శ్రీ ఆనందమాత స్మృతులు

శ్రీ ఆనందమాత (1915–2005)

శ్రీ పరమహంస యోగానందగారి తొలి శిష్యులలోను మరియు సన్నిహిత శిష్యులలోను ఒకరు మరియు మన దివంగత అధ్యక్షురాలు శ్రీ దయామాత సోదరియైన ఆనందమాత, 2005, ఫిబ్రవరి 5న తన భౌతిక రూపాన్ని విడిచిపెట్టారు. ఆమె అనేక దశాబ్దాలపాటు శ్రీ పరమహంసగారికి, ఆయన కార్యాల నిమిత్తం సేవ చేసినప్పటికీ, ఆమె ఒక బహిరంగ వక్తగా లేదా బోధకురాలిగా కాకుండా “తెరవెనుక” పాత్రను ఎంచుకున్నారు. కాబట్టి పరమహంసగారి గురించిన స్మృతులను ఆమె మాటల్లోనే కాకుండా ఇతరులు చెప్పినట్లుగా ఆమె జీవితానికి సంబంధించిన ఈ వృత్తాంతాన్ని చేర్చుతున్నాము.

పరమహంసగారు తన ప్రపంచవ్యాప్త భోదనకు, సంస్థ యొక్క పునాదులు ఏర్పర్చడంలో సహాయపడటానికి మరియు దాని భవిష్యత్ విస్తరణ కొరకు తాను ఏర్పాటు చేసిన వివరణాత్మక పథకాన్ని అమలు చేయడానికి వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చి, ఎంపిక చేసిన భక్తులలో ఆనందమాత ఒకరు. ఆమె లూసీ వర్జీనియా రైట్ గా 1915 అక్టోబరు 7న జన్మించింది. 1931లో మొదటిసారి గురుదేవులను కలుసుకొని, 1933లో ఆయన ఆశ్రమంలో ప్రవేశించిన నాటి నుండి ఆమె పరమహంసగారి బోధనలను ఆకళింపు చేసుకొని, జీవించడం ద్వారా మరియు ఆయన పవిత్ర లక్ష్యసాధనకు నిస్సంకోచంగా సేవ చేయడం ద్వారా భగవంతుని ప్రేమకు, సేవకు సంపూర్ణముగా అర్పితమయ్యారు. ఆయన వద్ద సన్యాస దీక్షను తీసుకొని ప్రాచీన సన్యాస స్వాముల సంప్రదాయాన్ని స్వీకరించిన అతి కొద్ది మంది తొలి శిష్యులలో ఆమె కూడా ఒకరు. తన యావజ్జీవిత సన్యాస అంతిమ ప్రతిజ్ఞలను 1935లో తీసుకొన్నారు. గురుదేవులు ఆమెను సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ల బోర్డు సభ్యురాలిగా కూడా నియమించారు.

ఫిబ్రవరి 11, 2005న అన్ని ఆశ్రమ కేంద్రాల నుండి వచ్చిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసులు మరియు సన్యాసినులు హాజరైన ఒక సంస్మరణ సేవను మదర్ సెంటర్లో నిర్వహించారు. స్వామి విశ్వానంద అధిరోహణ కార్యక్రమ విధులను నిర్వహించారు; ప్రధాన వక్తలు శ్రీ దయామాత, మృణాళినీమాత, మరియు బ్రదర్ ఆనందమోయ్. భగవంతునికి మరియు గురుదేవులకు బేషరతుగా అంకితమైన ఆనందమాత యొక్క పావన జీవితానికి వారు సమర్పించిన నివాళుల నుండి కొన్ని ముఖ్యాంశాలు.

శ్రీ స్వామి ఆనందమోయ్:

ఒకసారి నేను గురుదేవులతో కలిసి బేస్‌మెంట్‌లోని ఎలివేటర్ నుండి ఆయన కారు వరకు నడవడం గుర్తుంది. ఆనందమాత గురుదేవుల కోసం ఎదురుచూస్తున్నారు; సాధారణంగా గురుదేవుల కారును ఆమే నడిపేవారు. మేము నడుస్తున్నప్పుడు, గురుదేవులు నా చేయి పట్టుకొని, నిశ్చలంగా నిలబడి ఇలా అన్నారు: “ఎప్పుడూ గుర్తుంచుకో: ఫే మరియు వర్జీనియా ఎల్లప్పుడూ నూరు శాతం భక్తి, నూరు శాతం విధేయత, నూరు శాతం వినయంతో జీవిస్తున్నారు. నీవు వారిని అనుసరించాలనుకుంటున్నాను.” అలా చెప్పి, నేను గుర్తు పెట్టుకొనేలా, గురుదేవులు నా చేతిని నొక్కారు. నేను ఆశ్రమానికి వచ్చిన క్రొత్తలో ఇది జరిగింది.

