“నూతన సంవత్సరపు ద్వారము ద్వారా మెరుగైన జీవితం” — పరమహంస యోగానందగారి నుండి నిర్దేశిత ధ్యానం

10 జనవరి, 2023

ఈ సారాంశం “మీ ప్రారబ్దాన్ని నియంత్రించడం” అనే ప్రసంగం నుండి సంగ్రహించబడినది. పూర్తి ప్రసంగాన్ని పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాసాల సంకలనం, సంపుటం 2 దివ్య ప్రణయం, లో చదవవచ్చు.

ఈ నూతన సంవత్సర ప్రారంభంతో, మనం ప్రగాఢమైన నిశ్చయంతోనూ, ఆధ్యాత్మికమైన పట్టుదలతోనూ జీవితంలో ఒక నూతనశకంలోకి ప్రవేశిద్దాము.

నాతో పాటు ప్రార్థించండి, “ఓ పరమపితా, మేము నూతన సంవత్సరమనే ద్వారం గుండా ఉత్తమ జీవితంలోకి అడుగిడుతున్నాము. ఓ సకల వరప్రదాతా, ఇది నీతో అత్యంత గాఢమైన అనుసంధానమొసగే వత్సరమగుగాక. మా కోరికల సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాజువి నీవే అయ్యి, మా వివేకం ద్వారా మా జీవితాలను నడిపించెదవు గాక.

“గడచిన ఏడాది తరచుగా మా కోరికలు మమ్మల్ని తప్పు త్రోవ పట్టించాయి. ఇక మీదట మా ఆశయాలన్నీ నీ సంకల్పానికి అనుగుణంగా, సామరస్యంగా ఉండేటట్టు ఆశీర్వదించు. ప్రతిదినము, శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా నీ చైతన్యంలో మేల్కొనేటట్టు మమ్మల్ని ఆశీర్వదించు.

“నీకు, నీ పవిత్ర సన్నిధిని చేరమని మమ్మల్ని దీవిస్తూ, ప్రోత్సహిస్తున్న మహా గురువులకు ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఓం, ఓం, ఆమెన్.

ఇది మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్ష : అనంతమైన శాంతి, సంతోషాలతో, మీ స్వప్నావధిని మించిన లోకాన్ని మీరు పొందాలి. మీరు సూక్ష్మాకాశంలోకి ప్రసారం చేసిన ఏ ప్రగాఢ శుభేచ్చ అయినా నెరవేరుగాక!

మనం ధ్యానం చేద్దాము: గడచిన సంవత్సరంలో జరిగిన మనోహరమైన సంఘటనల గురించి ఆలోచించండి. చెడు అనుభవాలను మరచిపోండి. మీరు గతంలో చేసిన మంచి అనే బీజాలను నూతన సంవత్సరమనే సరికొత్త నేలలో నాటండి, అవి ఇంకా బలంగా పెరుగుతాయి.

పాత దుఃఖాలన్నీ గతించాయి. పాత లోపాలన్నీ విస్మరించండి. మరణించిన మన ఆత్మీయులు దేవునిలో అమరులై జీవిస్తున్నారు. మనమిప్పుడు అనంతమైన జీవంలో ఉన్నాము. ఇది గ్రహిస్తే మనకెన్నడూ మరణమనేది ఉండదు. అలలు కడలి నుండి పైకివచ్చి, మళ్ళీ దానిలో కలసిపోతూ ఉంటాయి; అవి కనిపించకుండా పోయినా సముద్రంతో ఒకటిగానే ఉన్నాయి. అదే విధంగా అన్ని వస్తువులూ భగవంతుని సన్నిధి అనే సాగరంలో ఉన్నాయి.

భయపడవలసినది ఏమీ లేదు. ప్రతి మానసిక స్థితిని దైవంతో జోడించండి. కెరటం సముద్రం నుండి విడిపోయినప్పుడే నిరాధారంగా, నిరాశ్రయంగా ఉన్నట్టు భావిస్తుంది. అనంతమైన జీవంతో మీ సంబంధాన్ని గురించి నిరంతరం ఆలోచించండి, అప్పుడా సర్వోత్కృష్ట అనంతునితో మీ ఏకత్వాన్ని తెలుసుకుంటారు.

