడుతున్నారు. ఆ సమయంలో ప్రఖ్యాతులైన శ్రీ స్వామివారి బోధనా తరగతులకు హాజరయినప్పుడు ఉబ్బిన ముఖం నిండా ఉన్న పట్టీలు (బెండేజీలు) ఆమెను గురువుగారి దృష్టిలో పడేటట్లు చేసింది.

శ్రీ యోగానందగారితో జరిగిన మొట్టమొదటి సమావేశం గురించి దయామాత ఇలా వర్ణించారు: “నా ఆత్మలోకి ప్రవహిస్తున్న జ్ఞానం మరియు దైవ ప్రేమలో నా ఉనికి మొత్తము లీనమైపోయి, నా హృదయము మరియు మనసును నింపేసాయి.” ఆ మహాయోగికి శిష్యురాలిగా అవ్వాలని ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను.

Play Video

శ్రీ దయామాత శ్రీ పరమహంస యోగానందగారిని కలిసిన మొదటి సందర్భం గురించిన వివరాలతో కూడిన వీడియో.

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. సన్యాసాశ్రమంలో శ్రీ దయామాత చేరడం

ఎన్సినీటస్ వద్ద దయామాతతో పరమహంస యోగానంద.“భగవంతుడు నీ జబ్బు నయం చేస్తాడనే నమ్మకం నీకుందా?” అని శ్రీ పరమహంస యోగానందగారు అడిగిన విషయాన్ని దయామాత గుర్తు చేసుకున్నారు. నేను ‘అవును’ అని సమాధానం చెప్పగానే ఆయన నా నుదురు భాగంలోని రెండు కనుబొమల మధ్యన తాకి ఇలా అన్నారు, “ఈ రోజు నుంచి నీ జబ్బు నయమైపోతుంది. ఒక వారం రోజుల్లో నీ ముఖానికి కట్టుకున్న పట్టీల అవసరం ఉండదు. దాని వలన ఏర్పడిన మచ్చలు కూడా పోతాయి.” ఆయన ఎలా చెప్పారో సరిగ్గా అలాగే జరిగింది. ఆ తర్వాత తన తల్లిగారి సహాయంతో శ్రీ దయామాత లాస్ ఏంజిలిస్ నగరానికి వెళ్ళి సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసి ఆశ్రమంలో నవంబరు నెల 19న 1931లో చేరారు. గురుదేవుల మార్గదర్శకత్వం పై పరిపూర్ణ ఆసక్తి, సానుకూలమైన మనస్సు ఉన్న శ్రీ దయామాతను, శ్రీ పరమహంస యోగానందగారు భవిష్యత్తులో తన సంస్థలో జరగబోయే బృహత్కార్యాలకు ముఖ్యమైన పాత్ర నిర్వహించబోయే సామర్థ్యాన్ని ఆవిడలో గుర్తించడం జరిగింది. శ్రీ దయామాత క్రిస్మస్ పండుగ మొదటిసారి జరుపుకునే సమయం వచ్చినప్పుడు తన నూతన గృహం ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం మరియు ఆశ్రమ శాఖ, మౌంట్ వాషింగ్టన్ కొండమీద నెలకొని ఉన్న చోట శ్రీ పరమహంస యోగానందగారు ఒక గాజుతో చేయబడిన గుడ్డును శ్రీ దయామత మామూలుగా ఎప్పుడూ కూర్చునే దివాన్ పై పెట్టారు. ఇది ఎందుకు పెట్టారు అని ఆవిడ అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు: “నీవు నా పెట్టుబడివి” నీవు రావడంతో ఇంకా చాలామంది నిజమైన భక్తులు ఈ మార్గంలో చేరడానికి వస్తారని నాకు తెలుసు.”

