యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పదకోశం (క – ఙ)

కర్మ. ఇప్పటి జీవితకాలంలో కాని, పూర్వ జీవితకాలాల్లో కాని చేసిన వెనకటి పనులకు ఫలితాలు. సంస్కృతంలో కృ అంటే చేయడమనే దాన్నించి వచ్చింది. హిందూ పవిత్ర గ్రంథాల్లో చెప్పిన ప్రకారం, సమతులన కర్మనియమం చర్యప్రతిచర్యలకూ కార్యకారణాలకూ బీజావాప ఫలోపలబ్ధులకూ సంబంధించినది. ప్రతి మనిషీ తన నైసర్గిక ధర్మ (ఋతం) వర్తనలో తన ఆలోచనల ద్వారాను, చేతల ద్వారాను తన భవితవ్యాన్ని తానే మలుచుకుంటాడు. తెలివిగానో తెలివితక్కువగానో అతడు చాలనం చేసిన విశ్వశక్తులు, ఒక బిందువు దగ్గర మొదలైన వృత్తపరిధి తప్పనిసరిగా ఆ బిందువు దగ్గరికే తిరిగి వచ్చి వృత్తం పూర్తి అయినట్టుగా ఆరంభ కే౦ద్రమైన అతని దగ్గరికి తప్పనిసరిగా తిరిగి రావాలి. జీవిత అసమానతల వెనక ఉన్న కర్మను న్యాయ శాసనంగా అవగాహన చేసుకుంటే, మనిషి మనస్సులో దేవుని పట్లా, ఇతర మనుష్యుల పట్లా కలిగే ఆగ్రహం నుండి విముక్తి లభిస్తుంది. ఒక వ్యక్తి కర్మ, అతని లేదా ఆమె యొక్క ఒక జన్మ నుంచి మరొక జన్మకు, ఫలానుభవం కలిగేవరకు కానీ, ఆధ్యాత్మికంగా దాన్ని అధిగమించే వరకు కానీ ఆ వ్యక్తిని వెన్నంటే వస్తుంది. పునర్జన్మ చూడండి.

సమాజాలు, దేశాలు లేదా మొత్తం ప్రపంచంలో ఉన్న మానవులు చేసిన పనులన్నింటికి ఫలితం సమూహ కర్మగా మారి మంచి, చెడుల ప్రాబల్యాన్ని, తీవ్రతను అనుసరించి ఆ కొద్ది ప్రాంతానికి లేదా చాలా దూరం వరకూ తన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ప్రతి మానవుడి ఆలోచనలు, పనులు ఈ ప్రపంచానికి, అందులో ఉన్న అందరు మానవులకు కలిగే మంచి చెడులను ప్రభావితం చేస్తాయి.

కర్మయోగం. బంధరహితమైన చర్యల ద్వారా, సేవ ద్వారా భగవంతుణ్ణి చేరే మార్గం. నిస్వార్థ సేవ ద్వారా, తమ కర్మల ఫలితాలను భగవంతుడికి అర్పించడం ద్వారా, భగవంతుడే అన్నిటికీ కర్త అని భావించడం ద్వారా భక్తుడు అహం నుంచి విముక్తుడై భగవదనుభూతిని పొందుతాడు. యోగం చూడండి.

