స్వామి చిదానంద గిరి గారి “నిజమైన ధ్యానం మరియు మానవాళికొక ఆశాకిరణం”

10 జనవరి, 2023

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి ప్రసంగం “భౌతిక ప్రపంచంలో జీవిస్తూ మన దివ్య సంబంధాన్ని కొనసాగించడం” నుండి ఈ భాగం సంగ్రహించబడినది. ముంబైలో వై.ఎస్.ఎస్. నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమంలో చివరి రోజు నవంబర్ 10, 2019 న ఇచ్చిన వారి పూర్తి ప్రసంగాన్ని మా యూట్యూబ్ ఛానెల్‌లో వీక్షించవచ్చు.

ఈ ఉపన్యాసం ప్రారంభంలో, స్వామి చిదానందగారు ముంబైలో జరిగినటువంటి కార్యక్రమాల కోసం సాధకులు కలిసినప్పుడు కలిగే ఆధ్యాత్మిక అనుబంధం మరియు నిజమైన దివ్య స్నేహం గురించి, మరియు ముఖ్యంగా తన ప్రసంగానికి ముందు రోజు సామూహికంగా చేసిన గాఢమైన ధ్యానం గురించి విశేషంగా పేర్కొన్నారు.

ఇటువంటి చిన్న కార్యక్రమాల ముగింపులో మనమందరం ఎంతగా చేరువయ్యామో చూసి నేను ప్రతిసారి ఆశ్చర్యపడతాను. ఇక్కడికి రాకముందు మీలో చాలా మందిని నేను బాహ్యంగా కలుసుకోలేదు — ముంబైకి ఇది నా మొదటి సందర్శన — అయినప్పటికీ, ఈ మూడు రోజుల్లో, దివ్య స్నేహం యొక్క అటువంటి మధురమైన బంధం ఏర్పడిందని ఏ ఒక్కరూ అనుభవం పొందకుండా ఉండలేరు.

నేనూ అదే అనుభూతి పొందాను; నిన్న మనమందరం కలిసి గడిపిన ఆ మూడు గంటల ధ్యానంలో — ఆధ్యాత్మిక అనుభవం, ఆధ్యాత్మిక చైతన్యం యొక్క దివ్య శక్తిదాయక ఊటలోని సుదీర్ఘ లోతుల్లోకి ముణగడం వల్ల ఈ బంధం అత్యంత శక్తివంతమైన రీతిలో ఏర్పడిందని నేను భావిస్తున్నాను.

సామూహికంగా మనం ధ్యానం చేసినప్పుడు, మన బుద్ధి, భావోద్వేగాల కంటే ఇంకా గాఢమైన స్థాయిలో, ఒక ఆధ్యాత్మిక బంధాన్ని సృష్టిస్తాము; అందువల్లనే, సాపేక్షంగా చెప్పాలంటే, బాహ్యంగా కొద్ది సమయమే మనం గడిపినప్పటికీ, ఆంతరికంగా ఆ సంబంధం యొక్క స్వభావము, గాఢత మరియు తీవ్రత దివ్య స్నేహం యొక్క వాస్తవమైన, అతి నిశ్చయమైన బంధంలో మనల్ని ఏకం చేసింది. మీ సాంగత్యంలో గడిపిన ఈ రోజులను నేను ఎప్పటికీ మరచిపోలేను.

వ్యక్తిగత ఆత్మల మధ్య ఆధ్యాత్మిక సంబంధాలను ధ్యానం ఎలా ఏర్పరుస్తుందనే దాని గురించి ఎంతో ఆసక్తికరమైన ఒక విషయం ఉంది. ఎందుకంటే, మనం లోపలకు ప్రవేశించి, ఆంతరికంగా మన ఆత్మ యొక్క అవగాహనను స్పృశించినప్పుడు, మరియు మనం ఇతర ఆత్మల సహవాసంలో అలా చేసినప్పుడు — ఆత్మల సహవాసంలో కనీసం కొద్దిసేపు, సంయుక్తంగా మనమందరం, ఆ ఉన్నత ఆత్మ చైతన్య స్థాయిలో — స్వతస్సిద్ధంగా మనం ప్రేమను వృద్ధి చేసుకుంటాము; స్వతస్సిద్ధంగా మనం కృతజ్ఞతను ఆదరణను అభివృద్ధి చేసుకొంటాము, మరియు అది మధురమైన దివ్య స్నేహంగా గాఢమవుతుంది. ఇప్పుడు, ఈ సమయంలో ఇది ఎందుకు చాలా ముఖ్యమైనది?

