ఒక ప్రపంచ కార్యం యొక్క ప్రారంభం

యోగానందగారి గదికి ప్రవేశ ద్వారం ఉన్న ప్రధాన భవనం.యోగ శిక్షణ మరియు ఆధ్యాత్మిక ఆదర్శాలతో కూడిన ఆధునిక విద్యావిధానాలుగల “జీవించడం ఎలా” అనే బాలుల పాఠశాలను ప్రారంభించడంతో యోగానందగారు తన జీవిత కార్యాన్ని1917లో ప్రారంభించారు. రాంచీలో (కలకత్తా నుండి సుమారు 250 మైళ్ళ దూరం) ఉన్న తన వేసవి విడిది రాజభవనాన్ని కాసిమ్ బజార్ మహారాజుగారు విద్యాలయం కొరకు అందించారు. కొన్ని సంవత్సరాల తరువాత మహాత్మాగాంధీ విద్యాలయాన్ని సందర్శించి ఇలా రాశారు: “ఈ సంస్థ నా మనసును గాఢంగా ఆకట్టుకుంది.”

ఓడలో తలపాగా ధరించిన పరమహంస యోగానందగారు.1920లో ఒక రోజు, రాంచీ విద్యాలయంలో ధ్యానం చేసుకుంటుండగా, యోగానందగారికి, పాశ్చాత్య దేశాల్లో తన కార్యాన్ని మొదలు పెట్టడానికి ఇప్పుడే తగిన సమయమనే ఒక అంతర్దర్శనం కలిగింది. ఆయన వెంటనే కలకత్తాకు బయల్దేరారు. అక్కడ మరుసటి రోజు ఆయనకు బోస్టన్ లో తరువాతి సంవత్సరంలో జరుగబోయే మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభకు భారతదేశం నుండి ప్రతినిధిగా రమ్మని కోరుతూ ఆహ్వానం వచ్చింది. శ్రీయుక్తేశ్వర్ గారు ఇలా చెబుతూ ఇదే సరైన సమయమని నిర్ధారించారు: “నీ కోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. వెడితే ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మరిలేదు.”

బయలుదేరే కొద్ది కాలం ముందు యోగానందగారిని, ఈ యుగంలో ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని పునరుద్ధరించిన, మరణంలేని మహాత్ములయిన మహావతార్ బాబాజీ కలుసుకున్నారు. యోగానందగారితో బాబాజీ ఇలా చెప్పారు, “పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే. చాలా కాలం క్రిందట కుంభమేళాలో నీ గురువైన యుక్తేశ్వర్ ని కలిశాను. నిన్ను ఆయన దగ్గరకు శిక్షణ కోసం పంపుతానని ఆయనకు చెప్పాను. దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం, చివరికి అన్ని దేశాలకీ వ్యాపించి, అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా, దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది.”

యోగానందగారు బోస్టన్ అంతర్జాతీయ కాంగ్రెస్ ఆఫ్ రిలిజియస్ లిబరల్స్.ఆ యువ స్వామి 1920లో బోస్టన్ నగరం చేరుకున్నారు. మత ధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభలో “మత శాస్త్రం” అనే విషయం మీద, ఆయన ఇచ్చిన మొదటి ఉపన్యాసం ఉత్సాహభరితమైన మన్ననలు పొందింది. అదే సంవత్సరంలో ఆయన భారతదేశ ప్రాచీన విజ్ఞానాన్ని మరియు యోగ తత్వశాస్త్రాన్ని మరియు ధ్యానం యొక్క కాలానుగుణమైన సంప్రదాయం గురించి తన బోధనలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చెయ్యడానికి సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించారు. ఎస్.ఆర్.ఎఫ్. యొక్క మొదటి ధ్యాన కేంద్రాన్ని యావజ్జీవిత భక్తులుగా మారబోతున్న డాక్టర్ మరియు మిస్సెస్ ఎం. డబల్యు. లూయిస్ మరియు మిస్సెస్ ఎలిస్ హేసీ (సిస్టర్ యోగమాత) బోస్టన్ లో ప్రారంభించారు

లాస్ ఏంజిల్స్‌లోని మౌంట్ వాషింగ్టన్‌లో యోగానంద తన విద్యార్థులతో కలిసి.

ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు, ఆయన తూర్పుతీరంలో శిక్షణ మరియు ఉపన్యాసాలు ఇచ్చారు; ఇక 1924లో ఖండాంతర ఉపన్యాస పర్యాటనకు బయలుదేరారు. 1925 తొలి రోజుల్లో ఆయన లాస్ ఏంజిలిస్ కు చేరి, అక్కడ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయమును మౌంట్ వాషింగ్టన్ పైన స్థాపించారు. ప్రబలమవుతున్న ఆయన ఆధ్యాత్మిక మరియు పరిపాలనా కార్యాలకు, అది కీలక కేంద్రంగా నిలిచింది.

ఇతరులతో షేర్ చేయండి