తరచుగా అడిగే ప్రశ్నలు

యోగా అంటే ఏమిటి?

యోగా అనే పదానికి అర్థం ఆత్మ – వ్యక్తి చైతన్యం, పరమాత్మ – విశ్వ చైతన్యం యొక్క ‘కలయిక’. ఈ కాలంలో యోగాభ్యాసం వేరు వేరు మార్గాల్లో అనుసరించబడుతున్నా అది యోగాసనాలుగా ప్రచారంలో ఉంది, గాఢమైన యోగాభ్యాసం మాత్రం ఒక్కటిగా ఉన్న ఆత్మను అనంతమైన పరమాత్మతో అనుసంధానం చేయడానికి నిర్దేశించబడింది.

మీరు నేర్పే యోగా పేరేమిటి?

పరమహంస యోగానందగారు రాజ యోగ మార్గాన్ని బోధించారు, అందులో శాస్త్రీయమైన ధ్యాన పద్ధతులు — క్రియాయోగం — ఈ యోగ దీక్షతో సాధకుడు మొదటి నుంచి ఆత్మ పరమాత్మల కలయిక అనే అంతిమ లక్ష్య సాధన యొక్క పరిపూర్ణతా అనుభూతులను తెలుసుకుంటూ ముందుకు సాగుతాడని చెప్పడం జరిగింది. క్రియాయోగ మార్గం అంటే మనిషి జీవన విధానానికి కావలసిన తత్వశాస్త్రాన్ని కూడా బోధిస్తుంది. క్రియాయోగం అభ్యసించడం మనిషి తన మానసిక మరియు శారీరక విధానాలను శాంత పరిచి, అతని చైతన్యాన్ని బంధనాల నుంచి విముక్తి చేసి, భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సచ్చిదానంద స్థితిని అర్థం చేసుకునే శక్తి నిస్తుంది.

వై.ఎస్.ఎస్. బోధనల్లో హఠ యోగాసనాలు కూడా ఉంటాయా?

వై.ఎస్.ఎస్. బోధనలు హఠ యోగాసనాల గురించి గాని వాటిని ఎలా సాధన చేయాలనే విషయాలు గాని తెలియజేయవు. కానీ పరమహంస యోగానందగారు వాటిని నేర్చుకొని సాధన చేయడం చాలా ఉపయోగకరమని చెప్పారు.

క్రియాయోగం గురించి నాకు పూర్తి వివరాలు ఎలా తెలుస్తాయి మరియు పరమహంస యోగానందగారి బోధనలు నేనెలా చదవగలను?

మా ద్వారా ప్రచురింపబడిన ఉచిత పుస్తకం, ‘హైయెస్ట్ ఎచీవ్మెంట్స్ త్రు సెల్ఫ్-రియలైజేషన్‘ చదవండి. ఇంకా పరమహంస యోగానందగారిచే వ్రాయబడిన ఆధ్యాత్మిక గ్రంథం ‘ఒక యోగి ఆత్మకథ‘ కూడా చదవండి. శ్రీ యోగానందగారి బోధనల గురించి ఆసక్తి ఉంటే ‘యోగదా సత్సంగ పాఠాల’ కోసం అప్లికేషను పెట్టుకోండి.

యోగదా సత్సంగ పాఠాల్లోని విషయాలేమిటి?

యోగదా సత్సంగ పాఠాలు పరమహంస యోగానందగారిచే బోధించబడిన యోగా పద్ధతులు, క్రియాయోగం నేర్చుకోవడానికి వీలుగా అంచెలంచెలుగా చదువుకుంటూ సాధన చేయడానికి ఉపయోగపడేవిగా ఇంట్లో నుంచే అర్థం చేసుకుంటూ అనుసరించే విధంగా తీర్చిదిద్దబడ్డాయి. ఆయన ద్వారా ‘జీవించడం ఎలా?’ అన్న శీర్షికలో తెలియజేయబడ్డ ఎన్నో విషయాలు కూడా ఈ పాఠాల్లో చేర్చబడ్డాయి.