“మానవాళికొక ఆశాకిరణం”

ఈ రోజు ప్రపంచాన్ని చూడండి. మనందరికి ఎటువంటి సంఘర్షణ ఉందో; మనకు భిన్నమైన ఆసక్తులు, అభిప్రాయాలు మరియు కార్యాచరణలు ఉన్నాయి. ప్రజలతో మమేకం కావడానికి సులభమైన ప్రదేశమేమీ కాదు ఈ ప్రపంచం. ఆధ్యాత్మిక పురోగతి ద్వారా లేదా మానవజాతి క్రమంగా పరిణామం చెందడం ద్వారా ఏదో ఒక సమయంలో మనమందరం సోదర సోదరీమణులుగా కలిసి జీవించగలమనే భావన మనకు కలుగుతుంది. వసుదైక కుటుంబంగా ప్రపంచమనేది వైదిక గ్రంథాల నుండి వచ్చిన ఒక ప్రాచీన ఆదర్శం.

మనందరం దేవుని బిడ్డలం, మనం అటువంటి సామరస్యంతోను, శాంతితోను జీవించాలి. కానీ గురుదేవులు పదే పదే చెప్పినట్లుగా — గాఢమైన దైనందిన ధ్యానం సమాజంలో వ్యాపించే వరకు — ఇది ఎప్పటికీ సాధించలేని ఆదర్శంగానే మిగిలిపోతుందని నేను నమ్ముతున్నాను.

ఎక్కువ మంది ప్రజలు ధ్యానం ద్వారా భగవంతుడిని తమ లోపల అనుభూతి చెందడానికి పొందే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇతర ఆత్మలలో ఉన్న ఆ భగవంతుడి సాన్నిధ్యాన్ని ఆ దివ్య విస్ఫులింగాన్ని, ఆ దివ్య స్వభావాన్ని గ్రహించే సామర్థ్యాన్ని మనం పొందుతాము. “వసుదైక కుటు౦బం” అనే దానికి అదే ఆధార౦, అదే మానవ సహోదరత్వానికి ఆధార౦. ప్రపంచ శాంతి కోసం ఆశకు అది మాత్రమే శాశ్వత, వాస్తవిక ఆధారం.

మీలో ప్రతి ఒక్కరూ నిశ్చలంగా అశీనులై, మీ మనస్సును సంచరించనివ్వక, ఈ ఉన్నత ధ్యానయోగ పద్ధతులను ఆచరిస్తూ గాఢమైన, సుశిక్షితతో దృష్టిని కేంద్రీకరించి — ధ్యానమనే అభ్యాసాన్ని ఏర్పరచుకోవడానికి, నిజంగా ధ్యానం చేసే నియామావళికి కట్టుబడి ఉన్నారు.

ఈ మార్గంలో ఉన్నవారు మరియు ఇతర మార్గాల ద్వారా దివ్య చైతన్యంలో ప్రవేశించడానికి అంతరిక ప్రయత్నాన్ని చేసేవారు — మీరే మానవాళికి ఆశాకిరణం.

ఇప్పుడు, ఇన్ని రోజుల కలయిక తర్వాత, ఆత్మలుగా మనకు ఒక అద్భుతమైన బాంధవ్యం ఉంది; బహుశా, మన ప్రతి ఒక్కరిలో ఉన్న ఆధ్యాత్మిక స్వభావం పట్ల మనకు కొత్తగా నిశ్చయం, అవగాహన ఏర్పడి ఉండవచ్చు. అయినప్పటికీ, ఆత్మపరంగా మనం నిత్యత్వం, అమరత్వం, పరిపూర్ణత, దైవత్వంతో ఉన్నప్పటికీ, మనం ఈ భౌతిక శరీరాలలో జీవిస్తున్నాము మరియు మన భౌతిక శరీరాలు భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాయి.

ధ్యానం మరియు ఆధ్యాత్మిక ఆవిష్కారంలో మనం పొందిన మన దివ్య స్వభావాన్ని ఎలా గ్రహించాలి మరియు దానిని ఎలా నిలుపుకోవాలి; భౌతిక ప్రపంచంలో జీవించేటప్పుడు కూడా ఆ సంబంధాన్ని ఎలా కొనసాగించాలి: అదే మన సవాలు.

ఈ ప్రసంగం యొక్క వీడియో మా యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇతరులతో షేర్ చేయండి