కారణ విశ్వం. స్థూల ద్రవ్యం (అణువులు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు)తో కూడిన భౌతిక ప్రపంచానికి, ప్రకాశించే ప్రాణశక్తి (లైఫ్ ట్రాన్లు)తో కూడిన సుసూక్ష్మమయిన సూక్ష్మ ప్రపంచానికి వెనక కారణ లేదా భావనాత్మక, ఆలోచనా ప్రపంచం (థాట్ ట్రాన్లతో కూడినది) ఉంది. భౌతిక, సూక్ష్మ విశ్వాలను దాటిపోడానికి కావలసినంతగా మానవుడు వికాసం చెందాక అతడు కారణ విశ్వంలో నివసిస్తాడు. కారణ జీవుల చైతన్యంలో, భౌతిక మరియు సూక్ష్మ విశ్వాలు, తమ ఆలోచనా సారంగా ఏర్పడతాయి. భౌతిక మానవుడు ఊహలలో చేయగలిగిందంతా, కారణ జీవులు వాస్తవంగానే చేయగలరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న ఒకే ఒక పరిమితి ఆలోచన మాత్రమే. చిట్టచివరికి, మానవుడు అన్ని స్పందనాత్మక స్తరాలకు ఆవలనున్న సర్వవ్యాపక పరమాత్మతో ఐక్యమవటానికి, తన ఆత్మకున్న ఆఖరి తొడుగైన తన కారణ శరీరాన్ని విడిచిపెడతాడు.

కారణ శరీరం. ముఖ్యంగా, ఒక ఆత్మగా మానవుడు కారణ శరీర జీవి. అతడి భౌతిక, సూక్ష్మ శరీరాలకి భావనాత్మకమైన ఉత్పత్తి స్థానం అతడి కారణ శరీరం. సూక్ష్మ శరీరపు 19 తత్త్వాలకు, భౌతిక శరీరపు 16 ప్రాథమిక భౌతిక మూలకాలకు సంబంధించిన 35 భావనలతో కారణ శరీరం ఏర్పడింది.

క్రియాయోగం. అనేక వేల సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో ఆవిర్భవించిన పవిత్రమైన ఆధ్యాత్మిక శాస్త్రం. ఇందులో ఉన్న కొన్ని నిర్దిష్టమైన ధ్యాన ప్రక్రియల నిష్ఠతో కూడిన అభ్యాసం దైవసాక్షాత్కారానికి దారి చూపుతుంది. క్రియ అనే పదం యొక్క సంస్కృత మూలమైన కృ అంటే చెయ్యడం, ప్రతిస్పందించడం అని పరమహంస యోగానందగారు వివరించారు. ఇదే మూలాన్ని మనం కర్మ అనే పదంలో, సహజమైన కార్యకారణ నియమంలో కనుగొంటాము. ఆ విధంగా క్రియాయోగం అంటే “ఒక నిర్దిష్టమైన పని లేదా కార్యం (క్రియ) ద్వారా అనంతుడితో ఏకం (యోగం) కావడం.” క్రియాయోగం, ఒక విధమయిన రాజ (“రాజోచిత” లేదా “సంపూర్ణ”) యోగం. భగవద్గీతలో కృష్ణ భగవానుడు, యోగసూత్రాలు లో పతంజలి దీన్ని ప్రశంసించారు. ఈ యుగంలో మహావతార్ బాబాజీ (చూ.) ద్వారా పునరుద్ధరించబడిన క్రియాయోగాన్ని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గురువులు దీక్షగా (ఆధ్యాత్మిక దీక్షగా) ప్రసాదిస్తారు. శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి మహాసమాధి (చూ.) తరువాత, ఆయన ద్వారా నియమితులైన ఆధ్యాత్మిక ప్రతినిధి అయిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు (లేదా అధ్యక్షుల ద్వారా నియమితులైనవారు) దీక్ష ఇస్తారు. దీక్షకు అర్హులు కావడానికి యోగదా సత్సంగ విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని నిర్దిష్టమైన ప్రాథమిక ఆధ్యాత్మిక ఆదేశాలను నెరవేర్చవలసి ఉంటుంది. ఈ దీక్షను అందుకున్న వారిని క్రియాయోగి లేదా క్రియావంతుడు అంటారు. గురువు, శిష్యుడు కూడా చూడండి.

