యోగదా సత్సంగ వార్తలు

12 మే, 2017

స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం ద్వారా భారత ప్రభుత్వం వై‌.ఎస్‌.ఎస్.ను గౌరవించింది

యోగదా సత్సంగ సొసైటీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తపాలాబిళ్ళ విడుదల

ఒక వై‌.ఎస్‌.ఎస్. భక్తుడికి, 7 మార్చి తన హృదయానికి దగ్గరగా ఉండే అనేక పవిత్రమైన కార్యక్రమాలతో ముడిపడి ఉంది. అరవై ఐదు సంవత్సరాల క్రితం, 1952లో ఇదే రోజున, పరమహంస యోగానందవారు భగవంతుని గురించి, తన ప్రియమైన భారతదేశం గురించి మాట్లాడుతూ మహాసమాధిలోకి ప్రవేశించారు. 1977లో, భారతదేశ ప్రభుత్వం ఈ రోజున స్మారక స్టాంపును విడుదల చేయడం ద్వారా గురుదేవులను సత్కరించింది, తద్వారా ప్రపంచ ఆధ్యాత్మిక సంపదకు ఆయన చేసిన మహత్తరమైన కృషిని అధికారికంగా గుర్తించారు. మరియు ఈ సంవత్సరం మార్చి 7న, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూఢిల్లీ, విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవార్థం స్మారక స్టాంపును విడుదల చేయడం ద్వారా ఈ ప్రేమావతార్ స్థాపించిన సంస్థకు తగిన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి 1800 మందికి పైగా వై‌.ఎస్‌.ఎస్. భక్తులు హాజరయ్యారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో వై‌.ఎస్‌.ఎస్. బోర్డు డైరెక్టర్లతో పాటు పలువురు సన్యాసులు పాల్గొన్నారు.

ప్రధాన మంత్రికి స్వామీజీలు విశ్వానందగారు, స్మరణానందగారు ప్రవేశ ద్వారం వద్ద సాదరంగా స్వాగతం పలికి సభాస్థలికి తీసుకెళ్ళారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, వై‌.ఎస్‌.ఎస్. బోర్డ్ ఆఫ్ డైర‌క్ట‌ర్ల‌తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వలన చేసి కార్య‌క్ర‌మం ప్రారంభించారు. స్వామి విశ్వానందగారు ప్రధానికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు, గౌరవ సూచకంగా స్వామి స్మరణానందగారు ముఖ్య అతిధికి శాలువా కప్పి గౌరవించారు.

స్వామి స్మరణానందగారు భగవద్గీతలోని శ్లోకాన్ని ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ శ్లోకం ఇలా పేర్కొంది: ప్రతి యుగంలో, ధర్మాన్ని రక్షించడానికి మరియు చెడును నాశనం చేయడానికి అవతారపురుషులు వస్తారు. స్వామీజీ ఇంకా ఇలా చెపారు, కొందరు అవతార పురుషులు మాయ యొక్క రాక్షసులను నిర్మూలించడంలో భక్తులకు సహాయపడటము తమ లక్ష్యంగా పెట్టుకుంటారని; మరియు మన ప్రియమైన గురుదేవులు, భ్రమలో ఉన్న మానవాళిని దివ్యజ్ఞానం వైపు మార్గనిర్దేశం చేసేందుకు వచ్చిన అటువంటి అవతార్‌లో ఒకరు అని. పరమహంసగారు స్థాపించిన సంస్థ ప్రాముఖ్యత మరియు సంస్థ చేస్తున్న అపారమైన సహకారాన్ని స్వామీజీ వివరించారు. ఆయన గురుదేవుల మాటలను ఉటంకించారు, “నేను శరీరంలో లేనప్పుడు, ఈ సంస్థే నా శరీరం అవుతుంది.” గురుదేవుల సంస్థ యొక్క గొప్ప ప్రభావాన్ని వివరిస్తూ, స్వామీజీ ఇలా అన్నారు, “యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆయన సుదీర్ఘ నీడగా, ఆయన ప్రేమ, ఆనందం, జ్ఞానం మరియు సేవ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తూనే ఉంది. యోగదా సత్సంగ/సెల్ఫ్-రియలైజేషన్ బోధనల ద్వారా లక్షలాది మంది మతం యొక్క నిజమైన అర్థాన్ని మరియు మరీ ముఖ్యంగా మత అభ్యాసము యొక్క నిజమైన, ప్రభావవంతమైన అర్థం తెలుసుకున్నారు. యోగ ధ్యానం సత్యాన్వేషకులందరికీ వారి ఇంటి వద్ద అందుబాటులో ఉంటుంది.”

