
"ఓ అమర గురుదేవా, మౌన భగవానుని పలికే స్వరముగా నేను నీకు నమస్కరిస్తున్నాను. మోక్ష దేవాలయానికి దారిచూపే దివ్య ద్వారంలా నేను నీకు ప్రణమిల్లుతున్నాను."
—శ్రీ శ్రీ పరమహంస యోగానంద
ప్రియుతములారా,
ఈ గురు పూర్ణిమ పవిత్ర దినాన, నేను మీకు నా హృదయపూర్వక మరియు ప్రేమపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
శతాబ్దాలుగా ఆధ్యాత్మికతకు ప్రాకారంగా నిలిచిన భారతదేశ గత, వర్తమాన కాలాలను అనుగ్రహించిన, దివ్య ప్రకాశితులైన గురువులందరికీ ఈ రోజున మన కృతజ్ఞతలను సమర్పిద్దాం.
మన ముక్తి కొరకు భగవానుడు స్వయంగా పంపిన దివ్య గురువు మరియు మార్గదర్శకుడు అయిన మన ప్రియతమ గురుదేవులు, శ్రీ శ్రీ పరమహంస యోగానంద, పాదాల వద్ద మన ప్రగాఢ కృతజ్ఞతలు మరియు ప్రేమపూర్వక ప్రణామాలను సమర్పిద్దాం.
ఆయన ఉనికి యొక్క ప్రకాశాన్ని అనుభూతి చెందండి. ఆయన అనంతమైన ప్రేమకు మరియు ఆశీర్వాదాలకు మీ హృదయాన్ని తెరవండి – ఇది అన్ని పరీక్షలను అధిగమించే ఆనందం యొక్క ఉన్నత చైతన్యం, మనల్ని సర్వోత్కృష్ట లక్ష్యానికి మరింత దగ్గరగా తీసుకువెళ్ళే పరమానందం యొక్క ఉన్నత చైతన్యం: మన శాశ్వతమైన ఆత్మ సాక్షాత్కారం, భగవంతునితో ఏకత్వం.
గురుదేవుల పరివర్తనా స్పర్శ మరియు అనుగ్రహాలను మీ జీవితాల్లో సదా మీరు అనుభూతి పొందుదురుగాక.
దివ్య ప్రేమ మరియు ఆశీర్వాదాలతో,
స్వామి చిదానంద గిరి