క్రీస్తు. ఏసు యొక్క గౌరవప్రదమైన బిరుదు: ఏసుక్రీస్తు. ఈ పదం సృష్టిలో అంతర్లీనంగా ఉన్న దేవుని విశ్వవ్యాప్త మేధస్సును కూడా సూచిస్తుంది. (కొన్నిసార్లు విశ్వక్రీస్తు లేదా అనంతమైన క్రీస్తు అని పిలుస్తారు), లేదా ఆ దివ్య చైతన్యముతో ఏకత్వాన్ని పొందిన గొప్ప గురువులను సూచించడానికి ఉపయోగిస్తారు. (గ్రీకు పదం క్రిస్టోస్ అంటే “అభిషిక్తుడు” అని అర్థం) క్రీస్తు చైతన్యం మరియు కూటస్థ చైతన్యం కూడా చూడండి.

క్రీస్తు (కూటస్థ) కేంద్రం. కనుబొమల మధ్యనున్న కూటస్థ కేంద్రం లేదా ఆజ్ఞా చక్రం; ధ్రువత్వ రీత్యా, మెడుల్లా (చూ.)తో సూటిగా కలిసి ఉంది; సంకల్పానికి, ఏకాగ్రతకు, కూటస్థ చైతన్యానికి (క్రీస్తుచైతన్యానికి) (చూ.) కేంద్రం; ఆధ్యాత్మిక నేత్రము (చూ.) ఉండే స్థానం.

క్రీస్తు చైతన్యం. “క్రీస్తు” లేదా “క్రీస్తు చైతన్యం” సృష్టి అంతటిలోను అంతర్లీనంగా ఆవిష్కారమయిన దేవుడి చైతన్యం. క్రైస్తవ ధర్మశాస్త్రాలలో దీన్నే “ఒకే ఒక ఔరస పుత్రుడు,” అన్నారు, ఇది సృష్టిలో తండ్రి అయిన భగవంతుడి ఏకైక శుద్ధ ప్రతిబింబం; హైందవ ధర్మశాస్త్రాల్లో దీన్ని కూటస్థ చైతన్యం లేదా తత్, అంతటా ఉన్న పరమాత్ముడి విశ్వ మేధస్సు అని పిలిచారు. కృష్ణుడు, ఏసు ఇంకా ఇతర అవతారపురుషుల్లో అది విశ్వజనీన చైతన్యం, భగవంతుడితో ఏకత్వంగా వ్యక్తమయింది. గొప్ప ఋషులు, యోగులు దీన్ని ఒక సమాధి (చూ.) ధ్యాన స్థితి అని, అందులో తమ చైతన్యం సృష్టిలో ఉన్న ప్రతి అణువులోని మేధస్సుతో తాదాత్మ్యం చెందిందని తెలుసుకుంటారు; ఈ విశ్వమంతా తమ సొంత శరీరమయినట్లుగా వాళ్ళు భావన పొందుతారు. త్రిత్వము చూడండి.

కులం. తొలుతటి ఆలోచనా విధానం ప్రకారం కులం అన్నది వారసత్వపు హోదాగా వచ్చేదికాక అతడి సహజ సామర్థ్యాల వర్గీకరణ ఆధారంగా వచ్చేది. తన పరిణామ క్రమంలో, మానవుడు నాలుగు విభిన్నమైన శ్రేణుల గుండా ప్రయాణిస్తాడు. ప్రాచీన హైందవ జ్ఞానులు వారిని శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడుగా పేర్కొన్నారు. శూద్రుడు, ప్రధానంగా తన శరీరపు అవసరాలను, కోరికలను తృప్తిపరుచుకోవడంలో ఆసక్తి చూపుతాడు. ఆ స్థితిలో శారీరక శ్రమ అతడి అభివృద్ధికి చక్కగా నప్పుతుంది. వైశ్యుడు, ప్రాపంచిక లాభాలకోసం అదే విధంగా ఇంద్రియాలను తృప్తిపరుచుకోవడం కోసం చాలా శ్రద్ధగా పని చేస్తాడు. అతడికి శూద్రుడికన్నా ఎక్కువ సృజనాత్మక సామర్థ్యం ఉండి వ్యవసాయదారుడిగానో, వ్యాపారస్థుడిగానో, కళాకారుడిగానో లేదా తన మానసికశక్తికి పరిపూర్ణతనిచ్చే మరేదయినా వృత్తినో ఎంచుకుంటాడు. శూద్ర, వైశ్య స్థితులలో అనేక జన్మలలో తన కోరికలను తీర్చుకున్న క్షత్రియుడు, జీవిత పరమార్థం గురించి అన్వేషించడం ప్రారంభించి తన చెడు అలవాట్లను జయించడానికి, తన ఇంద్రియాలను నిగ్రహించడానికి, సన్మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తాడు. వృత్తిపరంగా క్షత్రియులు ఉత్తమ పాలకులు, రాజకీయవేత్తలు, యోధులు. బ్రాహ్మణుడు తనలోని హీన స్థాయి ప్రకృతిని జయించినవాడు; ఆధ్యాత్మిక విషయాలపట్ల సహజంగానే ఆకర్షితుడై, భగవంతుణ్ణి తెలుసుకొని, తద్ద్వారా ఇతరులకు ముక్తిమార్గాన్ని బోధించి సహాయం చేయగలుగుతాడు.