గురువుదేవుల సేవలో

ఆ తర్వాతి సంవత్సరంలో శ్రీ పరమహంసగారు శ్రీ దయామాతకు భారతదేశం యొక్క ప్రసిద్ధ స్వామి పరంపర పద్ధతిలోనే సన్యాసదీక్ష ఇచ్చారు. (బ్రహ్మచర్యం, వస్తు వ్యామోహం లేకపోవడం, భగవంతునికి గురువుకు విధేయత, విశ్వాసం కలిగి ఉండటం). ఆ విధంగా ఆవిడ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల్లో చేరిన మొదటి సన్యాసినులలోని ఒకరిగా, తన హృదయాన్ని, ఆత్మను ఆజన్మాంతం దైవానికి, గురువుకు సంపూర్ణ అంకితభావంతో, నిత్య ధ్యాన సాధన, నిస్వార్థమైన సేవ చేస్తూ గడిపారు.

మొదట్నుండీ కూడా శ్రీ పరమహంస యోగానందగారు, శ్రీ దయామాతను స్పష్టంగా ఒక ప్రత్యేక పాత్ర కోసం ఎంపికచేసారు. తర్వాత ఒకసారి ఆయన ఆమెతో ఇలా చెప్పారు, “నేను నీకు ఇచ్చిన కఠిన ఆధ్యాత్మిక శిక్షణ సరిగ్గా నేను భారతదేశంలో నా గురుదేవులయిన శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి ఆశ్రమంలో ఉన్న సంవత్సరాలలో వారి ద్వారా పొందినంత కఠిన శిక్షణే నీకూ ఇచ్చాను.”

ఇరవై సంవత్సరాలకుపైగా శ్రీ దయామాత, శ్రీ పరమహంస యోగానందగారితో ఉండే ఒక చిన్న సన్నిహిత శిష్యబృందంలో ఒక భాగంగా ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండేవారు. ఆయన ఆంతరంగిక కార్యదర్శిగాను మరియు ఆయన ప్రసంగాలను సంక్షిప్త లిపిలో వ్రాసి భద్రపరచే బాధ్యతను నిర్వర్తించేవారు. యోగ ధ్యాన ప్రక్రియలకు సంబంధించిన వివరణాత్మక సూచనలను మరియు ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన సూచనలను పాఠాలుగా సంకలనం చేయుటలో ఆవిడ సహాయపడ్డారు. అవే పాఠాలుగా ముద్రించి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ విద్యార్థులకు ఇప్పటికి కూడా పంపిణీ చేయబడుతున్నాయి.

భక్తులను ప్రణామములతో పలకరిస్తున్న దయామాత.“నా భాద్యత ముగిసింది. ఇక నీ వంతు.”

సంవత్సరాలు గడిచే కొద్ది క్రమంగా ఆమెకు ఇచ్చే బాధ్యతలు పెంచుకుంటూ పోయారు; తన జీవిత ముగింపు కాలంలో ఆయన తన ఆశ్రమంలోని శిష్యులకు శ్రీ దయామాతకు నిర్ణయించబడిన, ఆమె పోషించబోయే ప్రపంచవ్యాప్త పాత్రను గురించి బాహాటంగానే మాట్లాడేవారు. గురువుగారి తదనంతర జీవితకాలంలో తన బాధ్యతలు బాగా పెరగడంతో సంస్థలో నాయకురాలిగా శ్రీ దయామాత తన స్థానం పైపైకి వెళ్తుండటం ఒక గొప్ప పరీక్షగా మారింది. గాఢంగా ఎక్కువసేపు ధ్యానంలో ఉంటూ భగవంతుడికి ఎల్లప్పుడూ చేరువలో ఉండాలని, తానొక విధేయురాలైన సాధకురాలుగా మాత్రమే ఉండాలని ఆవిడ కోరుకున్నారు. అందుకే ఆవిడ గురువుగారితో మీరు ఎంపిక చేసిన వేరొకరెవరి క్రిందనయిన సేవ చేయడానికి అనుమతించమని ఎంతో వేడుకున్నారు. కానీ గురుదేవులు ఈ విషయంలో చాలా దృఢంగా ఉండిపోయారు. అన్నిటికంటే భగవంతుని ఇచ్ఛ, గురుదేవుల ఆజ్ఞలను పాటించాలని శ్రీ దయామాత తనకిచ్చిన ఆదేశాలమేరకు నడుచుకోవాలన్న అంతర్గత నిర్ణయానికి ఆమె విధేయురాలయ్యారు. పరమహంసగారు ఆవిడతో చెప్పారు, “నా పని (భాద్యత) ఇంతటితో ముగిసింది. నీ పని మొదలవుతుంది.”