నా ఆధ్యాత్మిక లక్ష్యాలను నేనెలా చేరగలను, నా ప్రాపంచిక బాధ్యతలు నాకు వేరే పనులకు సమయం లేకుండా చేస్తున్నాయి?

ఎన్నో విధాల బాధ్యతలతో మిగతా పనులకు సమయం లేకుండా సతమతమవుతున్న వాళ్ళ ఇబ్బందులను పరమహంస యోగానందగారు బాగా అర్థం చేసుకున్నారు. ఆయన సమతుల్యమైన మార్గం అంటే ధ్యానం మరియు సరైన జీవన మార్గం రెండింటి యొక్క కలయికతో కూడిన దాన్ని బోధించారు. ఆయన బోధనలు చాలా అద్భుత రీతిలో అనుసరించదగినవిగా మీ యొక్క రోజువారీ కుటుంబ మరియు కార్యాలయ బాధ్యతల నిర్వహణలో మార్గదర్శకంగా ఉంటాయి. మీ ప్రతి కార్యాచరణలో భగవంతున్ని తీసుకొనిరావడం మరియు ఆయన సాన్నిహిత్యంతో కలిగే ఆనందం అనుభవించడం, ఆయన బోధనల్లో మీకు లభిస్తాయి. యోగదా సత్సంగ సొసైటీ వారి ఆధ్యాత్మిక పద్ధతులను సాధన చేస్తూ నేర్చుకోవడానికి ప్రతి రోజూ కొంత సమయం కేటాయించడం ఎలాగో తెలుసుకోవడానికి ఈ బోధనలు ఎంతో ఉపయోగపడతాయి. సాధనకు ఎంత ఎక్కువ సమయం లభించిందన్న దాని కంటే, విధేయత మరియు సాధనలో గాఢత వలన భగవంతునితో మన ఆంతరంగిక అనుబంధం ఏర్పరచుకోవడానికి, ఈ బోధనల ద్వారా వీలవుతుంది.

నా ఆధ్యాత్మిక సాధనలో నేను ముందుకు వెళుతున్నానో లేదో నాకెలా తెలుస్తుంది?

ఆధ్యాత్మిక అభివృద్ధి ఒక క్రమ విధానం. మనలో జరిగే మార్పులే మనకు అనుకూలంగా కావలసిన విధంగా జరిగినప్పుడు – అంటే, అంతా బాగుందనే భావన పెరుగుతున్నప్పుడు; భద్రత, ప్రశాంతత, ఆనందం, సమగ్ర అవగాహన చెడు అలవాట్ల నుంచి విముక్తి, దాంతో పాటు భగవంతుని పై అధిక ప్రేమ, తెలుసుకోవాలనే అభిలాష పెరగటం; ఇవన్నీ జరుగుతున్నట్లైతే ఆధ్యాత్మిక అభివృద్ధికి అవి లక్షణాలుగా భావించవచ్చు. ఆధ్యాత్మికంగా విజయం సాధించాలంటే మంచి పట్టుదల ఉండాలని పరమహంస యోగానందగారు చెప్పారు. ఒక్కోసారి సాధనలో గొప్ప అభివృద్ధి సాధిస్తున్న వాళ్ళకు కూడా దాన్ని సాక్షాత్కరించే ఆధ్యాత్మిక అనుభవాలు ఉండవచ్చు, అసలేమీ లేకపోవచ్చు. నిజం చెప్పాలంటే మనం వదలకుండా ఆధ్యాత్మిక సాధన చేయగలిగినప్పుడు, జీవితంలో ఎదురయ్యే రోజువారీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలిగినప్పుడు, మనం ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించినట్లన్నమాట, భగవంతుని దగ్గర్నుంచి మనకు అర్థమయ్యే విధమైన సమాధానం రాకపోయినా కూడా. మన రోజువారీ ప్రవర్తనలో నిజమైన అభివృద్ధి మన ఆలోచనలను, మనలో మార్పులను తెలియజేస్తుంది. కానీ మనకు కలిగే సాక్షాత్కారాల వలన గాని అనుభవాల వలన గాని అది జరగదు.

వై.ఎస్.ఎస్. బోధనలను అనుసరిస్తూ ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం నేను చేయవచ్చా?