కొన్ని స౦వత్సరాల తర్వాత, ఆయన దాదాపుగా అవే మాటలను మళ్ళీ చెప్పారు. అయితే అప్పటికి నాకు గురుదేవుల గురించీ, ఆయన పని గురించీ, ఆధ్యాత్మిక జీవితం గురించీ కొంచెం మెరుగైన అవగాహన కలిగింది. నేను ఇలా అనుకున్నాను: “గురుదేవులు ఒక అవతారమూర్తి, భగవంతుడి అవతారం; మరి ఈ మాటలు, ఎంత సరళమైనవైనా, శిష్యుడికి అవే అంతిమ ప్రశంస. గురుదేవులు చెప్పిన దానికంటే గొప్ప ప్రశంస మరొకటి లేదు.”

ఆనందమాత గురించి మరొక చిన్న కథ: ఇది 1951 ప్రాంతంలో జరిగింది. గురుదేవుల స్నానపు గది గోడలకు సున్నము వేయడానికి నన్ను నియమించారు. నేను ఆరుబయట సున్నము కలిపాను, ఆపై దానిని రెండు బకెట్లలో మూడవ అంతస్తు వరకు ఎలివేటర్‌లో తీసుకువెళ్ళాను. అవి చాలా బరువుగా ఉన్నాయి. నేను ఆ బక్కెట్లను హాలు గుండా తీసుకెళ్తుండగా—వాటి వైరు హ్యాండిల్స్ వల్ల నా చేతులు గాయమయ్యాయి—నా చేతులకు కొంచెం విశ్రాంతి ఇవ్వడానికి కొన్ని క్షణాలు వాటిని క్రింద పెట్టాను. ఆ సమయంలో దగ్గర్లో ఫోన్ మోగింది. దానికి జవాబివ్వడానికి ఆనందమాత ఆఫీసు నుంచి బయటకు వచ్చారు.

ఇలా, నేను దర్శనానుభూతులకు లేదా అతీంద్రియ అనుభవాలకు మొగ్గుచూపే వ్యక్తిని కాదు. అలాంటి వాటిపై నాకు ఎప్పుడూ ఆసక్తి లేదు. కానీ నేను ఆనందమాత టెలిఫోన్‌ను తీయడం చూసినప్పుడు, ఎంతో ఆశ్చర్యకరంగా నాకు ఆమె చుట్టూ వెలుతురు కనిపించింది—సంపూర్ణమైన కాంతి గోళం. అది ప్రకాశవ౦త౦గా, మరింత ప్రకాశవ౦త౦గా మారింది, “ఏమి జరుగుతో౦ది?” అని నేను అనుకున్నాను. ఆనందమాత రూపం మారిపోవడాన్ని అప్పుడు నేను చూశాను. ఆమె అత్యంత అందమైన దివ్యమూర్తిగా మారింది. నేను చూస్తున్నదాన్ని నమ్మలేకపోయాను. ఇది కేవలం ఒక క్షణకాలపు మెరుపులా కాదు; చాలా నిమిషాలు పాటు కొనసాగింది. ఆ తర్వాత క్రమక్రమంగా వెలుతురు మసకబారి, ఆ దివ్యమూర్తి మరోసారి ఆనందమాతగా మారిపోయారు, ఫోన్ పెట్టేసి తిరిగి ఆఫీసులోకి ఆవిడ వెళ్ళిపోయారు.

కొన్నేళ్ల తర్వాత, నేను శ్రీకృష్ణుని గురి౦చిన ఒక గ్ర౦థాన్ని చదివాను, భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు, ఆ అవతారానికి సేవ చేయడం కోసం కొందరు దైవాంశ సంభూతులు ఎప్పుడూ వస్తారని చెప్పబడింది. మరియు గత కాలపు గొప్ప ఋషులు, మునులు కృష్ణుడికి సహచరులుగా అవతరించారని చెప్పబడింది; కృష్ణుడు బాలుడిగా బృందావనంలో పెరిగినప్పుడు ఆయనతో కలిసి ఆడుకున్న గోపికలు లేదా గోప బాలురలో వీరున్నారు. గురుదేవుల గొప్ప శిష్యులలోని దయామాత, ఆనందమాతతో కొంతమంది తమ స్వంత కర్మను నివృత్తి చేసుకోవడానికి కాక, మన గురుదేవుల దివ్య అవతార సమయంలో భగవంతుణ్ణి సేవించడానికి వచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను.