జీవన్మరణాలు మన ఉనికి యొక్క భిన్న దశలు మాత్రమే. అనంత జీవంలో మీరొక భాగం. మీరు జాగృతమయ్యి మీ చైతన్యాన్ని భగవంతునిలో విస్తరింపజేయండి, అప్పుడు మీరొక చిన్న శరీరమనే భావన అంతరిస్తుంది. దీనిపై ధ్యానం చేసి ఈ సత్యాన్ని గ్రహించండి.

మీ చైతన్యానికి పరిధి లేదు. మీ ముందు లక్షల కొలదీ మైళ్ళ దూరం చూడండి: దానికి అంతం లేదు. ఎడమ వైపు, పైకి, క్రిందకు చూడండి; దానికి అంతం లేదు. మీ మనస్సు సర్వవ్యాపకమైనది, మీ చైతన్యం అపరిమితమైనది.

నాతో కలసి ప్రార్థించండి: “దివ్యాపితా, కిందటి సంవత్సరం గురించిన భావన ఇక నన్ను బంధించదు. ఇరుకైన శరీర చైతన్యం నుండి నేను స్వేచ్ఛగా ఉన్నాను. నేను శాశ్వతుడను. అనంతము అనే అగాధంలో నా పైన, కింద, నా ఎడమవైపు, కుడివైపు, నా ముందు, వెనుక, నా చుట్టూ, అంతటా నేను సర్వవ్యాపకుడనై ఉన్నాను. నీవూ, నేనూ ఒక్కటే.

“ఓ భగవాన్, నీకు, గురువుకు, అన్ని మతాలకు చెందిన మహాత్ములకు మేము ప్రణమిల్లుతున్నాము. అన్ని దేశాల వారికి మేము నమస్కరిస్తున్నాము, ఎందుకంటే వారు నీ ప్రతిరూపాలే. ఈ నూతన వత్సరంలో ప్రపంచంలోని అన్ని దేశాల వారికి శాంతి చేకూరాలని కోరుతున్నాము. తామంతా సోదరులమని, నీవే తండ్రివని వారు గుర్తించెదరు గాక.

“వారికి ఈ అవగాహన ప్రసాదించు; అప్పుడు వారు యుద్ధాలు విరమించి శాంతితో జీవిస్తూ ఈ భూమిని స్వర్గంగా చెయ్యగలరు. మా జీవితాలను ఆధ్యాత్మికంగా మార్చుకొని, ఇక్కడ నీ స్వర్గాన్ని నిర్మించడానికి సహాయపడాలని, మా ఉదాహరణతో ఇతరులకు అదే విధమైన ఉత్తేజం కలిగించాలని మమ్మల్ని ఆశీర్వదించు.

“మా తండ్రివైన నిన్ను ప్రేమిస్తున్నాము, అన్ని జాతుల వారిని సోదరులుగా ప్రేమిస్తాము. అన్ని ప్రాణులను మేము ప్రేమిస్తాము. ఎందుకంటే అవి నీ జీవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అన్నిటిలోనూ వెలసి ఉన్న నీకు నమస్కరిస్తున్నాము.

“దివ్యాపితా, నీ నిత్య సాన్నిధ్య మార్గదర్శకత్వంతో ఈ నూతన సంవత్సరంలో మాకు బలమును చేకూర్చు; అప్పుడు నీ జీవం, ఆరోగ్యం, సమృద్ధి, ఆనందం మా శరీరము, మనస్సు ఆత్మలలో ప్రతిబింబించగలుగుతాము. నీవు పరిపూర్ణుడవు కాబట్టి, నీ పిల్లలమైన మాకు పరిపూర్ణత లభించుగాక. ఓం, శాంతి, ఓం.

ఇతరులతో షేర్ చేయండి