కూటస్థ చైతన్యం. క్రీస్తుచైతన్యం చూడండి.

కృష్ణ భగవానుడు. క్రీస్తుశకానికి అనేక శతాబ్దులకు పూర్వం భారతదేశంలో జీవించిన అవతారం. (చూ.) కృష్ణ శబ్దానికి హైందవ పవిత్ర గ్రంథాల్లో ఉన్న అర్థాలలో ఒకటి “సర్వజ్ఞ పరమాత్మ.” ఆ విధంగా కృష్ణ శబ్దం, క్రీస్తులాగే ఒక బిరుదు; అవతారమూర్తి ఆధ్యాత్మిక ఘనతను — దేవుడితో ఏకత్వాన్ని సూచించేది. భగవానుడు అనేదానికి అర్థం “దేవుడు.” భగవద్గీతలో ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని నమోదు చేసేనాటికి కృష్ణ భగవానులు ఉత్తర భారతదేశపు ఒక రాజ్యానికి రాజు. తన చిన్నతనంలో, కృష్ణుడు గోపాలకుడిలా జీవించి తన సహచరులను మురళీగానంతో మంత్ర ముగ్ధులను చేశాడు. ఈ పాత్రలో కృష్ణుడిని తరచుగా ధ్యానమనే మురళిని వాయిస్తూ దారితప్పిన ఆలోచనలన్నింటిని సర్వజ్ఞత్వపు పట్టులోకి తిరిగి వెనకకు తెస్తున్న ఆత్మకు దృష్టాంతంగా భావిస్తారు.

పరమహంస యోగానందగారు తరచుగా ఇలా అనేవారు: భారతదేశంలో చాలా ప్రాచీనకాలంలోనే “ ‘క్రీస్తు’ అనే పేరు ‘కృష్ణ’ అనే పదంలో ఉండేది. వీటి మధ్య సహసంబంధాన్ని చూపించడానికని కొన్నిసార్లు నేను ఉద్దేశపూర్వకంగానే ‘కృష్ణ’ ని ‘క్రిస్ట్ న’ అని పలికేవాడిని.”

కృష్ణ చైతన్యం. క్రీస్తు చైతన్యం; కూటస్థ చైతన్యం. క్రీస్తు చైతన్యం చూడండి.