ఆనందమాత చాలా స౦వత్సరాలపాటు నమ్మక౦గా, అవిశ్రాంత౦గా, ఎక్కువసార్లు రేయింబవళ్ళు, పనిచేస్తూ అలుపెరగని సేవ చేశారు. అయితే కొన్నిసార్లు ఆమె ఎంత నిష్కర్షగా ఉండేవారో మాలో చాలా మందికి తెలుసు! కానీ ఆమె జీవితపు చివరి కాలంలో, ఆమె అనారోగ్యానికి గురై, ఇక ఏమాత్రం పని చేయలేకపోయినప్పుడు—ఆమె మనస్సు సంస్థ యొక్క సంరక్షణ, ఇబ్బందులు, సమస్యలపట్ల నిమగ్నమై లేనపుడు—ఆమె వ్యక్తిత్వంలో ఒక క్రొత్త కోణం వ్యక్తమైంది: చాలా మధురమైనది, చాలా ప్రేమపూర్వకమైనది. ఆమెను నేను కలసినప్పుడల్లా, ఆమె నా దగ్గరకు వచ్చి నా రెండు చేతులూ పట్టుకునేవారు—ఒక్క మాట కూడా చెప్పేవారు కాదు—కేవలం ప్రేమ, ప్రేమను మాత్రమే ప్రసరించేవారు.

ఆ తర్వాత, ఆమె శారీరక స్థితి అ౦తక౦తకూ దిగజారిపోతో౦దని విన్నప్పుడు, వీడ్కోలు చెప్పడానికి ఆమె గదికి రమ్మని నన్ను ఆహ్వాని౦చారు. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కాని ఆమె తన కళ్ళతో మరియు తన చేతులతో మాట్లాడారు. ఆమె నా రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకొని, నా వైపు ప్రేమతో, పరిపూర్ణమైన ప్రేమతో చూశారు. అదొక నమ్మశక్యం కాని అనుభవం. ఆ తర్వాత, ఆమె గురుదేవులను ఎ౦తగా ప్రేమి౦చేవారో తెలుసుకొని ఇలా అన్నాను, “గురుదేవులు మీ కోస౦ ఎదురు చూస్తున్నారు,” దానికి ప్రతిస్పందనగా “నేను మళ్ళీ గురుదేవులతో ఉ౦డబోతున్నాను” అని ఆమె వ్యక్త౦ చేస్తున్నట్లుగా అనిపించింది—ఆ ప్రతిస్ప౦దనతో నేను అపారమైన ప్రేమ, ఆనందాల్ని అనుభవించాను. నా అనుభూతిని వ్యక్తపరచలేను, మహత్కరమైన ప్రేమ మరియు ఆనందాలు. నేను ఇలా అనుకున్నాను, “భగవంతుడికి, గురువుకు యావజ్జీవతం సేవలందించి, తనను తాను అంకితం చేసుకున్న అద్భుతమైన ఉదాహరణ, ఇప్పుడు అది ముగిసింది; ‘నేను ఇంటికి వెళుతున్నాను’ అని ఆమె చెప్పగలరు.” మరియు నేను ఇలా అనుకున్నాను: “నేను కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను!”

ఆనందమాత గురించి నా స్మృతులు ఇవే: అటువంటి గొప్ప శిష్యురాలు, తన గురువుతో కలిసి ఉండటానికి, ఆయనను సేవించడానికి భూలోకానికి వచ్చిన దివ్యాత్మ. నేను జీవించి ఉన్నంత కాలం నా హృదయంలో నిలుపుకొనే చిత్రం ఆమెది. గురుదేవులు అన్నట్లు, భగవంతునిపట్ల, గురువుపట్ల—సంపూర్ణ అంకితభావం—మరియు ప్రేమ. అదే ఆమె మిగిల్చిన ఉదాహరణ.

శ్రీ మృణాళినీమాత:

అరవై సంవత్సరాలపాటు పూజ్యమాత మరియు ఆనందమాతల సాంగత్యంలో ఉన్నందుకు నేను దీవించబడ్డాను; ము౦దటి రోజుల్లో గురుదేవులు వారిని ‌ఫే, వర్జీనియాగా ప్రస్తావి౦చేవారు: “రె౦డు బఠాణీలు-ఒక (బఠాణి)కాయలో.” ఒకటి లేకుండా మరొక దాని గురించి మీరు ఊహించలేరు.

నేను ఆశ్రమంలోకి ప్రవేశించడానికి ముందే ప్రియమైన ఆనందమాతతో నాకు పరిచయం ఏర్పడింది. నేను స్కూలులో చదువుతున్నప్పుడే వారాంతాల్లో ఎన్సినీటస్ ఆశ్రమానికి రమ్మని నన్ను గురుదేవులు ఆహ్వానించేవారు. నేను మొదటిసారి స౦దర్శించినప్పుడు, శనివార౦నాడు ఆశ్రమాన్ని శుభ్ర౦ చేయడ౦లో నేను సహాయ౦ చేస్తున్నాను, విశ్రాంతి గదిలో సున్నితంగా చెక్కబడిన ఏనుగు బల్లకున్న దుమ్ము దులిపాను. అప్పుడు గురుదేవులు హాలులోకి వచ్చి, అక్కడ ఒక క్షణం నిలబడి, చూస్తున్నారు. ఆప్పుడు నాతో ఆయన ఇలా అన్నారు: “నీవు దీన్ని చాలా బాగా చేస్తే మంచిది. వర్జీనియా చాలా ఖచ్చితమైనది!”

