శ్రీ శ్రీ మృణాళినీమాత నుండి ఒక నూతన సంవత్సర సందేశం
నూతన సంవత్సరం 2014
“మిమ్మల్ని మీరు మార్చుకోవాలని మనస్సులో నిశ్చయించుకోండి, మరియు మీరు ఆశించిన రీతిలో మీ గమ్యాన్ని మార్చుకోవచ్చు.”
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
మనం కొత్త సంవత్సరానికి స్వాగతిస్తున్నప్పుడు, గురుదేవులు శ్రీ పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మనమందరం ప్రత్యేకంగా మన ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబాన్ని స్మరించుకుంటాం, మీ జీవితాలను ఆంతరంగిక శాంతి మరియు సంతోషాలతో పాటు మరియు మీ విలువైన లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో విజయం పొందేలా దీవించాలని మేము ప్రార్థిస్తాము. క్రిస్మస్ కాలంలో మీ ప్రేమపూర్వక ఆలోచనలకు, పుణ్య దిన శుభాకాంక్షలకు, జ్ఞాపకాలకు మరియు గత సంవత్సరంలో మీరు చేసిన అనేక కరుణాపూరిత కార్యాలకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భగవంతుడు మరియు గురుదేవుల యొక్క ఆదర్శాలు మరియు వారి శాశ్వతమైన ప్రేమలో మనలను కలిపే దివ్య స్నేహాన్ని మన హృదయాలలో ఎల్లప్పుడూ పెన్నిధిగా ఉంచుకుందాము.
ఈ సంవత్సరం జనవరి 31, మన ప్రియతమ శ్రీ దయామాత శతజయంతి వార్షికోత్సవంగా నిలుస్తుంది. ఆమె దివ్య జీవితం మనందరినీ స్పృశించింది, మరియు ఆమె ఆత్మ ఈ ప్రపంచానికి అతీతంగా కాంతి మరియు ఆనందం యొక్క ఆహ్లాదకరమైన రాజ్యంలో స్వేచ్ఛగా ఉన్నప్పటికీ, తూర్పు మరియు పడమటి దేశాల్లో ఉన్న గురుదేవుల ఆధ్యాత్మిక కుటుంబంపై ఆమె కురిపించిన ప్రేమ మరియు శ్రద్ధ ఇప్పటికీ మనతోనే ఉంది. “ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు” అనే గురుదేవుల మాటలు ఆమెలో పూర్తిగా వ్యక్తీకరించబడ్డాయి మరియు ఆమె అందమైన ఉదాహరణ ద్వారా మన చైతన్యంలో ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రేమ మరియు ఆమె సానుకూల స్ఫూర్తి మరియు దేవునిపై విశ్వాసం, ఈ కొత్త సంవత్సరంలోనే కాక ఎల్లప్పుడూ మీకు స్ఫూర్తినిచ్చుగాక.
ప్రతి సంవత్సర ప్రారంభం మన జీవితాల్లో కొత్త ప్రారంభం యొక్క ఆశీస్సులను అందిస్తుంది, మన గొప్ప ఆకాంక్షలను పునరుద్ధరించడానికి మరియు వాటిని కార్యరూపం దాల్చడానికి మన సంకల్పానికి శక్తినిచ్చే అవకాశాన్ని అందిస్తుంది. ఇది గత అనుభవాలు మరియు కార్యాచరణను మించి చూడటం ద్వారా మన దృక్పథాన్ని విస్తరింపజేయడానికి, భవిష్యత్తులో ఉన్న సామర్థ్యాలను అన్వేషించడానికి పునరుద్ధరించబడిన అభిరుచితో మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ భవిష్యత్తును ఆనందంగా, నిర్భయంగా, సానుకూల అంచనాలతో ఎదుర్కొనే అంతర్గత భద్రత, ఆయన స్వరూపంలోనే మనల్ని సృష్టించిన భగవంతునితో మన జీవితాలను అనుసంధానం చేయడం ద్వారా వస్తుంది. గురుదేవులు మాతో ఇలా అన్నారు, “మనలో ప్రతి ఒక్కరు భగవంతుని బిడ్డ. మనం ఆయన ఆత్మ నుండి, దాని స్వచ్ఛత మరియు కీర్తి మరియు ఆనందంతో జన్మించాము. ఆ వారసత్వం తిరుగులేనిది.” మన మనస్సును, సంకల్పాన్ని శాసించే స్వేచ్ఛను ప్రసాదించి, మనం బలహీనమైన మానవులం కాదనే దృఢ నిశ్చయంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినట్లయితే, ఎంచుకునే సామర్థ్యాన్ని వివేకంతో అలవర్చుకుంటూ పట్టుదలతో ఉంటే, ఏ అలవాటు లేదా పరిస్థితులు మన మార్గంలో నిలబడటం సాధ్యం కాదు. మన సామర్థ్యాలను విస్తరించే లేదా మన అవగాహనను సవాలు చేసే పరిస్థితులు కూడా మన మనసులో లోతుగా త్రవ్వడానికి మరియు మన ఆత్మ యొక్క పూర్తి శక్తిని విడుదల చేయడానికి అవసరమైన వాటిని మనకు అందజేస్తాయని మనం కనుగొంటాము.
ధ్యానంలో మనం భగవంతుని సాన్నిధ్యాన్ని గ్రహించినప్పుడు, మన చైతన్యం మరింత సున్నితంగా మారుతుంది, ఆయన కాంతి మరియు అనుగ్రహం అనవసరమైన కార్య ప్రణాళికలను కరిగించేలా చేస్తుంది. మనం ఎక్కువగా ఆయన ఆలోచనలో జీవిస్తున్నప్పుడు, ఆ అనంతమైన మూలం నుండి మనకు ఆనందం మరియు శక్తి ప్రవహిస్తుంది మరియు గురుదేవుల మాటలను మనం ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోగలము, “దేవుని అపరిమితమైన స్వభావంతో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటే, దేవుడు ఏదైనా చేయగలడు, అలాగే మీరు కూడా చేయగలరు.” మీ విశ్వాసం మరియు సంకల్పం ద్వారా, మీరు ఆ సత్యాన్ని గ్రహించగలరు మరియు మీ స్వంత విజయవంతమైన జీవితం ద్వారా ఇతరులను ప్రోత్సహించగలరు.
మీకు మరియు మీ ప్రియమైన వారికి భగవంతుని ఆశీస్సులతో నిండిన కొత్త సంవత్సర శుభాకాంక్షలు,

శ్రీ శ్రీ మృణాళినీమాత
కాపీరైట్ © 2013 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.