శ్రీ పరమహంస యోగానందగారు మహాసమాధి చెందిన మూడు సంవత్సరాల తర్వాత 1955లో శ్రీ దయామాత స్వర్గీయ శ్రీ రాజర్షి జనకానందగారి తరువాత యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డారు—శ్రీ పరమహంస యోగానందగారి కోరిక మేరకు—ఆమె ప్రపంచవ్యాప్త మత ఉద్యమానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా మరియు పాశ్చ్యాత్య దేశ వనితల్లో భారతదేశ సనాతన ధర్మాన్ని (శాశ్వత ధర్మం) అనుసరించిన అత్యంత ఆదరణీయురాలైన మొట్టమొదటి ఆదర్శప్రాయులు అయ్యారు. శ్రీ యోగానందగారి ఆధ్యాత్మిక వారసురాలుగా ఆమె వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సభ్యులకిచ్చే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వ పరివేక్షణా బాధ్యతను నిర్వహించడం, అమెరికా, భారత, జర్మనీ ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. ఆశ్రమంలలోని సన్యాసుల శిక్షణా బాధ్యత, ఇంకా ప్రపంచమంతా విస్తరించిన ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. సంస్థ శాఖల యొక్క ఆధ్యాత్మిక మరియు మానవతా సేవా కార్యక్రమాల నిర్వహణా బాధ్యతలను పరివేక్షించేవారు. భారతదేశంలో ఉన్న యోగదా సత్సంగ సొసైటీ యొక్క కార్యక్రమాలకు మార్గదర్శకత్వం చేయడానికి శ్రీ దయామాత అయిదుసార్లు విస్తృత భారత పర్యటన చేశారు.

శ్రీ దయామాతగారి నాయకత్వం

క్రిస్మస్ సమయంలో ఎస్.ఆర్.ఎఫ్. సభ్యునితో దయామాత.

శ్రీ దయామాతగారి నాయకత్వంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థ ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచమంతటా విస్తరించింది. ఈ రోజు ప్రపంచంలోని 60కి పైగా దేశాల్లో 600కి మించిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ఆలయాలు, ధ్యాన మందిరాలు, రిట్రీట్ సెంటర్లు, డజనుకు మించి వర్ధిల్లుతున్న ఆశ్రమ సమాజాలు, అందులోని అంకితభావంతో పనిచేసే సన్యాసులు మరియు సన్యాసినులు; శ్రీ పరమహంస యోగానందగారు, మరియు యోగానందగారి శిష్యుల యొక్క రచనలను ప్రచురించే ఒక ప్రచురణ సంస్థ, శ్రీ యోగానందగారి బోధనలకు సంబంధించిన తరగతుల నిర్వహణ, ప్రపంచంలోని అన్ని ముఖ్యనగరాల్లో అందమైన ఎస్.ఆర్.ఎఫ్. రిట్రీట్ సెంటర్లు, ప్రపంచ శాంతికి, ఆరోగ్యానికి, రోగనివారణకు ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి, ఇవికాక ఇతర ఆధ్యాత్మిక సేవలు, మరియూ కార్యక్రమాలు.

80 సంవత్సరాలుగా, తాను చేసిన అంకిత సేవకు ప్రతిగా ఆమె కీర్తి గాని స్థాయి గాని ఆశించలేదు. ఆమె ఏకైక లక్ష్యం తన గురువుదేవుల బోధనలు స్వచ్ఛత, సమగ్రత కోల్పోకుండా కాపాడటం, నిజమైన శిష్యురాలిగా తనని తాను పరిపూర్ణం చేసుకోవడం, ఆధ్యాత్మిక సామర్థ్యం మరియు అవగాహన కోసం వచ్చిన వాళ్ళందరినీ ఆదుకోవడం, ప్రోత్సహించడం. ఈ లక్ష్యాలను చేరుకోవాలనే ఒకే ఒక హృద్యమైన విశ్వాసంతో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన లెక్కలేనంతమంది జ్ఞాన అన్వేషకులకు ప్రేరణ మరియు ఆశీర్వాదాలు అందించారు.