సరే, గురుదేవుల ఉపన్యాసం ఆదివారంనాడు వినడానికి మా కుటుంబం వెళ్ళినప్పుడు, శాన్ డియాగోలోని ఆలయ సేవల నాటి నుండి నాకు దయామాత, ఆనందమాతలు తెలుసు. గురుదేవులు వేదికనెక్కి మాట్లాడటానికి సిద్ధమైన వెంటనే ఈ శిష్యులిద్దరూ మందిరంలో మెట్లు దిగి వచ్చేవారు. మేము వాళ్ళను చూస్తుండేవాళ్ళం; యువ భక్తులలో ఒకరు ఇలా అన్నారు, దానికి మేమంతా అంగీకరించాము: “మీకు తెలుసా, వారు ఆ మెట్లు దిగుతునప్పుడు, వారు నడవరు, తేలుతుంటారు!” స్వామి ఆనందమోయ్ వ్యక్త౦ చేసినట్లే, మా మనస్సుల్లో, గురుదేవుల చుట్టూ ఉన్న వారంతా దేవదూతలు.

కాబట్టి అదే ప్రతిబింబం నా మదిలో అలా ఉండిపోయింది, మరియు నేను ఆ బల్లను శుభ్రపరుస్తున్నప్పుడు ఒక దేవతను సంతోషపెట్టడానికి వీలైనంత బాగా శుభ్రం చేయడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని! గురుదేవులు వెళ్ళిన కొద్దిసేపటికే, మాతాజీ1 అతిథులు కూర్చునే గది లోనికి వచ్చారు. నేను పనిచేస్తున్న చోటికి ఆమె వచ్చి అక్కడ కాసేపు నిలబడ్డారు. ప్రతి చిన్న సందు మధ్య ధూళిని గుడ్డతో లాగుతూ పని చేస్తూండగా ఆమె నన్ను గమనించసాగారు. కాసేపటి తర్వాత ఆమె నా తలపై తట్టి, “చాలా బాగుంది, ప్రియతమా; చాలా బాగుంది!” అన్నారు. మరియు నేను అనుకున్నాను, ఓహ్, నేను పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యాను!

కానీ ఆనందమాతంటే అదే. ఆమె చాలా సమగ్రమైనవారు, ఎందుకంటే గురుదేవులకు చేసే సేవ అంతా, భగవత్ సేవగా ఆమె భావించేవారు. నేను ఆశ్రమంలో చేరే సమయానికి, గురుదేవుల వసతులను మరియు ఈ ప్రపంచంలో ఒక అవతారమూర్తి ఉండటానికి, పనిచేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెకుండేది. ఆమె తన బాధ్యతలను ఎవరూ గమనించకుండా, స్థిమితముగా ఇంకా చాలా క్షుణ్ణంగా నిర్వహించేవారు. ఆమె కొన్నిసార్లు గురుదేవుల కోసం వంట చేసేవారు; ఎవరైన విశిష్ట భారతీయ అతిథి వచ్చినప్పుడు, గురుదేవులు ఆమెకు రసగుల్లాలు అనే భారతీయ మిఠాయి తయారు చేయమనేవారు. ఆయన తరచూ ఇలా అనేవారు “భారతదేశంలో ఎవరూ వాటిని ఇంత బాగా చేయలేరు!”

గురుదేవులకు సేవ చేయడం ద్వారా ఆమె జీవితమంతా గురు-భక్తి (గురువులో ఉన్న భగవంతుని పట్ల భక్తి) ని చూపేవారు. గురుదేవులు తన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా, ఆ గురు-భక్తి తగ్గలేదు. అది బుద్ధిపూర్వకమైనదా, లేక మన గురుదేవుల ఉపదేశాల వల్ల అది ఆమెకు స్వాభావికంగా వచ్చిందా అన్నది నేను చెప్పలేను. “నేను ఈ దేహంలో లేనప్పుడు, ఈ సంస్థే నా శరీరం అవుతుంది. మీరు నాకు సహాయ౦ చేసి, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ రూపానికి సేవచేసినట్లే, ఈ స౦స్థకు సేవచేయ౦డి”: దాన్ని ఏమాత్రం తప్పకుండా, ఆనందమాత సేవలను కొనసాగించారు. వివిధ రంగాలలో ఎక్కువగా, చాలా ఎక్కువ విధులను—ఎల్లవేళలా అంతే చురుకుగా, శ్రద్ధతో ఆమె బాధ్యతలు నిర్వర్తి౦చారు. గురుదేవుల యొక్క సంస్థాగత బాధ్యత దయామాత భుజాల మీద పడినప్పుడు, గురుదేవులతో ఉన్నట్లే—చిన్నదైనా, గొప్పదైనా అన్ని విధాలుగా సహాయం చేయడానికి ఆనందమాత అక్కడే ఉన్నారు.

