భక్తి సంకీర్తన యొక్క అద్భుతశక్తి

పరమహంస యోగానందగారి "వర్డ్స్ ఆఫ్ కాస్మిక్ చాంట్స్ (Words of Cosmic Chants)"కు ముందు మాట

[చాలా సంస్కృతులలో ఉన్న కీర్తన సంప్రదాయం, వాటి అంతర్గత సౌందర్యాన్ని మాత్రమే కాక ఆధ్యాత్మిక శక్తిని కూడా ఈ రోజుల్లో గుర్తించేట్లు చేస్తోంది. పశ్చిమ దేశాలకు భారతదేశ భక్తి సంకీర్తన కళను పరిచయం చేయడంలో పరమహంస యోగానందగారు మార్గదర్శకులుగా ఉంటారు. 1930లో ఆయన వ్రాసిన ‘వర్డ్స్ ఆఫ్ కాస్మిక్ చాంట్స్ (Words of Cosmic Chants)’ పుస్తకానికి ముందుమాటలో ‘ఆధ్యాత్మికరించబడిన’ గీతాలు, ధ్యానం కోసం చేసే ప్రయత్నాలలో మనసును స్థిమితము చేయడానికి మరియు కేంద్రీకరించడానికి ఎలా సహాయపడతాయో వివరించారు:]

ప్రాచుర్యం పొందిన పాటలు సాధారణంగా మారిపోయే ఆసక్తులు లేదా భావాల స్ఫూర్తితో రూపొందించబడతాయి. కాని, భగవంతునిపై నిజమైన భక్తి లోతుల నుండి పుట్టి, బిగ్గరగా లేదా మానసికంగా, నిరంతరంగా గానం చేయబడి, భగవంతుని నుండి ఎరుకతో కూడిన ప్రతిస్పందన, అపరిమితమైన ఆనందం రూపంలో పొందేవరకు గానం చేయబడే కీర్తన ఆధ్యాత్మికరించబడిన కీర్తన అవుతుంది.

కీర్తనలు అగ్గిపుల్లల్లాగా భక్తి అనే పునాదిరాయిపై గీసినప్పుడు భగవంతుని అవగాహన అనే అగ్నిని ఉత్పత్తి చేస్తాయి. సాధారణమైన కీర్తనలు తడిచిన అగ్గిపుల్లల్లా దైవసాక్షాత్కారానికి సంబంధించిన ఎటువంటి మెరుపును ఉత్పత్తి చేయలేవు.

ఈ పుస్తకంలోని విశ్వగీతాలన్నీ ఆధ్యాత్మికరించబడ్డాయి; అంటే వివిధ సామూహిక సమావేశాలలో గానం చేసినవారికి, భగవంతుని నిజమైన ప్రతిస్పందన లభించే వరకు బిగ్గరగా మరియు మానసికముగా గానం చేయడం జరిగింది. ఈ కీర్తనలను గానం చేసే ప్రతి గాయకుడు, భావోద్వేగాలను లేదా చెవులను ఆహ్లాదపరిచే సాధారణ సంగీతంలా కాకుండా భగవంతునితో అనుసంధానం కలిగించే ఆత్మసంతృప్తి గీతాలుగా గానం చేయాలని ఆశిస్తున్నాము.

'ధ్వని' ఈ విశ్వంలో అత్యంత బలమైన శక్తి

‘ధ్వని లేదా ప్రకంపన’ ఈ విశ్వంలో అత్యంత బలమైన శక్తి. సంగీతం ఒక దివ్యకళ. అది సంతోషం కలిగించడానికి మాత్రమే కాక, భగవంతుని సాక్షాత్కారానికి ఒక మార్గం. భక్తితో చేసే గానం వల్ల కలిగే ప్రకంపనలు, విశ్వప్రకంపనలతో లేదా పదంతో ఏకత్వం చెందుతాయి. “ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను” (జాన్ 1:1).

ఈ కీర్తనలను గానంచేసి ఉత్తమ ఫలితాలను కోరుకునేవారు, ఒంటరిగా లేదా భగవంతుని నిజమైన భక్తులతో కలసి ఆలపించవచ్చును. స్వరాలు నేర్చుకున్న తర్వాత, ఒక వ్యక్తి తదేక ధ్యానముతో గాఢమైన మరింత గాఢమైన భక్తితో పాటలోని పదముల అర్థాన్ని అర్థం చేసుకోవడానికి కృషి చేస్తూ గానములోని ఆనందంలో పూర్తిగా మునిగిపోయెవరకు మళ్ళీ మళ్ళీ గానంచేస్తూ ఉండాలి. ఈ ఆనందకరమైన భావన భగవంతుని మొదటి అనుభూతి అవుతుంది.

చిత్తశుద్ధి, దృఢవిశ్వాసం, శ్రద్ధ మరియు సహజావబోధనతో నిండిన పదాలు, కష్టాల రాళ్ళను తొలగించి, కోరుకున్న మార్పును సృష్టించే శక్తి కలిగిన అత్యంత పేలుడు ప్రకంపన కలిగిన బాంబుల వంటివి.

