పరమహంస యోగానందగారు తన తండ్రి శ్రీ భగవతి చరణ్ ఘోష్ ఒక్క ఉన్నతస్థాయి క్రియాయోగి అని తరచుగా చాలా గౌరవప్రదంగా మాట్లాడేవారు, ఆయన 1920లో పరమహంసగారు భారతదేశాన్ని విడిచిపెట్టే క్లిష్టమైన సందర్భంలో అమెరికాలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు ఆయన ఒక శతాబ్దం క్రితం స్థాపించిన ఆర్థిక సంస్థ అయిన రైల్వేస్ క్రెడిట్ సొసైటీ, శ్రీ భగవతి చరణ్ ఘోష్ గారి జీవితం మరియు దాతృత్వాన్ని మరోసారి గౌరవించింది.

భగవతి చరణ్ ఘోష్ (1853-1942), పరమహంస యోగానందగారి తండ్రి, లాహిరీ మహాశయుని శిష్యుడు
రైల్వే కార్మికుల సంక్షేమం కోసం శ్రీ ఘోష్ యొక్క అంకితభావాన్ని గుర్తించి, SE, SEC & E. Co. రైల్వేస్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, కోల్కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని సొసైటీ ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 19, 2020న, ఒక వేడుక నిర్వహించి శ్రీ భగవతి చరణ్ ఘోష్ గారి యొక్క స్మారక కాంస్య విగ్రహాన్ని అంకితం చేసింది. 1909లో ఆయన స్థాపించిన సంస్థ (వాస్తవానికి “కలకత్తా అర్బన్ బ్యాంక్” పేరుతో) ద్వారా రైల్వే కార్మికులు ఒక శతాబ్దానికి పైగా తక్కువ వడ్డీకి ఋణ సదుపాయాన్ని పొందారు. ఆ సమయంలో శ్రీ ఘోష్ బెంగాల్-నాగ్పూర్ రైల్వేలో (ప్రస్తుతం సౌత్ ఈస్టర్న్ రైల్వే) ఉన్నత పదవిలో ఉన్నారు.
సమర్పణ కార్యక్రమంలో, శ్రీ భగవతి చరణ్ ఘోష్ గారి ముని మనవడు శ్రీ సోమనాథ్ ఘోష్, ఆయన భార్య శ్రీమతి సరితా ఘోష్ గారు శ్రీ భగవతి చరణ్ ఘోష్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి గొప్పవారైన తన ముత్తాతగారి జీవితం గురించి మాట్లాడారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన స్వామి అచ్యుతానంద గిరి బ్యాంకును స్థాపించడంలో భగవతి చరణ్ ఘోష్ గారి యొక్క మానవతావాద కృషిని గుర్తించినందుకు సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు మరియు శ్రీ పరమహంస యోగానందగారి తన ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో ఈ బ్యాంకుకు తన తండ్రిగారి సహకారాన్ని గురించి స్వయంగా ప్రస్తావించారని తెలిపారు:
“అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన, కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ, దాంట్లో వాటాలు తీసుకోడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకు ఇష్టము లేదు. తీరిక వేళల్లో, ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు.”
తండ్రీ కొడుకుల మధ్య సమాంతరాన్ని చిత్రీకరిస్తూ స్వామి అచ్యుతానందగారు ఇలా అన్నారు: “రైల్వే ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నిరాడంబరమైన ప్రారంభం నుండి వృద్ధి చెందడం మరియు ఆయన కుమారుడు శ్రీ పరమహంస యోగానందగారు స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పెరుగుదల మధ్య చాలా సారూప్యతను నేను గమనించాను.” రెండూ సేవలందించేందుకు అంకితమైన సంస్థలేనని తెలిపారు.
ఒక యోగి ఆత్మకథలో, మరియు పరమహంసగారి సోదరుడు సనంద లాల్ ఘోష్ గారు పరమహంస యోగానందగారి జీవిత చరిత్ర గురించి రాసిన మెజ్దా అనే గ్రంథంలో భగవతి చరణ్ ఘోష్ గారి స్ఫూర్తిదాయకమైన జీవితానికి సంబంధించిన అనేక వివరాలు ప్రస్తావించబడ్డాయి. లాహిరీ మహాశయుని, ప్రత్యక్ష శిష్యుడైన, శ్రీ భగవతి చరణ్ ఘోష్ గారు తన ఎనిమిది మంది పిల్లలపై ప్రేమపూర్వక ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపారు. పరమహంసగారి అంతర్జాతీయ మిషన్కే కాకుండా, 1935లో పరమహంసగారు భారతదేశానికి తిరిగి వచ్చిన సమయంలో రాంచీలో వై.ఎస్.ఎస్. ఆశ్రమం శాశ్వత స్థాపనకు కూడా ఆయన చేసిన ఆర్థిక సహకారం చాలా కీలకం.
శ్రీ చరణ్ ఘోష్ యువకుడిగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, తరువాతి జీవితంలో భౌతిక సంపదను పొందేందుకు కష్టించి పనిచేసినప్పటికీ, ఆయన ఆర్థిక లాభం కంటే ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పరమహంసగారు ఒక యోగి ఆత్మకథలో తన తండ్రిగారు తరచూ చెప్పే వ్యాఖ్యలలో ఒకదాన్ని నమోదు చేశారు:
“వస్తు లాభంతో ఎందుకు ఉప్పొంగి పోవాలి? సమదృష్టి అనే లక్ష్యం కోసం పాటుపడేవాడు లాభంలో ఉప్పొంగిపోడు లేదా నష్టాన్ని చూసి కృంగిపోడు. మనిషి ఈ లోకానికి డబ్బు లేకుండా వస్తాడని, ఒక్క రూపాయి కూడా లేకుండా వెళ్ళిపోతాడనీ అతనికి తెలుసు.”