మీరు ఒక పని నిమిత్తం కొన్ని అంశాల గురించి ఒక నివేదికను లేదా ప్రతిపాదనను మానస్ఫూర్తిగా అన్నీ వివరాలతో పూర్తి జాబితా సిద్ధం చేశారని భావించి, దానిని ఆనందమాత పరిశీలన కోసం పంపిస్తే దానికి ఆమె మరో పది అ౦శాలను జోడిస్తారు! కానీ అది ఆమె భక్తి. గురుదేవులు మాతో అన్నట్లు, “ఏదైనా చేయాల్సిన యోగ్యమైన పనిని, మరింత యోగ్యవంతంగా చేయాలి.” దీనిని ఆమె తన హృదయానికి తీసుకున్నారు. చేసిన ప్రతి పనిలోను, తన బాధ్యతలను నెరవేర్చడానికి ఆమె వెయ్యిశాతం పనిచేశారు. గురుదేవులు మనందరికీ ఇలా చేయమని నేర్పించారు, ఆమె దీనిలో నిశ్చయంగా రాణించారు.

ఆమె ఆ ప్రామాణికతని, ఉదాహరణకు గురుదేవులు నివసించిన, ఆయన ఉత్కృష్ట కార్యాచరణను ప్రారంభించిన, ఈ దివ్య నివాసాలను, పరిరక్షించడానికి వర్తింపజేశారు. మౌంట్ వాషింగ్టన్, ఎన్సినీటస్ ఆశ్రమం, హాలీవుడ్ ఆశ్రమం, లేక్ ష్రైన్—అవి అన్నీ చాలా సుందరంగా నిర్వహించబడతాయి, ఎందుకంటే వాటిని ఆమె తన కనుసన్నల్లో ఉంచుకొన్నారు. కేవల౦ “ఇవి మ౦చి భవంతులు కనుక వాటిని కాపాడుకోవాలి” అనే కాదు. ఎందుకంటే అవి గురుదేవునిలో భాగమయ్యాయి. అదే సంరక్షణను గురుదేవులు తోటలో నాటిన, ఆయన ప్రేమించిన, ప్రతి చిన్న పొదకు, చెట్టుకు విస్తరించారు; ఆమె వాటిని ఎంతో జాగ్రత్తగా సంరక్షించేవారు. ఆమె దృఢ నిశ్చయం మరియు అవిశ్రాంత ప్రయత్నం ఏమిటంటే: “ప్రకృతి వాటిని జీవించడానికి అనుమతించినంత కాలం, వాటిని సంరక్షించాలి,” ఎందుకంటే అవి గురుదేవునిలో భాగం.

ఈ నేప‌థ్యంతోనే ఆనందమాత తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించారని చాలాసార్లు చెప్పడం జరిగింది. అవును, ఆమె చాలా ప్రశాంతంగా ఉండేవారు. కాని 1981లో, భారతదేశంలో అనేక పరిపాలనా వ్యవహారాలు నిర్వహించాల్సి ఉన్నందున, దయామాత వెళ్ళలేకపోవడంతో ఆనందమాతను, నన్ను ఆమె పంపించారు. ఆ ప‌ర్య‌ట‌న సమయంలో ఆనందమాత శ‌రీరం అస్వ‌స్థ‌త‌కు గురికావడంతో వై.ఎస్.ఎస్. డైరెక్టర్లు తీవ్ర ఆందోళన చెందారు. కొంతకాలంపాటు విశ్రాంతి మరియు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను కలకత్తాలోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని నిశ్చయించారు, మరియు మేమంతా దాని గురించి ఎంతో మౌనం పాటించాం, తద్ద్వారా ఆమె ఏకాంతం మరియు విశ్రాంతిని పొందగలిగారు.

