అక్టోబరు 6, 2021న, గౌరవనీయులైన ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, శ్రీ హేమంత్ సోరెన్, కోవిడ్ మహమ్మారి యొక్క మూడవ తరంగాని ముందుగా ఊహించి ప్రత్యేకంగా ప్రారంభించబడిన అనేక ఆరోగ్య సౌకర్యాల యొక్క ఆన్లైన్ ప్రారంభోత్సవాన్ని చేసారు. రాంచీ జిల్లాలోని అంగారా బ్లాక్‌లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ హై డిపెండెన్సీ యూనిట్ (పి.హెచ్.డి.యూ) వాటిలో ఒకటి. ఆరోగ్య మంత్రి శ్రీ బన్నా గుప్తా, అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీ ఎ.కె. సింగ్, వై.ఎస్.ఎస్. ప్రధాన కార్యదర్శి స్వామి ఈశ్వరానంద గిరి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, వై.ఎస్.ఎస్. భారతదేశం అంతటా వివిధ కోవిడ్ సహాయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది. ఈ అన్ని కార్యకలాపాల యొక్క సంక్షిప్త ఖాతా ఈ విషయంపై మా మునుపటి బ్లాగ్‌లో అందించబడింది, దానిని ఇక్కడ చదవవచ్చు.
మహమ్మారి రెండవ తరంగం ప్రారంభం కాకముందే, గ్రామీణ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో వై.ఎస్.ఎస్. ఝార్ఖండ్ ఆరోగ్య శాఖను సంప్రదించారు. అప్పటి వరకు, మా కోవిడ్ రిలీఫ్ కార్యకలాపాలు చాలా వరకు పట్టణ మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఒక గ్రామంలో ప్రత్యేక కోవిడ్ వార్డును సృష్టించడం ద్వారా, వై.ఎస్.ఎస్. తన స్వచ్ఛంద కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరుకుంది.
జూన్ 2021 నెలలో, రాంచీ జిల్లాలోని గ్రామీణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సి.హెచ్.సి) ఒకదానిలో పి.హెచ్.డి.యూ ని స్థాపించడంలో సహాయం చేయడానికి ఝార్ఖండ్ ఆరోగ్య శాఖ ద్వారా వై.ఎస్.ఎస్.ను ఆహ్వానించారు. ఝార్ఖండ్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున మూడవ వేవ్ యొక్క తాకిడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది మరియు దాని వ్యూహంలో భాగంగా, పిల్లల చికిత్స కోసం దాని ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేస్తోంది, కోవిడ్-19 యొక్క మూడవ తరంగం వచ్చినప్పుడు పిల్లల వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిగణించబడింది . రాంచీ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ పట్టణమైన అంగారాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి)లో పి.హెచ్.డి.యూ ని స్థాపించే పనిని వై.ఎస్.ఎస్. చేపట్టింది. ఈ సి.హెచ్.సి మొత్తం 1.1 లక్షల జనాభా కలిగిన 82 గ్రామాల పేద గిరిజనులకు సేవలు అందిస్తుంది.
సి.హెచ్.సి కాంప్లెక్స్‌లోని ఒక భవనంలోని మొదటి అంతస్తులోని సెంట్రల్ హాల్‌ను పి.హెచ్.డి.యుగా పునరుద్ధరించారు. ఇంతకుముందు సాదా గోడలుగా ఉన్న హాలు గోడలు 7 అడుగుల ఎత్తు వరకు రంగురంగుల సిరామిక్ టైల్స్‌తో కప్పబడ్డాయి. ఇది వార్డును స్వచ్ఛంగా మరియు పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. మిగిలిన పైకప్పు వరకున్న మూడు అడుగులు పిల్లల స్నేహపూర్వక చిత్రాలతో పెయింట్ చేయబడింది, ఈ చిత్రాలు అనారోగ్యంతో ఉన్న పిల్లలకు హాయిగా మరియు స్వాగతించేలా ఉన్నాయి.
పి.హెచ్.డి.యూ అనేది మితమైన మరియు తీవ్రమైన కోవిడ్-19 ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేయడానికి ప్రత్యేకంగా అమర్చబడిన వార్డు. ఈ వార్డులో, పది సెమీ-ఫౌలర్ హాస్పిటల్ బెడ్లు (మంచానికి ఒక వైపు పైకి లేపడానికి తాడును తిప్పే చక్రము యొక్క పిడితో కూడిన బెడ్లు) ఉన్నాయి, ప్రతి బెడ్‌కి దాని స్వంత ఆక్సిజన్ సరఫరా మరియు బిపి, హార్ట్ రేట్, ఆక్సిజన్ సాంద్రతలు మొదలైన పిల్లల ప్రాణాధారాలను నిరంతరం పర్యవేక్షించే పరికరాలు ఉన్నాయి. అదనంగా, శిశు వార్మింగ్ స్టేషన్లు, ప్రత్యేక ఆక్సిజన్ మాస్క్‌లు, ఆటోక్లేవ్ మరియు సిరంజి పంపులు వంటి చాలా చిన్న శిశువుల సంరక్షణ కోసం, ప్రత్యేక పరికరాలు ఉన్నాయి.


హాల్ మధ్యలో ఒక నర్సింగ్ స్టేషన్ కూడా నిర్మించబడింది, అనారోగ్యంగా ఉన్న పిల్లలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి అక్కడ నుండి అన్ని పడకలు కనిపించేలా ఏర్పాటు చేయబడింది. వార్డు పూర్తి సామర్థ్యంతో పని చేసేందుకు అవసరమైన అన్ని విద్యుత్ మరమ్మతులు, ఫిట్టింగ్‌లు మరియు ప్లంబింగ్ పనులు కూడా చేపట్టారు.
పి.హెచ్.డి.యు ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వామి ఈశ్వరానందగారు తన సంక్షిప్త ప్రసంగంలో, వై.ఎస్.ఎస్.కు, సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఝార్ఖండ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఆరోగ్య శాఖ, అంగర సి.హెచ్.సి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ మరియు ఇతర వైద్యులకు వారు అందించిన సహకారం మరియు మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

అంగర సి.హెచ్.సి వద్ద ఉన్న ఈ పి.హెచ్.డి.యు రాంచీ జిల్లాకు తూర్పు వైపున ఉంది. రాంచీ జిల్లాకు ఉత్తరం వైపున ఉన్న ఒర్మాంఝీ సి.హెచ్.సిలో కూడా వై.ఎస్.ఎస్. సహకారముతో ఇలాంటి పి.హెచ్.డి.యునే ఏర్పాటు చేస్తున్నారు. విశాల హృదయం ఉన్న వై.ఎస్.ఎస్. భక్తుల నుంచి అందిన ఉదార విరాళాల కారణంగానే, మహమ్మారి సమయంలోనే కాకుండా, చాలా ఏళ్ల తర్వాత కూడా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే ఈ సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగాం. భగవంతుని మరియు గురువుల పాదాల చెంత అంకితం చేయబడిన ఈ అద్భుతమైన సౌకర్యాన్ని సృష్టించడానికి, అందరికీ సేవ చేయడానికి తమ సమయాన్ని, శక్తిని మరియు వనరులను అందించిన ఈ మహనీయులందరికీ మా ప్రగాఢ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు.