శ్రీ దయామాత: జ్ఞాపకార్థం
(జనవరి 31,1914 – నవంబరు 30 2010)
అత్యంత ప్రేమమూర్తి మరియు గౌరవస్పదులైన మన ప్రియతమ సంఘమాత మరియు అధ్యక్షురాలు శ్రీ దయామాత నవంబరు 30, 2010న (డిసెంబరు 1, 2010 ఐ.ఎస్.టి.), తన మర్త్యదేహాన్ని విడిచిపెట్టారన్న వార్తను మీతో పంచుకుంటున్నాము. ఆమె సాంగత్యంలో తరించిన వేలాది మంది సభ్యులకు మరియు మిత్రులకు, గురుదేవుల భోదనలు మరియు జీవిత మార్గదర్శకాలను మూర్తీభవించిన ఆమె యొక్క భేషరతు ప్రేమ ప్రపంచ వ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంలోని ప్రతీ ఒక్కరి జీవితాలను ఆశీర్వదిస్తుంది.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోర్డు డైరెక్టర్ల నుండి ఒక ప్రత్యేక సందేశం
డిసెంబరు 2, 2010
ప్రియతములారా,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కు, సంఘమాత మరియు అధ్యక్షురాలు అయిన, మన ప్రియమైన దయామాత, డిసెంబరు 1, 2010న తన మానవ దేహాన్ని ప్రశాంతంగా విడిచారు. దివ్య కాంతి మరియు ప్రేమతో ప్రకాశవంతమైన ఆమె జీవితము ఇప్పుడు సర్వవ్యాప్తమైన ఆయన ప్రేమైక మహాసముద్రంలో కలిసింది. ఇన్ని సంవత్సరాలు తనను మనతో ఉంచడానికి మరియు ఈ లోకానికి తన తల్లిలాంటి ప్రేమ మరియు దయా గుణంతో ఆశీర్వదించుటకు అనుమతించినందుకు మనము జగన్మాతకు ఎంతో ఋణపడి ఉన్నాము, ఆ దీవెనలు మన అందరి జీవితాలను స్పృశించాయి. మన మనసులు ఇంకా ఆమె మనతోనే కలిసి ఉండాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఈ భువన పరిధి ఆవల ఆమెకు లభించిన దివ్య స్వాగతం యొక్క స్వర్గానందాన్ని మన దుఃఖంతో తగ్గించం, లేదా గురుదేవులు శ్రీ పరమహంస యోగానందుల వారు ఆమె భుజాలపైన మోపిన ఆధ్యాత్మిక బాధ్యతలను ఎంతో ఘనంగా, ధైర్యంగా, పరిపూర్ణంగా నెరవేర్చినందుకు ఆమె అనుభవించిన ఆత్మానందాన్ని మించిన ఊహకందని పరమానందాన్ని పొందినందుకు అసూయపడం.
పదిహేడు సంవత్సరాల వయసులో ఆశ్రమానికి వచ్చి మొదటి నుండీ బిడియపడే ఆ అమ్మాయిలో గురువుగారు తన పూర్తి విశ్వాసాన్ని ఉంచగలిగే శిష్యురాలిని – అన్నిoటి కన్నా మించి ఆ భగవంతుడినే కోరుకునే ఓ నిజమైన భక్తురాలు, ఆయన కార్యాచరణ యొక్క “భావి బీజం”, మరియు ఆధ్యాత్మిక మార్గంలో లెక్కలేని ఆత్మలకు అమ్మగా అవుతుందని చూశారు. ఆమెలోని హృదయపూర్వక గ్రాహ్యత ద్వారా ఆమె జీవితాన్ని ఆవిష్కరింపచేశారు. దేవుడిపై పూర్తి విశ్వాసంతో, మరియు గురుదేవుల కోరిక నెరవేర్చే ఏకైక లక్ష్యంతో, రాబోయే ముందు ముందు సంవత్సరాలలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కోవటానికి ఆమెకు సహాయపడే ఆధ్యాత్మిక బలాన్ని ఆమెలో నింపారు. ఇన్ని సంవత్సరాలుగా, ఆమె తూర్పు మరియు పడమర దేశాలలో, గురుదేవుల ప్రేరణతో మరియు ఆత్మానుసంధానంతో దిశా నిర్దేశనం మరియు గురుదేవుల కార్యాచరణకు దృఢ పునాది వేశారు. ఆయన జ్ఞాన వాక్కులను జాగ్రత్తగా నమోదు చేసి ఆయన స్వచ్ఛ, పవిత్ర బోధనలను తమ సంకల్పంతో రాబోయే తరాల భక్తులందరికీ సుస్థిరంగా పదిలపరచారు.
గురుదేవుల స్ఫూర్తి ద్వారా మరియు గురుదేవుల భోదనలను మనసా వాచా జీవించడం ద్వారా, దేవుడు తప్ప మరేమీ తెలియనంతగా మీరు దేవుని ప్రేమలో మీరు పూర్తిగా మునిగిపొండి మరియు ఆ ప్రేమను అందరికీ పంచండి అని మన ప్రియతమ దయామాతగారు, దేవుని కోసం మన హృదయాలు పరితపించేలా లోతైన ఆసక్తిని కలిగించారు. ఆ ఆనంద చైతన్యంలోనే ఆమె దేవుని బిడ్డలందరి గురుంచీ తపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాత్మలందరూ తమ గాఢానుభూతులను, గౌరవాన్ని ఆమె పై కురిపించారు మరియు జగన్మాత మృదు ప్రేమతో ఆమె వారందరినీ తన తలపులలోనూ మరియు ప్రార్థనలలోనూ నిలుపుకున్నారు. ఆమె తన ఎల్లలు లేని ప్రేమ హృదయం ఎంతోమందిలో మొట్ట మొదటిసారిగా షరతులెరగని ప్రేమానుభూతిని చవిచూపింది. ఎపుడూ సేవ తత్పరతతో “ఈ ఆత్మకు ఎలా సేవ చేయగలను?” అన్న ఆలోచన తప్ప ఆమె తన గురించి ఎన్నడూ ఆలోచించలేదు.
ఆమె యొక్క జీవిత స్వరూపం మొత్తం ప్రేమ ఒక్కటే మరియు ఆ ప్రేమకు మా ఆత్మలు అమితముగా స్పందించాయి. ఆశీఃపూర్వక బహుమతైన ఆమె జీవితానికి భగవంతునికి మరియు గురుదేవులకు భక్తిపారవశ్యమైన కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాము. మనలోని ప్రతీ ఒక్కరికీ ఆమె అందించిన మన పూజ్య గురుదేవుల బోధనలు మరియు ఈ జీవనశైలికి, మన ప్రార్థనలతో ఆమె ఆత్మగమన దారిలో కృతజ్ఞతా కుసుమాలను వెదచల్లాడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆమె మనలో నింపిన దివ్యోత్సాహంతో, నిర్భయంగా ముందకు సాగుతూ నిస్వార్థంగా భగవంతున్ని ప్రేమిస్తూ, మరియు ప్రతీ ఒక్కరిని ఆయనలోని భాగంగా ప్రేమిస్తూ దివ్య ప్రేమతో ఆమె జీవిత ఉదాహరణను ఆచరించే సంకల్పంతో మన ప్రియతమ అమ్మకు నివాళులు అర్పిద్దాం. మన స్వచ్ఛమైన ప్రేమ అనే అదృశ్య బంధాలతో ఆ దేవుని అనంత ఆనందంలో తిరిగి కలుసుకునేవరకు ఆమెను మన హృదయంతరాల్లో నిలుపుకుందాం.
దైవ స్నేహములో మీ,
శ్రీ శ్రీ మృణాళినీమాత
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. బోర్డు డైరెక్టర్ల కొరకు
మన ప్రియతమ శ్రీ దయామాతగారి గౌరవార్ధం డిసెంబరు 5, 2010 లేదా డిసెంబరు 12, 2010న స్మృత్యర్థ కార్యక్రమాలు భారతదేశంలోని అన్నీ వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో, ధ్యాన కేంద్రాలలో మరియు మండలిలలో నిర్వహింపబడతాయి.
మరింత సమాచారం కొరకు దయచేసి మీ స్థానిక ఆశ్రమం, కేంద్ర లేదా మండలిలను సంప్రదించండి. మా సెంటర్ల ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ ఐడిలు మరియు చిరునామాలు మా వెబ్ సైట్ లో ఇక్కడ లభిస్తాయి.