ప్రతి రోజూ మధ్యాహ్నం ఆశ్రమంలో సత్సంగాలు, సమావేశాలు జరిగిన తరువాత, ఆమెను చూడటానికి నేను ఆసుపత్రికి వెళ్ళేదాన్ని. ఒక రోజు, చాలా దగ్గరివారు మరియు సన్నిహిత సభ్యులలో కొంతమంది ఆమె ఎక్కడ ఉందో తెలుసుకొన్నారు; నేను ఆమె గదిలోకి ప్రవేశించినప్పుడు, ఆమె మంచం చుట్టూ భక్తుల సమూహం మొత్తం గుమిగూడింది. అక్కడ ఆమె లేచి కూర్చొని, వారికి అత్యంత మనోహరమైన సత్సంగాన్ని ఇస్తున్నారు! వారు తమ ఆధ్యాత్మిక సమస్యలకు ఆమె యొక్క సలహాను, సహాయాన్ని అడుగుతున్నారు, ఆమె ఎంతో అద్భుతమైన ఉపదేశాన్ని ఇస్తున్నారు. నేను గుమ్మంలో ఒక గంట పాటు వింటూ ఉండిపోయాను. ఇది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది; నాలో నేను ఇలా అనుకున్నాను: “ఈ జ్ఞానమ౦తటినీ, తనలోని ప్రేమన౦తటినీ—ఇపుడు ఆమె కురిపిస్తోంది!” ఆ తర్వాత నేను ఇలా అన్నాను: “ఆనందమా, ఇప్పుడు మీరు కొన్ని సత్సంగాలకు సహాయం చేయగలరు.” కాని, అది జరగలేదు! అయితే ఆ రోజు నేను ఆమె ఆత్మలో—గురుదేవుల ప్రేమను, జగన్మాత ప్రేమను ఆమె ఎంతగా సమీకరించిందో చూశాను. ఈ జన్మలో ఆమె ఇచ్చిన ఏకైక సత్సంగం అదే కావచ్చు!

ఈ లోకంలో సమతుల్యంగా జీవించిన జీవితం మనందరికీ ఏదో ఒకటి ఇస్తుంది; మరియు గురు-భక్తికి ఉదాహరణగా జీవించిన మన ప్రియమైన ఆనందమాత జీవితానికి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. మరి నిజంగా ఆమెను గౌరవించాలంటే—ఆమె ఎలా ఉండేవారో అని కాదు, ఎలా ఉన్నారు అని, ఎందుకంటే గురుదేవుల పనిలో ఎల్లప్పుడూ ఆమె అంతర్భాగంగా ఉండేవారు కాబట్టి—మనం తన ఉదాహరణను గుర్తుంచుకోవాలి మరి దాన్ని వర్తింపజేసుకోవాలి: గురుదేవుల కోసం నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా గురు-భక్తి అత్యున్నత రూపంలో ఇవ్వబడుతుంది. ఆమెకున్న సమయాన్ని మరియు శక్తిని దాచి ఉంచుకునేవారు కాదని మీరు చాలా కధలు విన్నారు. బాధ్యత లేదా సమస్య లేదా కర్తవ్యం ఎంత చిన్నదైనా లేదా ఎంత గొప్పదైనా ఫరవాలేదు, అవన్నీ భగవంతునికీ, గురువుకు సంబంధించినవిగా ఉండనివ్వండి—ఆనందమాత తన జీవితాన్ని అదే విధంగా గడిపారు. ఆమె పరిపాలనా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు, లేదా మందిరంలో ఆయన ఉపన్యాసానికి వెళ్ళడానికి ముందు నిశ్శబ్దంగా గురుదేవుల కారును కడిగి, మెరుగు పరచడానికి తీసుకువెళుతున్నా, ఎల్లప్పుడూ అదే భక్తితో, అదే జాగ్రత్తతో ఉండేవారు.

వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరం ఆమె భౌతిక సాన్నిధ్యాన్ని కోల్పోతాము. ఆమె నాకు సోదరి లాంటివారు, గురుదేవుల పాదాల చెంతనున్న పూజ్యనీయ శిష్యురాలు, ఆధ్యాత్మిక శ్రేయోభిలషి, మరియు ఒక ఉదాహరణ. ఆమెకు ఎల్లప్పుడూ నా హృదయంలో, నా ఆత్మలో పదిలమైన స్థానం ఉంది, ఎందుకంటే ఇది ఈ జీవితకాలంలో ప్రారంభమవలేదని నాకు తెలుసు. గురుదేవుల చుట్టూ ఉన్న మేమందరం గతంలో ఆయనతో చాలాసార్లు కలిసి ఉన్నామని ఆయన చెప్పారు. కాబట్టి ఆ బంధం ఉంది, మరణం దానిని విడదీయలేదు—అలాగే అది మీ అందరినీ కూడా విడదీయదు. మీరు చక్కగా మరియు ఆదర్శప్రాయమైన రీతిలో సేవ చేసినప్పుడు, గురుదేవులు స్వయంగా చెప్పినట్లు ఆనందమాత, దయామాత మరియు ఇతర శిష్యుల మాదిరిగానే మీరు కూడా గురుదేవుల దేవదూతలని ఎల్లప్పుడూ తెలుసుకుంటారు: “భగవంతుడు నాకు దేవదూతలను పంపించాడు.” తరువాత ఆయన మాలో ప్రతి ఒక్కరినీ చూసి ఇలా అన్నారు: “ఇప్పుడు, మీరందరూ దేవతల్లా ప్రవర్తించాలి!”