పరమహంస యోగానందగారు అన్నీ మతాల వారిని తన బోధనలు స్వీకరించడానికి ఆహ్వానించారు. దాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు, ఆయన నేర్పే యోగ మార్గాలను అనుసరించే వాళ్ళకు కలిగే ఫలితాలు ఒక మత సిద్ధాంతాన్ని అంగీకరించడం ద్వారా లభించేవి కావని, సాధనతో భగవంతుని స్వయంగా తెలుసుకోవడం వలన మాత్రమే అని. అయితే వివిధ మార్గాల్లో చెప్పబడిన ఆధ్యాత్మిక పద్ధతులను కలిపి సాధన చేయడం వలన కలిగే ఫలితం తక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. మీ ఆధ్యాత్మిక లక్ష్యం చేరుకోవాలంటే ఒక్క మార్గాన్ని ఎన్నుకొని దాన్ని వదలకుండా అనుసరించి ఆ పద్ధతిలో సాధన చేయడం మంచిదని చెప్పారు.

ఒక మత విధానాన్ని అనుసరిస్తూ చర్చిలకు, ఆలయాలకు, మసీదుల్లో జరిగే ప్రార్థన కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నవారు, అలా కావాలనుకుంటే దాన్ని వదలకుండా వెళ్లవచ్చని చెప్పారు. యోగదా పాఠాల్లో చెప్పబడిన ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించే వివిధ మతాల అనుయాయులు వాళ్ళ మత విశ్వాసంలో అభివృద్ధిని, సాధనలో సఫలతను పొందారు. (యోగదా మార్గం అనుసరిస్తున్న సాధకులు, పూర్తిగా వై.ఎస్.ఎస్. సంస్థలో ఉంటూ, ఎవరు తమ జీవితాన్ని సేవలకు అంకితం చేయాలని అనుకుంటారో, వాళ్ళు క్రియాయోగ దీక్షకు అవసరమయిన సాధనను పూర్తి చేసి, పవిత్రమైన దీక్షను స్వీకరించిన తర్వాత మాత్రమే చేరాలి.)

ధ్యాన తరగతులు మీరు నిర్వహిస్తున్నారా?

మీరు ధ్యానం చేయడం నేర్చుకోవాలనుకుంటే యోగదా సత్సంగ పాఠాలు చదవడానికి సభ్యులుగా చేరడాన్ని మేము సిఫార్సు చేస్తాము. పరమహంస యోగానందగారి జీవితకాలంలో ఆయన ద్వారా చెప్పబడిన విషయాలే మేము ప్రచురించిన, ఇంట్లోనే చదువుకోవడానికి తయారు చేయబడిన పాఠాల్లో పొందుపరచడం జరిగింది. క్రియాయోగం గురించి, శాస్త్రీయ ధ్యాన ప్రక్రియ గురించి, “జీవించడం ఎలా” అని వివరించిన గురువుగారి ప్రవచనాల సారాంశాన్ని ఈ వై.ఎస్.ఎస్. పాఠాలు మీకు తెలియజేస్తాయి.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థకు భారతదేశంలో 180 ఆశ్రమాలు, సాధనాలయాలు మరియు ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడైతే సభ్యులు వచ్చి సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తారో, ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తారో, వాటి ద్వారా కూడా కొత్తగా చేరిన సభ్యులకు కావలసిన సహకారం ఇవ్వడం జరుగుతుంది.

నేను క్రియాయోగ దీక్ష ఎప్పుడు తీసుకోగలను?

పరమహంస యోగానందగారు సాధకులను మొదటి రెండు మెట్లు (సుమారుగా ఒక సంవత్సరం) పాఠాలలో చెప్పబడినట్లుగా, క్రమం తప్పకుండా రోజూ సాధన చేయవలసిందిగా చెప్పారు. కనీసం ఆరు నెలలు, పాఠాల్లో చెప్పబడిన ప్రాథమిక యోగ పద్ధతుల సాధన చేయడం ద్వారా సాధకులు ఉన్నతమైన ‘క్రియాయోగం‘ దీక్ష తీసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా పాఠాలు చదవడం, సాధన చేయడం వలన పరమహంస యోగానందగారి బోధనలు బాగా అర్థం కావడం, మీరు పవిత్రమైన గురు-శిష్య సంబంధంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధికి గురువు యొక్క ప్రత్యక్ష శిక్షణ అవసరమా?