కీర్తనలు గానం చేసే ఐదు స్థాయిలు: బిగ్గరగా గానం చేయడం-గుసగుసలుగా గానం చేయడం-మానసికంగా గానం చేయడం-అవచేతన గానం-అధిచేతన గానం. ఒకరి ఆలోచనలు మరియు కార్యకలాపాల నేపధ్యంలో మనస్సు అప్రయత్నంగా కీర్తనను పునరావృతం చేసినప్పుడు మాత్రమే, అంతర్గత స్పృహతో అవచేతన గానం స్వతస్సిద్ధంగా మారుతుంది.

అధిచేతన గానం 'ఓం' యొక్క అవగాహనకు దారి తీస్తుంది

అధిచేతన గానం అంటే అంతర్గత గానం యొక్క ప్రకంపనలు సాక్షాత్కారంగా మార్చబడతాయి మరియు అధిచేతన, అవచేతన మరియు చేతన మనస్సులలో స్థిరపడతాయి. ఒక ఊహాత్మక లేదా బాహ్యశబ్దం మీద కాకుండా నిజమైన విశ్వప్రకంపన అయిన ‘ఓం’ మీద నిరాటంకంగా దృష్టిని ఉంచడం అనేది నిజమైన అధిచేతన గానానికి నాంది అవుతుంది.

బైబిలులోని పది ఆజ్ఞలలో ఒకటి: “నీ దేవుడి నామాన్ని నీవు వృధాగా జపించవద్దు.” ఒక వ్యక్తి భగవంతునిపై పూర్తిగా శ్రద్ధ లేకుండా, ఒక కీర్తనను లేదా ప్రార్థనను ఎంతగా పునరావృతం చేసినా, అది వ్యర్థమైపోతుంది. భగవంతుని నామములోని సర్వవ్యాపక శక్తిని ఉపయోగించుకోకుండా, ఎటువంటి ఫలితం లేకుండా మరియు ఆయన నుండి ప్రతిస్పందన పొందకుండా చేసినట్లవుతుంది. చిలుక పలుకుల్లాంటి అటువంటి ప్రార్థనలకు భగవంతుడు సమాధానం చెప్పడు. నిరంతరం పెరుగుతున్న అవగాహన మరియు భక్తితో ఒక కీర్తనను పునరావృతం చేయడమంటే భగవంతుని నామాన్ని వ్యర్థంగా కాకుండా ప్రభావవంతంగా చేసినట్లవుతుంది.

ఈ ఆధ్యాత్మికరించబడిన కీర్తనలను, విశ్వగీతాలను ఎవరైతే నిజమైన భక్తితో గానం చేస్తారో, వారు భగవంతునితో అనుసంధానము మరియు పారవశ్యం కలిగించే ఆనందాన్ని పొందుతారు మరియు వాటి ద్వారా శరీరం, మనస్సు మరియు ఆత్మల యొక్క స్వస్థతను పొందుతారు.

భగవంతుడు భక్తునికి సమాధానమిచ్చాడు అనడానికి ఆనందమే నిదర్శనం

ఈ కీర్తనలలో ప్రతి ఒక్కదాన్ని ఒకసారి కాకుండా, చాలాసార్లు గానం చేయాలి, మళ్ళీ, మళ్ళీ గానము చేయడము వలన ఉత్పన్నమయ్యే శక్తిని ఉపయోగిస్తూ, గాయకుడు తన హృదయమనే రేడియోలో గొప్ప ఆనందాన్ని పొందే వరకు గానం చేయాలి. ఈ ఆనందాన్ని అనుభవించినప్పుడు, దేవుడు గాయకుడికి సమాధానమిచ్చాడని మరియు అతని భక్తి సరిగ్గా అనుశృతి చేయబడిందని రుజువు అవుతుంది; కీర్తనలో అతని భక్తి గాఢత యొక్క ప్రసారం సత్యమైనది మరియు లోతైనది.

ఈ కీర్తనలను ఏకాంతంలో లేదా సామూహికంగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలపించేవారు, ఆ కీర్తనలు తన మనస్సులోని అవచేతన స్థితిలో పునరావృతమవుతున్నాయని, వారి రోజువారీ కార్యకలాపాలనే యుద్ధములో కూడా చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తున్నాయని కనుగొంటారు.

క్రమక్రమంగా అవచేతన పునశ్చరణ అధిచేతన సాక్షాత్కారంగా మారుతుంది, భగవంతుని యొక్క వాస్తవ అవగాహనను తీసుకువస్తుంది. గానం అవచేతనలోకి, తరువాత అధిచేతన సాక్షాత్కారానికి మారి, దైవ సానిధ్యంలోనికి తీసుకువెళ్ళే వరకు ఒకరు గాఢంగా మరియు ఇంకా గాఢంగా గానం చేయాలి.