స్వామి విశ్వానందగారు మన ప్రియతమ సంఘమాత మరియు అధ్యక్షురాలు శ్రీ శ్రీ మృణాళినీమాతగారి ఆశీస్సులు తెలియజేసారు మరియు ఈ మహత్తర సందర్భంలో ఆమె సందేశాన్ని చదివి వినిపించారు. ఆమె తన సందేశంలో ఇలా రాసారు:

      యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై‌.ఎస్‌.ఎస్.) 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మారక స్టాంపును విడుదల చేసిన ఈ ప్రత్యేక సందర్భంలో, నేను మీకు నా ఆత్మీయ శుభాకాంక్షలు మరియు దైవ ప్రేమను తెలియజేస్తున్నాను. ఈ కార్య‌క్ర‌మం ద్వారా భార‌త ప్ర‌భుత్వం వై‌.ఎస్‌.ఎస్.కు మరియు దాని వ్యవస్థాపకుడు—భారతదేశపు గొప్ప సాధువులలో ఒకరైన—శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి నివాళులర్పిస్తున్నందుకు నేను ఎనలేని సంతోషం మరియు కృతజ్ఞతలతో నిండిపోయాను. దీన్ని తీసుకురావడంలో పాత్ర పోషించిన వారందరికీ నా ప్రగాఢ ధన్యవాదాలు. భారతదేశం యొక్క సార్వత్రిక ఆధ్యాత్మికత మరియు యోగ ధ్యానం యొక్క పురాతన శాస్త్రాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన ఎక్కువ సమయం అమెరికాలో గడిపినప్పటికీ, పరమహంస యోగానందగారికి తన మాతృభూమి పట్ల ప్రేమ మరియు శ్రద్ధ ఎప్పుడూ తగ్గలేదు. 1952లో ఇదే రోజున—ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ముందు ఆయన చివరి మాటలు ఆయన ప్రియమైన భారతదేశానికి హృదయపూర్వక నివాళి.

ఈ సందర్భంగా స్వామి విశ్వానందగారు సంఘమాత మరియు అధ్యక్షురాలు శ్రీ శ్రీ మృణాళినీమాతగారి సందేశాన్ని చదివి వినిపించారు.

      భారతదేశం యొక్క గొప్ప సంపద మరియు శక్తి—ఈ రోజు మరియు ఆమె సుదీర్ఘ చరిత్ర అంతటా—ఆమె యొక్క దీర్ఘదర్శిలు గ్రహించిన మరియు మానవాళికి అందించిన శాశ్వతమైన ఆధ్యాత్మిక సత్యాలను ఆమె (భారతదేశం) ప్రేమగా మరియు చైతన్యవంతంగా వ్యక్తీకరించడంలో ఉంది. యుగయుగాలుగా, గొప్ప ఆత్మలు—మహాత్ములు, సాధువులు, అత్యున్నత దివ్య సాక్షాత్కారాన్ని పొందిన ఋషులు—భారతమాత పట్ల వారికున్న గొప్ప ప్రేమతో ఈ ఉన్నతమైన మరియు అత్యంత ఉదాత్తమైన విషయానికి సేవ చేసేందుకు ప్రేరేపించబడ్డారు. అటువంటి ఆదర్శప్రాయమైన ఒక్క దివ్య వ్యక్తి యొక్క జీవితకృతిని గౌరవించటానికి భారతదేశ ప్రభుత్వం ఈ రోజుని ఎన్నుకోవడం భారతదేశానికే కాదు, ఈ సమస్యాత్మక సమయాల్లో ఆధ్యాత్మిక వెలుగు కోసం ఆమె వైపు చూసే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆశాజనకం మరియు ప్రేరణాత్మకం.

      “మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, మీరు వేలమందిని సంస్కరించ గలుగుతారు” అని శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు తరచుగా చెప్పేవారు. యోగా మరియు ధ్యానం భారతదేశం యొక్క దివ్య మరియు సార్వత్రిక శాస్త్రం, ఈ శాస్త్రం మన ప్రవర్తనా మరియు ఆలోచనా విధానాలలో శాశ్వత సానుకూల మార్పులను తీసుకురావడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులను కలిగి ఉంది. పరమహంస యోగానందగారి సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలు మరియు ఆదర్శాలలో ఒకటి, భారతదేశపు గొప్ప ఋషులు సహస్రాబ్దాలుగా బోధించిన ధ్యానం యొక్క శాస్త్రీయ పద్ధతుల జ్ఞానాన్ని అన్ని దేశాలలో వ్యాప్తి చేయడం, దీని ద్వారా ప్రతి మానవుడు—జాతీయత, కులం లేదా మతంతో సంబంధం లేకుండా—అతను లేదా ఆమె వారి స్వంత దైవత్వం మరియు అంతర్గత శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవించవచ్చు. ప్రతి వ్యక్తిలో శాంతి ఉన్నప్పుడు, ప్రపంచ శాంతి సహజంగానే అనుసరిస్తుంది.