కుండలిని. వెన్నెముక మూలం వద్ద ఒక సూక్ష్మమైన చుట్టబడిన మార్గంలో నివసించే సృజనాత్మక జీవశక్తి యొక్క శక్తివంతమైన ప్రవాహం. సాధారణ జాగృత చైతన్యంలో, శరీరం యొక్క ప్రాణశక్తి మెదడు నుండి వెన్నెముక క్రిందకి ప్రవహిస్తుంది మరియు చుట్టబడిన ఈ కుండలిని మార్గం ద్వారా ప్రవహిస్తుంది మరియు సూక్ష్మ, కారణ శరీరాలను మరియు అంతర్గతంగా ఉన్న ఆత్మను మర్త్య రూపంలోకి కలుపుతుంది. ధ్యానం యొక్క లక్ష్యమైన చైతన్యం యొక్క ఉన్నత స్థితులలో, మేదోమేరుదండ కేంద్రాలలో (చక్రాలు) నిద్రాణమై ఉన్న అధ్యాత్మిక సామర్ధ్యాలను మేల్కొల్పడానికి కుండలిని శక్తి వెన్నెముక పైకి తిరిగి ప్రవహిస్తుంది. చుట్టబడిన ఆకృతి రూపంలో ఉన్న కారణంగా దీనిని “సర్ప శక్తి” అని కూడా పిలుస్తారు.

గుణాలు. మహా ప్రకృతిలో భాగమైన సత్త్వ, రజో, తమో గుణాలచే సృష్టి మొత్తం ప్రభావితమౌతుంది. వీటిలో తమస్సు అవరోధకారి, రజస్సు క్రియాశీలకం, సత్త్వం విస్తరణకారి. లేదా ఈ మూడు గుణాలు వరుసగా స్థూల ద్రవ్యం, శక్తి, బుద్ధిగా వ్యక్తమవుతాయి.

వీటిలో అనుకూల లక్షణమైన సత్త్వగుణం సత్యం, స్వచ్ఛత, ఆధ్యాత్మికతలతో మంచివైపుకు నడిచేలా మనిషిని ప్రేరేపిస్తుంది. వ్యతిరేకలక్షణమైన తమోగుణం అంధకార, దుష్టలక్షణాలైన అసత్యం, సోమరితనం, అజ్ఞానంవైపుకు మనుషుల్ని ప్రేరేపిస్తుంది. ఇక తటస్థలక్షణం గల రజోగుణం క్రియాశీలకమైనది; ఇది సత్త్వాన్ని ఉత్తేజపరచి తమస్సును అణచివేస్తుంది లేదా తమస్సును ఉత్తేజపరచి సత్త్వాన్ని అణచివేస్తుంది; సతత కార్యశీలతను, చలనాన్ని కలుగచేస్తుంది.

ప్రజ్ఞాశీలియైన మహా ప్రకృతి మార్గనిర్దేశనంలో ఈ మూడుగుణాల సమ్మేళనంతో భౌతిక, సూక్ష్మ, కారణ విశ్వాలు ఆవిర్భవించాయి. అలాగే మానవుని భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాలు కూడా. ఈ త్రిగుణాల మేళవింపు ముల్లోకాల, ఆత్మయొక్క మూడు శరీరాల సమైక్య మనుగడకు దోహదపడుతుంది. (1) కారణ, లేక చైతన్య మండలం — ఇది సత్త్వగుణ ప్రధానం; (2) ఉత్తేజకారక జీవప్రదాత సూక్ష్మలోక ప్రాంతం — దీనిలో సత్త్వ రజోగుణాలు కలిసి పనిచేస్తాయి; (3)  స్థూలద్రవ్యరాశితో ఏర్పడిన భౌతికలోకం — ఇది తమోగుణ జనితం.

ఇక మానవునిలో అంధకారయుతమైన తమోగుణం మందకొడితనం, బద్ధకం వంటి లక్షణాలతో వ్యక్తమౌతుంది. దీని ఫలితంగా మనిషి సృష్టిలోని అన్ని రకాల చెడుకూ ప్రభావితుడవుతాడు. మంచిదైన సత్త్వగుణం ప్రశాంతత, ఆధ్యాత్మికత, జ్ఞానప్రకాశంగా వ్యక్తమౌతుంది. ఇక ఉత్తేజకారియైన రజోగుణం చలనశీలతతో సత్త్వ, తమో గుణాలలో పనిచేసినపుడు వరుసగా మంచిగా, చెడుగా వ్యక్తమౌతూ ఉంటుంది.