ప్రతి భక్తుడు ఈ కీర్తనలను గానం చేయటానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. ముందుగా బిగ్గరగా, తర్వాత గుసగుసగా, తర్వాత మానసికంగా జపించండి. దేవుని పేరు మీద సామూహికముగా సమావేశమయినవారు, ఈ కీర్తనలలో ఒకదానిని ఎంచుకుని, పియానో లేదా సంగీత సహవాయిద్యంతో గానం చేయాలి, తర్వాత నెమ్మదిగా, ఆ తర్వాత ఎలాంటి సంగీతము లేకుండా గుసగుసలాడుతూ, చివరకు మానసికంగా మాత్రమే గానం చేయాలి. ఈ విధంగా భగవంతుని ఉనికిని గురించి గాఢమైన అవగాహన పొందవచ్చు.

para-ornament

అమెరికా ప్రేక్షకులు ఈ ఆత్మ గీతాలను అర్థం చేసుకుంటారు

ఆత్మ శక్తితో నిండిన సంగీతమే నిజమైన విశ్వజనీనమైన సంగీతం, ఇది అందరి హృదయాలకు అర్థమవుతుంది. నేను అమెరికా ప్రేక్షకుల ముందు కనిపించిన అనేక సంవత్సరాలలో ఈ సత్యానికి సంబంధించిన అనేక రుజువులు చూశాను . నేను ఏప్రిల్ 1926లో న్యూయార్క్‌లోని కార్నెగీ హాల్‌లో వరుస ఉపన్యాసాలు ఇస్తున్నాను మరియు ఆ సమయంలో నేను ఈ కీర్తనలలో ఒక దానిని గానం చేయాలనే ఆలోచనను కొంతమంది సంగీత స్నేహితులకు సూచించాను, ముందస్తు సాధన లేకుండా మొత్తం ప్రేక్షకులను గానం చేయమని కోరాను. కీర్తనలు అమెరికా ప్రేక్షకుల అవగాహనకు పరాయివని నా స్నేహితులు భావించారు.

సంగీతం అనేది భగవంతుని పట్ల ఆత్మ భక్తి యొక్క విశ్వజనీనమైన భాష అని మరియు ప్రాచ్య లేదా పాశ్చాత్య సంగీతంతో సుపరిచితుడైనా కాకపోయినా ఆత్మీయులందరూ నేను కీర్తనలు గానం చేస్తున్నప్పుడు నా హృదయం యొక్క దివ్య వాంఛను అర్థం చేసుకుంటారని నేను ధృఢముగా చెప్పాను.

ఒక సాయంత్రం నేను “హే హరి సుందర” అనే కీర్తన పాడటం ప్రారంభించాను మరియు ఇంతకు ముందెన్నడూ వినని ప్రేక్షకులను ఆ కీర్తనను నాతోపాటు గానం చేయమని అడిగాను. ఒక గంట ఇరవై ఐదు నిమిషాల పాటు, మొత్తం ప్రేక్షకుల వేలాది స్వరాలు “హే హరి సుందర” అని, ఆనందకరమైన స్తుతితో కూడిన దివ్య వాతావరణంలో గానం చేశాము.

నేను వేదికపై నుంచి వెళ్ళిన తర్వాత కూడా ప్రేక్షకులు ఆ కీర్తనను గానం చేస్తూ కూర్చున్నారు. మరుసటి రోజు చాలా మంది పురుషులు మరియు స్త్రీలు భగవంతుడి సాన్నిధ్యాన్ని అనుభవించామని మరియు ఆ పవిత్ర కీర్తన సమయములో శరీరం, మనస్సు మరియు ఆత్మలకు స్వస్థత చేకూరిందని తెలిపారు, మరియు ఎన్నో అభ్యర్థనలు వచ్చాయి.

అమెరికా యొక్క సంగీత దేవాలయం మరియు అనేక మంది గొప్ప గాయకులు మరియు సంగీతకారుల విజయాల దృశ్యం అయిన కార్నెగీ హాల్‌లో జరిగిన ఈ అనుభవం ఆత్మ సంగీతం యొక్క విశ్వజనీన స్వభావానికి మరియు తూర్పు దేశపు కీర్తనల గురించి సాధన లేకపోయినా పాశ్చాత్యులకు ఉన్న అవగాహనకు ఒక చక్కని నివాళి.

ఆ సాయంత్రం నుండి నేను ఈ కీర్తనలను పాశ్చాత్య మరియు తూర్పు ప్రేక్షకులతో కలసి వేల సార్లు గానం చేశాను మరియు భగవంతుని పవిత్ర నామాన్ని ప్రేమతో గానం చేసే భక్తులపై దివ్య వరాలు వర్షంలా కురవడం చూశాను.

లాస్ ఏంజిలిస్, కాలిఫోర్నియా
4 డిసెంబర్, 1938
పరమహంస యోగానందగారి పుస్తకం ‘వర్డ్స్ ఆఫ్ కాస్మిక్ చాంట్స్ (Words of Cosmic Chants)’ నుండి సంగ్రహించబడింది

para-ornament

మరిన్ని విషయాల కోసం:

ఇతరులతో షేర్ చేయండి