మనందరి దివ్య స్నేహంలో, భగవంతుడు మరియు గురుదేవుల దృష్టిలో ప్రియమైన మరియు ఉన్నతమైన ఆత్మ కోసం ప్రేమ, కృతజ్ఞతాభావాలతో ఒక్క చిన్న పదం పలికినా అది గౌరవంగా భావిస్తున్నాను. జై గురు!

శ్రీ దయామాత:

ప్రియతములారా, నా మనస్సు అనేక సంవత్సరాలు వెనక్కి మా అమ్మ పాదాల వద్ద మా మునుపటి రోజులకు ప్రయాణిస్తోంది. ఆనందమాత, నేను దాదాపు ఎనభై తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉన్నాము. నేను ఆమె కంటే కొంచెం పెద్దదాన్ని—మేము పాఠశాలకు నడచి వేళ్ళేటపుడు ఎప్పుడూ నా చేతిని పట్టుకొన్న చిన్నారి, ఎల్లప్పుడూ దయామాత అడుగుజాడలనే అనుసరించింది.

ఆమెను కూడా ఇక్కడికి తీసుకువస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. గురుదేవులు సాల్ట్ లేక్ లో నిండు శ్రోతలతో సంభాషించడం మొదటిసారిగా మేము విన్నాము. మా అమ్మ మమ్మల్ని వారి ఉపన్యాసానికి తీసుకువెళ్ళింది; మరియు మేము ఆ పెద్ద హాలు గడప దగ్గర నిలబడి, గురుదేవులు దూరంగా నిలబడి ఉండటం చూసినప్పుడు, మాలో ప్రతి ఒక్కరి ఆత్మలలో ప్రగాఢమైన ఉత్తేజం కలిగింది. కొన్ని నెలల తర్వాత మౌంట్ వాషింగ్టన్ లో చేరే అవకాశం నాకు లభించింది. అపుడు నాకు పదిహేడేళ్లు. నా హృదయంలో ఉన్న ఆనందాన్ని, శాంతిని నేను మరచిపోలేను. అప్పుడు ఆనందమాతకు పదిహేనేళ్లు; ఆమె కూడా అనుసరించాలని ఆరాటపడింది. 1933లో నా ప్రియ సోదరుడు రిచర్డ్2 లాగే ఆమె కూడా ఆశ్రమంలో చేరింది. ఏళ్ళు గడచే కొద్దీ మా తల్లి సంతానాన్ని గురుదేవులు తన చుట్టూ చేర్చుకున్నారు. డిక్, ఆనందమాత, నా చిన్న తమ్ముడు మరియు నేను. ఎంతటి అద్భుతమైన స్మృతులు! ఎంతో ధన్యమైన రోజులు, ఎ౦దుక౦టే ఆయన మా ము౦దు ఉ౦చిన ఆదర్శం ను౦డి మేము ఎ౦తో ప్రేరణ పొందాం.

గురుదేవుల దృఢమైన క్రమశిక్షణను ఆనందమాత తన పూర్ణ హృదయంతోను, భక్తితోను అనుసరించింది మరియు నేను అధ్యక్షురాలయిన తరువాత, నా విధులన్నిటిలో సంవత్సరాలపాటు నాకు సహాయం చేసింది. నేను ఐరోపా అంతటా, భారతదేశమంతటా, మెక్సికో, జపాన్ మరియు ఇతర దేశాలలో ప్రయాణించినప్పుడు, నాకు సహాయం చేయడానికి ఆమె నాతో పాటు ఉంది. నేను ఆ ప్రేమను అమూల్యమైనదిగా భావిస్తాను; ఆమె స్నేహాన్ని అపురూపమైనదిగా భావిస్తాను.

ఆమె డైరీలోని ఒక ఆలోచనను మీకు చదివి వినిపిస్తాను: ఏప్రిల్ 11, 1950న, ఆమె ఇలా వ్రాసుకొంది: “నిజంగా ఆశ్చర్యమే! బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో పనిచేయడానికి నన్ను ఎంచుకున్నానని గురుదేవులు ఈ సాయంత్రం నాకు చెప్పారు. నేను ఆ గౌరవాన్ని ఎప్పుడూ ఊహించలేదని చెప్పాను, ఎందుకంటే ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే సేవ చేస్తారని నేను అర్థం చేసుకున్నాను మరియు సహజంగా ఫే కు అది దక్కడం న్యాయమైనది. కానీ నేను బోర్డులో లేకపోవడం సరికాదని తాను అనుకున్నానని ఆయన చెప్పారు. రాజర్షితో సమావేశం సందర్భంగా ఆయన నన్ను నియమించారు. నన్ను ఎ౦పిక చేసిన౦దుకు గౌరవ౦గా భావిస్తాను, కానీ ఆ పై భావానికి నేను సంతోషించను. నిజంగా ఈ విషయాలు నాకు చెందినివి కావు.