      ఈ ప్రత్యేక రోజున తన బిజీ షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చించి వ్యక్తిగతంగా హాజరైనందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌజన్యమును నేను ఎంతో అభినందిస్తున్నాను. వై‌.ఎస్‌.ఎస్. శతాబ్ది ఉత్సవాల స్మారక స్టాంపును స్వయంగా యోగాలో ఉత్సాహవంతమైన సాధకుడైన శ్రీ మోదీ విడుదల చేయడం ఎంతో సముచితం. అంతర్జాతీయ యోగా దినోత్సవం—ఆయన ప్రతిపాదించి, తదనంతరం ఐక్యరాజ్యసమితి తీర్మానంగా రికార్డు సంఖ్యలో దేశాలు అతి తక్కువ సమయంలో ఆమోదించడం—ప్రపంచ వ్యాప్తంగా యోగా సైన్స్ యొక్క సార్వత్రిక సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ మైలురాయి ఉపక్రమమునకు శ్రీ మోదీకి మా కృతజ్ఞతలు.

      భారతదేశ ఆధ్యాత్మికతను పాశ్చాత్య దేశాల భౌతిక సామర్థ్యంతో కలపడం ద్వారా ఆదర్శవంతమైన ప్రపంచ నాగరికత ఆవిర్భవించనుందని పరమహంస యోగానందగారు సూచించారు. అందువల్ల భారతదేశానికి ఉన్నత పరిణామ చక్రంలో మానవ చైతన్యమును పెంపొందించడంలో సహాయం చేయడానికి ముఖ్యమైన మరియు అవసరమైన పాత్ర ఉంది. శ్రీ శ్రీ యోగానందగారు మరియు భారతదేశంలోని ఇతర గొప్ప గురువులు దృష్టాంతంగా నిలిచిన, ఐక్యతను ప్రసాదించే ఆధ్యాత్మిక బోధనల సాధన ద్వారా, మన మానవ కుటుంబంలోని ప్రతి సభ్యుడు ప్రపంచ శాంతి, దైవ సామరస్యం మరియు శ్రేయస్సు కలిగి ఉన్న యుగం వైపు వెళ్ళాలని నా ప్రగాఢ ప్రార్థన.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు లేచి నిలబడగానే దిక్కులు పిక్కటిల్లే కరతాళ ధ్వనులు వినిపించాయి. తన ప్రసంగంలో, ఆయన 7 మార్చి యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తు ఇలా అన్నారు, అరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక గొప్ప ఆత్మ, మానవ శరీరము యొక్క పరిమితుల నుండి విముక్తి పొందింది మరియు రాబోయే యుగయుగాలకు ఆ ఆత్మ అత్యంత పూజనీయం అయింది.

ప్రపంచ జనాభాలో 95 శాతం మంది తమ సొంత భాషలో చదవగలిగేలా ఇప్పుడు అనేక భాషలలో లభ్యమవుతున్న ఒక యోగి ఆత్మకథ పుస్తకం యొక్క శక్తి మరియు ప్రజాదరణ వేపు శ్రీ మోదీ ప్రేక్షకుల దృష్టిని మళ్ళించారు. ప్రజలు దేవాలయంలో పొందే ప్రసాదం అంతా తామే తినక ఇతరులతో పంచుకోవాలని ఎలా కోరుకుంటారు, అలాగే ఈ పుస్తకము చదివిన వారందరూ, దానిని ఇతరులతో పంచుకోవడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారని ఆయన అన్నారు. ఎందుకంటే యోగానందగారి జీవితం మరియు సందేశం దేవాలయం నుండి పొందే ప్రసాదం అంత పవిత్రమైనది మరియు పావనమైనది అని ప్రధాని చెప్పారు.