చివరి సంవత్సరాలు మరియు ప్రేమ వారసత్వం

శ్రీ దయామాత, యోగదా సత్సంగ/సెల్ఫ్-రియలైజేషన్ మ్యాగజైన్లో ముఖ్య సందర్భాల్లో మరియు ద్వైమాసిక ఉత్తరాల ద్వారా ఇచ్చే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, తనకు ఉత్తరాలు వ్రాసే ప్రతి సభ్యుడికి సమాధానంగా పంపిన లెక్కలేనన్ని ప్రత్యుత్తరాల ద్వారా నిరంతర మార్గదర్శకత్వం, ప్రేరణ, ఆధ్యాత్మిక ప్రోత్సాహాలు నిరంతర ప్రవాహంలా ప్రపంచవ్యాప్తమైన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. కుటుంబ సభ్యులకు అందించారు. శ్రీ దయామాత తన జీవిత చివరి సంవత్సరాల్లో ధ్యానం చేయడానికి, తన సహాయం మరియు ఆశీర్వాదాలు కావాలని కోరినవారి కోసం గాఢంగా ప్రార్థనలు చేయడానికి ఎక్కువ సమయాన్ని గడిపేవారు.

అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజూ ధ్యానం ద్వారా భగవంతుడంటే ఒక ప్రగాఢమైన ప్రేమ భావము భగవంతుని బిడ్డలందరిలో కలిగించడం తనకున్న ఆశయం అని శ్రీ దయామాత అన్నారు.

దయామాత గురించి వివరిస్తున్న శ్రీ మృణాళినీమాత
శ్రీ దయామాత

“ధ్యానం చేయడం వలన, భగవంతుని ప్రేమించడం వలన, ఆయనతో నిశ్శబ్దంగా మన హృదయ భాషలో సంభాషిస్తూండడం వలన మాత్రమే, పవిత్రంగా, బేషరతుగా ప్రేమించగల్గడం అనే సామర్థ్యం లభిస్తుంది. నేను భగవంతునితో సంభాషించడం మానేసిన క్షణాలు నా జీవితంలో తటస్థపడలేదని అనుకుంటున్నాను. ఆయన నాతో మాట్లాడుతున్నాడా లేదా అన్న విషయం నేనెప్పుడూ పట్టించుకోలేదు. అలా అనుకోవడమనేది ఒక అసహజమైన ఆలోచనగా అనిపిస్తుందేమో. కానీ మనస్సులో భగవంతునితో జరిపే సంభాషణలో ఎంత ఆనందం వస్తుందో నాకు మాత్రమే తెలుసు, అకస్మాత్తుగా ఒక గొప్ప పులకరింత, దివ్యప్రేమ, లేదా పరమానందం, ఒక జ్ఞానధార నా చైతన్యానికి ప్రవహిస్తుంది. అప్పుడు నాకర్థమవుతుంది, ‘ఓ జగన్మాతా నువ్వే నాక్కావలసిన, నేను ఈ జీవితంలో వెతుకుతున్న పరమానందం ఇస్తున్నావని.’ భగవంతుడు ఒక్కడే యాదార్ధం. ఆయనే జీవితం.”

భగవంతుడిని ఏ షరతులు లేని భక్తితో ఎవరైతే జీవించారో వారి ప్రేరణోత్తేజం ఈ జీవితకాలంలోనే కాకుండా వారి మరణానంతరం కూడా ఈ ప్రపంచం మీద ఉంటుంది. మన ఆధ్యాత్మిక సాధనకు కావలసిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం మనకు శ్రీ దయామాత ఆశీర్వాదాల్లో లభిస్తున్నాయనే భావం ఈ సమయంలో కూడా మనము పొందవచ్చు. శ్రీ దయామాతకు మన హృదయంలోని ప్రేమ, కృతజ్ఞతలను పంపడానికి మాతో పాటు కలవండి, ఆమె దివ్యప్రేమ, కరుణ మనపై ఎల్లప్పుడూ ఉంటాయని తెలుసుకోండి.

సత్సంగాన్ని ఇస్తున్న దయా మాత.

Share this on

Collections

More

Author

More

Language

More