“గురుదేవులు లోతైన చింతనలో నిమగ్నమయ్యారు. ఎన్నో అద్భుతమైన సత్యాలు ఆయన ద్వారా ఉచ్చరించబడ్డాయి: భగవంతుని ఈ స్వప్నములో మన ఉనికి ఎందుకు, ఏ కారణం చేత ఉంది. మనమ౦దర౦ జీవి౦చడానికి, దేవుణ్ణి అన్వేషించడానికి, ఆయన మనల్ని ఎ౦దుకు సృష్టించాడనేదానికి సమాధానం పొందడం కోసం ఇక్కడకు వచ్చామని గురుదేవులు సుస్పష్ట౦ చేశారు.”

కొంతసేపు తర్వాత ఆమె ఇలా చెప్పి౦ది: “గురుదేవులు కొ౦తమ౦ది శిష్యులతో మాట్లాడుతున్నారు, ఆ స౦భాషణలో ఆయనిలా అన్నారు: ‘మీలో ప్రతి ఒక్కరి జీవితాల్లో నేను ప్రయాణిస్తాను. భక్తి ముందుగా భగవంతుడిని స్పృశిస్తుందని సాధువులు సదా ప్రవచిస్తారు. ఎల్లప్పుడూ ఇష్టపడేవారినే అన్వేషించు.’ అలా ఇష్టపడేవారిలో నేనూ ఒకణ్ణి, భక్తిలో నేను భగవంతుణ్ణి అన్వేషిస్తాను.” మాతాజీ తన జీవితాన్ని గడిపిన విధానాన్ని అవే ఆలోచనలు చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తాయి.

ఈ రోజు నాకు పవిత్రమైనది. ఈ రోజు బాధాకరమైనది కూడా, ఎందుకంటే నేను ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా కలిసి ఉన్న ప్రియతమురాలు, ప్రియమైన సోదరి, స్నేహితురాలిని కోల్పోయాను. అయినా ముందుకు సాగుతాను; నేను వదిలిపెట్టను! ఆమె గురించి మీరు మాట్లాడిన తీరు నన్ను వినయంతో స్పృశించింది. మీరు నాకు కన్నీళ్లు తెప్పించారు. మీలో ప్రతి ఒక్కరినీ భగవంతుడు దీవించుగాక. మరియు నేను మీ అందరినీ కోరేది: ఈ సందర్భం మనల్ని మార్చివేయాలి! పవిత్ర జీవిత ఉదాహరణలు మనల్ని మార్చడానికి ఉద్దేశించినవి, వేరెవిరినో కాదు. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్ని౦చుకో౦డి: నేను ప్రేమిస్తున్నానా? నేను దయతో ఉన్నానా? నేను ప్రశాంతంగా ఉన్నానా? నేను కరుణను, ప్రేమను ప్రసరింపజేస్తున్నానా? అదే మన గురుదేవులు; అదే మన ముందు వెళ్ళిన వీరందరూ నేర్పించారు—రాజర్షి, జ్ఞానమాత, దుర్గామాత, డా. లూయిస్, మరికొందరు—ఇప్పుడు మన ప్రియతమ ఆనందమాత. అల్పబుద్ది లేకుండా—నిత్యం ఇదే తలంపుతో ఉందండి, “సేవ చేయడానికి నేనేమి చేయగలను?” ఆమెకు తెలిసిన గొప్ప ఆనందం, మనందరికీ తెలిసిన గొప్ప ఆనందం, నిస్వార్థంగా సేవ చేయడం—నేను-నేను-నేను అనే ఆలోచనతో ఎన్నడూ కాదు. గురుదేవులు ఇలా అన్నారు “ఈ ‘నేను’ అనేది మరణించినప్పుడు, అప్పుడు నేనెవరో నేను తెలుసుకుంటాను.” అదే మాతాజీ. ఆమె తన గురించి ఎన్నడూ ఆలోచించలేదు. అన్ని వేళలా గురుదేవులను సేవించడం, అంతా చూసుకోవడం, ఆయన కార్యాచరణకు సేవచేయడం; మరియు తన మధురమైన, ప్రేమపూర్వకమైన మార్గంలో, తన సోదరి దయామాతకి సేవ చేయడం.

ఆమెకిచ్చిన ఈ అందమైన నివాళికి ధన్యవాదాలు. దేవుడు మీ అందరినీ దీవించాలి.

1తన జీవితకాలంలో పరమహంసగారు ఆనందమాతను తరచుగా “మాతాజీ” అని సంభోదించేవారు—సంస్కృతంలో “గౌరవనీయురాలైన తల్లి.”

2ఒక యోగి ఆత్మకథ లో వివరించబడినట్లు 1935-36లో భారత పర్యటనలో శ్రీ పరమహంస యోగానందగారికి సహాయకుడిగా రిచర్డ్ రైట్ పనిచేశారు.

ఇతరులతో షేర్ చేయండి