గురూజీకి తన మాతృభూమి పట్ల ఉన్న గాఢమైన ప్రేమ మరియు భక్తికి నివాళులు అర్పిస్తూ, ప్రధాన మంత్రి గురూజీ కవిత, మై ఇండియా నుండి ఉటంకించారు. గురూజీ కవిత సమాధి మరియు ఇతర రచనల గురించి తన వివరణను పంచుకుంటూ యోగ తత్వశాస్త్రం యొక్క సూక్ష్మ నైపుణ్యాల గురించి చాలా స్పష్టతతో మాట్లాడారు. యోగదా సత్సంగ సొసైటీ చేస్తున్న ప్ర‌శంస‌నీయ కార్య‌క్ర‌మాలను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసిస్తూ, యోగాన‌ంద‌గారి నిస్వార్థ, ప్రతిఫలెచ్చ లేని సేవా స్ఫూర్తి మూలంగానే సంస్థ ఒక శ‌తాబ్దాన్ని దాట‌డమే కాకుండా దాని స్థాప‌కుని సచేతనమైన ఉపస్థితితో అభివృద్ధి చెందుతూ, పుంజుకుంటుంద‌ని అన్నారు. కుటుంబం యొక్క సారూప్యతను మరియు అది ఎలా పని చేస్తుందో ఉటంకిస్తూ, ప్రధాన మంత్రి ఇలా అన్నారు, గురూజీ బోధనల స్వచ్ఛతను వై‌.ఎస్‌.ఎస్. విజయవంతంగా సజీవంగా ఉంచిందని, ప్రధాన లక్ష్యం నుండి “విలీనీకరణ లేదా మళ్లింపును” అనుమతించలేదని ప్రధాని అన్నారు.

గొప్ప సాధువు కబీర్ కవితలోని కొన్ని పంక్తులను పఠిస్తూ, ప్రధాన మంత్రిగారు పరమహంస యోగానందగారి పట్ల తనకున్న గౌరవాన్ని మరియు ప్రశంసలను వ్యక్తం చేశారు. యోగులు అమరులని; వారు ఎప్పటికీ అదృశ్యం కారు లేదా అంతర్ధానము కారు, కానీ ఎప్పటికీ మనతోనే ఉంటారు అని ఆయన అన్నారు. తన ఆత్మ ఎప్పుడూ జీవించి ఉన్న అలాంటి వ్యక్తి యొక్క ఉనికిని అనుభవించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెబుతూ ఆయన ముగించారు. గురుదేవులు ప్రారంభించిన గొప్ప సంప్రదాయానికి, సాధువులు అందరికీ, సత్యాన్వేషకలు అందరికీ నమస్కరిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రధానమంత్రి హృదయం నుండి సూటిగా చేసిన ప్రసంగానికి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. గురూజీ కవిత మై ఇండియాకు హిందీ అనువాదమును ఫ్రేము చేసిన ప్రతిని ప్రధానమంత్రికి అందించారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి తన ప్రసంగంలో అదే పద్యంలోని పంక్తులను పఠించడం నిజంగా దివ్య యాదృచ్చికం.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మారక తపాలా స్టాంపును విడుదల చేసి, స్టాంపు ఆల్బమ్‌ను ప్రదర్శించారు. ఆయనతో పాటు వై‌.ఎస్‌.ఎస్. బోర్డు సభ్యులు, (ఎడమ నుండి కుడికి) స్వామిలు శ్రద్ధానంద, శుద్ధానంద, స్మరణానంద, విశ్వానంద, మరియు నిత్యానంద మరియు శ్రీ కమల్ నైన్ బక్షి కూడా కనిపిస్తున్నారు.

ప్రింట్, టీవీ మరియు ఆన్‌లైన్ మీడియా ఛానెల్‌లలో ప్రెస్ ద్వారా ఈ కార్యక్రమం విస్తృతంగా కవర్ చేయబడింది. స్మారక స్టాంప్ మొదటి రోజు కవర్, విరాళం ప్రాతిపదికగా మెమెంటోగా అందుబాటులో ఉంచబడింది. ఇది నిజంగా వై‌.ఎస్‌.ఎస్. శతజయంతి ఉత్సవాలకు అనుగుణమైన కార్యక్రమం, ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ చిరకాలం గుర్తుండిపోతుంది. అపారమైన భక్తితో మరియు అంకితభావంతో రాత్రింబగళ్లు పనిచేసి ఈ కార్యక్రమము విజయవంతంగా ముగింపు పలికేందుకు కృషి చేసిన వాలంటీర్లందరికీ ధన్యవాదాలు.

ఇతరులతో షేర్ చేయండి