పరమహంస యోగానందగారు ఇలా వివరించారు: “నిజమైన గురువులు ఎల్లప్పుడు సజీవంగా ఉంటారు – శరీరంలో ఉన్నా లేకపోయినా. వారి చైతన్యం తమ శిష్యుల చైతన్యంతో కలిసిపోయి ఉంటుంది, వాళ్ళు తనతో సమానమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నా లేకపోయినా. సర్వవ్యాపకత్వం అనేది సద్గురువుల లక్షణాల్లో, అభివ్యక్తీకరణలో ముఖ్యమైనది.” ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం తనను ఆశ్రయించేవారికి సహాయం చేయడం, ఆశీర్వదించడం పరమహంస యోగానందగారు ఇప్పుడు కూడా చేస్తున్నారు.

వై.ఎస్.ఎస్. గురు పరంపరలో పరమహంస యోగానందగారి తర్వాత ఎవరైనా గురువుగా నియమించబడ్డారా?

మహాసమాధిలోకి వెళ్లడానికి ముందే పరమహంసగారు ఇలా అన్నారు, భగవదేచ్ఛ ప్రకారం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గురు పరంపరలో తానే చివరి గురువునని. “నా తర్వాత నేను ఇచ్చిన బోధనలే గురువుగా ఉంటాయి. వాటి ద్వారానే మీరు నాతో మరియు నన్ను పంపిన గొప్ప గురువులతో అనుసంధానంలో ఉంటారు.” కాబట్టి తర్వాత వచ్చిన శిష్యులెవరూ గురువుగా బాధ్యతలు స్వీకరించడం చేయరు అని పరమహంస యోగానందగారు స్పష్టం చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఈ విధమైన దివ్య శాసనం చేయడం కొత్త కాదు. సిక్కు మత స్థాపకులైన గురునానక్ గారి తర్వాత ఎవరూ గురువుగా ఉండరని, వారి గ్రంథంలో వ్రాయబడిన బోధనలే గురువుగా పూజించబడతాయని చెప్పారు. పరమహంస యోగానందగారు తనచే స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా పని చేస్తానని హామీ ఇచ్చారు.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలకు ప్రస్తుత అధిపతి ఎవరు?

ప్రస్తుతం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలకు అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక నాయకుడు స్వామి చిదానందగారు. ఆయన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థలో నలభై సంవత్సరాలు సన్యాసిగా ఉన్నారు. 2010లో తన శరీరం చాలించే ముందు అప్పటి అధ్యక్షురాలుగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.లో ఉన్న శ్రీ దయామాతగారు తనకు స్వామి చిదానందగారి పై ఉన్న దృఢ విశ్వాసాన్ని మృణాళినీమాతకు వ్యక్తపరిచారు. శ్రీ మృణాళినీమాత దేహం చాలించడానికి ముందు ఈ విషయాన్ని ధ్రువ పరుస్తూ ఈ సంస్థల యొక్క డైరెక్టర్ల బోర్డు వారికి కూడా తాను శ్రీ దయామాతతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. స్వామి చిదానందగారు ఆగస్టు 30, 2017న అధ్యక్షులుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేత ఎన్నుకోబడ్డారు.

“ఆత్మ సాక్షాత్కార స్థితికి చేరిన గొప్ప పురుషులు, స్త్రీలు మాత్రమే ఈ సంస్థలకు అధిపతులవుతారని” పరమహంస యోగానందగారు చెప్పారు. “వాళ్లెవరో భగవంతుడికి, గురువులకు తెలుసు. నా ఆధ్యాత్మిక వారసులుగా, ఈ సంస్థ ఆధ్యాత్మిక మరియు సంస్థాగత విషయాల్లో సేవ చేస్తారు.”

Share this on

This site is registered on Toolset.com as a development site.