గురుదేవులు. “దివ్య ఉపదేశకులు,” ఒకరి ఆధ్యాత్మిక ఉపదేశకులను ఉద్దేశించి, గౌరవంగా పిలిచేడప్పుడు మరియు ప్రస్తావించేడప్పుడు వాడుకలో ఉన్న సంస్కృత పదం; కొన్నిసార్లు ఆంగ్లంలో “మాస్టర్” అని అంటారు.

గురువు. ఆధ్యాత్మిక బోధకుడు. గురువనే మాటను తరచుగా ఉపాధ్యాయుడినైనా, బోధకుడినైనా ప్రస్తావించడానికి దురుపయోగం చేస్తున్నప్పటికీ, ఒక నిజమైన దైవసాక్షాత్కారం పొందిన గురువు తనపైన తాను ఆధిపత్యం సాధించడంతో, సర్వవ్యాపకుడయిన పరమాత్మతో తన ఏకత్వాన్ని సాక్షాత్కరింప జేసుకుంటాడు. అటువంటి వ్యక్తి ఇతరులను, వారి ఆంతరిక ఆధ్యాత్మిక ప్రస్థానంలో ముందుకు నడిపించడానికి విశిష్ఠంగా అర్హుడయి ఉంటాడు.

భక్తుడు భగవంతుణ్ణి అన్వేషించడానికి మనఃపూర్వకంగా సిద్ధమయినప్పుడు, భగవంతుడు అతడి దగ్గరకు ఒక గురువును పంపుతాడు. అలాంటి సద్గురువు యొక్క జ్ఞానం, వివేచన, ఆత్మసాక్షాత్కారం, బోధల ద్వారా భగవంతుడు శిష్యుడికి దారి చూపుతాడు. గురువు బోధలను, శిక్షణను అనుసరించడం ద్వారా, భగవంతుణ్ణి పొందడమనే తన ఆత్మీయ కోరికను శిష్యుడు నెరవేర్చుకోగలుగుతాడు. నిజమైన భక్తుల గాఢమైన ఆత్మీయ తపనకు ప్రతిస్పందనగా వాళ్ళకు సాయంచేయడానికి ఆదేశం పొందిన సద్గురువు, ఒక సాధారణ బోధకుడు కాదు. అతడి శరీరం, వాక్కు, మనస్సు, ఆధ్యాత్మికతలను భగవంతుడు దారితప్పిన ఆత్మలను ఆకర్షించడానికి, మార్గదర్శకత్వం ఇవ్వడానికి వారిని తమ నిత్యత్వపు ఇంటికి తిరిగి తీసుకువెళ్ళే ఒక మానవ వాహకంగా ఉపయోగించుకొంటాడు. శాస్త్ర సత్యాలకు గురువు సజీవమైన మూర్తీ భావం. భౌతిక బంధనాలనుండి విముక్తి కోరే భక్తుడి తీవ్రకాంక్షకు ప్రతిస్పందనగా, మోక్షమిచ్చే సాధనంగా భగవంతుడి ద్వారా ఎన్నిక అయినవాడు. స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు కైవల్యదర్శనం (Holy Science) లో ఇలా రాశారు: “గురు సాన్నిధ్యంలో ఉండటమంటే కేవలం ఆయన భౌతిక సాన్నిధ్యంలో ఉండటం మాత్రమే కాదు (ఎందుకంటే కొన్నిసార్లు ఇది అసాధ్యం), కాని ముఖ్యంగా ఆయన్ని మన హృదయాలలో నిలుపుకొని, ఆయన నియమాలతో ఒక్కటయి, తద్ద్వారా మనని మనం ఆయనతో అనుసంధానంలో ఉంచుకోవడం.” మాస్టరు చూడండి.

ఇతరులతో షేర్ చేయండి