
పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:
ఆనందం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు; బదులుగా, ఇది జీవితంలోని సరళమైన ఆనందాలలో మరియు అన్నింటికంటే ఎక్కువగా గాఢమైన ధ్యానం యొక్క నిత్యనూతన ఆనందంలో కనుగొనబడుతుంది….సరళమైన, నిజమైన మరియు శాశ్వతమైన ఆత్మ-సంతోషాలను అంటిపెట్టుకుని సంతోషంగా ఉండండి. అవి లోతైన ఆలోచన, ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక ప్రేరణ మరియు ధ్యానం ద్వారా లభిస్తాయి.
ధ్యానం అనేది మీలోని భగవంతుని ప్రతిబింబం లేదా ప్రతిరూపమైన స్వచ్ఛమైన చైతన్యాన్ని గ్రహించి, వ్యక్తీకరించే ప్రయత్నం. శరీర స్పృహ యొక్క భ్రాంతిని మరియు “అనవసరమైన అవసరాల” కోసం శరీరం మరియు మనస్సు యొక్క ఏకకాల అభ్యర్థనలను తొలగించండి. మీరు వీలైనంత సరళంగా ఉండండి; మీ జీవితం ఎటువంటి సంక్లిష్టతలు లేకుండా ఎంత సంతోషంగా ఉంటుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు.
మీ మనస్సును ఎక్కువ కార్యకలాపాలలో నిమగ్నం చేయవద్దు. వాటి నుండి మీరు పొందే వాటిని విశ్లేచించండి మరియు అవి నిజంగా ముఖ్యమైనవా కాదా అని గమనించండి. మీ సమయాన్ని వృధా చేయకండి….నేను తరచుగా చెప్పేది, “మీరు ఒక గంట చదివితే, మీ ఆధ్యాత్మిక డైరీలో రెండు గంటలు వ్రాయండి; మీరు రెండు గంటలు వ్రాస్తే, మూడు గంటలు ఆలోచించండి; మూడు గంటలు ఆలోచిస్తే, అన్ని సమయాలలో ధ్యానం చేయండి.” నేను ఎక్కడికి వెళ్ళినా నా మనస్సును నా ఆత్మ శాంతిపైనే నిలిపి ఉంచుతాను. మీరు కూడా ఎల్లప్పుడూ మీ శ్రద్ధను ఆధ్యాత్మిక ఆనందం యొక్క ఉత్తర ధ్రువం మీదే నిలిపి ఉంచాలి. అప్పుడు ఎవరూ మీ సమతుల్యతను భంగపరచలేరు.
దేవుడు నాతో ఉన్నప్పుడు అన్ని “జీవితావసరాలు” అనవసరం అని నిరూపించాడు. ఆ చైతన్యంలో మీరు సగటు వ్యక్తి కంటే ఎక్కువ ఆరోగ్యవంతులు అవుతారు, మరింత ఆనందంగా ఉంటారు, అన్ని విధాలుగా ధనవంతులవుతారు. చిన్న విషయాలను అన్వేషించకండి; అవి మిమ్మల్ని దేవుని నుండి మళ్లిస్తాయి. మీ ప్రయోగాన్ని ఇప్పుడే ప్రారంభించండి: జీవితాన్ని సరళంగా మార్చుకోండి మరియు రాజులా జీవించండి.
మీరు సరళతలో ఆనందాన్ని కనుగొనడానికి శ్రీ పరమహంస యోగానందగారి మరింత జ్ఞానాన్ని గ్రహించాలనుకుంటున్నారా? దయచేసి వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌లోని “హృదయంలో సరళతను అలవరచుకోవడం” పేజీని సందర్శించండి.