మార్గదర్శనం మరియు ప్రోత్సాహం

 యోగదా సత్సంగ పత్రిక లో మొదట ప్రచురించిన శ్రీ దయామాతగారి ప్రసంగాల సంకలనం. శ్రీ శ్రీ దయామాతగారు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థలకు అధ్యక్షురాలుగా సంఘమాతగా 1955 నుండి 2010లో ఆమె దేహత్యాగం వరకూ సేవలందించారు.

చరిత్ర అంతటా మానవజాతి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది; ఈ సంక్షోభాలు ఇలా వస్తూ, పోతూ ఉంటాయి. ఈ ప్రపంచం నిరంతరం పునరావృత్తమయే ఒక ఆరోహణ మరియు అవరోహణ చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మొత్తం సమాజ చైతన్యం పైకి పురోగమిస్తో౦ది; ఇప్పట్నుంచీ వేల సంవత్సరాలకు తన శిఖరాన్ని చేరుకున్నాక, అది తిరిగి కిందికి దిగి వస్తుంది. పురోగమనం, తిరోగమనం; ఈ ద్వంద్వాత్మక ప్రపంచంలో నిరంతరమూ ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి.

ఈ పరిణామ చక్రాలతో, నాగరికతలు పైకి లేస్తాయి, పతనం చెందుతాయి. గతంలో ఎంతగానో అభివృద్ధి చెందిన భారతదేశం, చైనా వంటి నాగరికతలను చూడండి. ఉదాహరణకు భారతదేశంలోని సనాతన సంస్కృతి, ఇతిహాసాలను తీసుకుంటే క్రైస్తవ యుగం కంటే వేల సంవత్సరాల ముందున్న శ్రీరాముని కాలంలో అతడి అద్భుతమైన పుష్పక విమానం సాక్షిగా సాంకేతికత ఎంతగానో పురోభివృద్ధి చెందింది. ఆ స్వర్ణయుగంలో జీవించిన వ్యక్తుల మానసిక, ఆధ్యాత్మిక శక్తులు మరింత గొప్పవి. కాని చివరికి అంధయుగాల్లో అటువంటి పురోగతి మరుగున పడిపోయే౦తవరకూ నాగరికత పతనం చెందడం ప్రారంభించింది. ఇలా ఎందువల్ల జరిగింది? ఈ రోజు ప్రపంచంలో ఏ౦ జరుగుతో౦దో దాని నేపధ్యంలో నిన్న నా ధ్యానం తరువాత నేను దాని గురించి ఆలోచించాను.

ప్రస్తుత సంక్షోభం యొక్క స్వభావం

ఆవృత్తంలోని అవరోహణ సమయంలో జనులు తమ స్వభావంలోని ఆధ్యాత్మిక పార్శ్వం గురించి మరీ ఎక్కువగా, ఉదాత్తమైనదంతా పూర్తిగా మాయమయేవరకూ పెరుగుతున్న అజ్ఞానంలో ఉంటారు. అప్పుడు ఆ నాగరికత పతనం ఎ౦తో దూరంలో ఉండదు. ఆరోహణ చక్రంలో కూడా దేశాలలో ఇదే ప్రక్రియ సంభవమౌతుంది. మానవుడి నైతిక, ఆధ్యాత్మిక పరిణామం — అతడి అనుభవ జ్ఞానం మరియు సాంకేతికతతో సమమైన గతిలో లేకుంటే అతడు తన శక్తిని స్వీయ వినాశనం కోసమే దురుపయోగం చేస్తాడు. నిజానికి మనం ఈనాడు ఎదుర్కొంటున్న సంక్షోభం స్వభావం ఇలాటిదే.

మానవ చైతన్యం ఒక పరమాణువు మర్మాన్ని, అద్భుతశక్తిని బహిర్గతం చేసే౦తగా పరిణామం చెందింది; ఈ శక్తి ఈనాడు మనం ఊహించను కూడా లేని అద్భుత కార్యాలను చేయగలదు. కాని ఆ జ్ఞానంతో మనమే౦ చేశాము? విధ్వంసకర పనిముట్లను అభివృద్ధి చేయడం మీదే మనం ప్రధానంగా దృష్టి పెట్టాము. భౌతికంగా మనుగడ సాగించడానికి ఒకప్పుడు అవసరమైన, సమయం తీసుకునే పనులు ఎన్నిటి నుంచో అనేకమందికి స్వేచ్ఛను ప్రసాదించింది ఆధునిక సాంకేతికత. అయితే తరచుగా మనిషికి దొరికిన ఖాళీ సమయాన్ని తన మానసిక, ఆధ్యాత్మిక స్వభావాలను అభివృద్ధి చేసుకోడానికి ఉపయోగించకుండా భౌతిక సుఖాల, ఇంద్రియ సుఖాల వేటలో గడిపేస్తున్నాడు. మనిషి తన ద్వేషము, ఈర్ష్య, కామం, అత్యాశలనే భావోద్వేగాలచే పాలించబడుతూ తన ఇంద్రియ సుఖాల గురించే ఆలోచిస్తూ ఉంటే దాని అనివార్య ఫలితం — వ్యక్తుల మధ్య సామరస్య లేమి, సమాజాలలో గందరగోళం, దేశాల మధ్య ఘర్షణలు. యుద్ధాలు దేనినీ ఎన్నడూ బాగుచేయలేదు; దానికి బదులు, అవి మరింత పెద్ద విధ్వంసాలుగా అదుపు లేకుండా పెరిగిపోతాయి. మానవులు మరింత తెలివైన వారుగా, మరింత ప్రేమమయులుగా పరిణామం చెందినప్పుడు మాత్రమే ప్రపంచం నిజంగా మెరుగైన ప్రదేశంగా మారుతుంది.

వెలుగు ఇచ్చే వాగ్దానం

ప్రస్తుత ప్రపంచంలో ప్రబలంగా ఉన్న ప్రతికూలత, అజ్ఞానాలతో సమర్థవంతంగా వ్యవహరించడం ఎలా అని ఎవరో నన్నడిగారు. దాని గురించి నేను చాలా గాఢంగా ప్రార్థించాను, అప్పుడు నా మనస్సు వెనక్కి, ముప్ఫై ఏళ్ళ క్రితం మహావతార్ బాబాజీగారి గుహకి వెళ్ళినప్పుడు నాకు కలిగిన దివ్యానుభవానికి వెళ్ళింది.

నా సహచరులు, నేనూ ఆ రాత్రి గుహకు వెళ్ళే దారిలో ఉన్న ఒక చిన్న గుడిసెలో గడిపాము. ఆ రోజు అర్ధరాత్రి నాకు ఒక అతీంద్రియ దృశ్యం గోచరించింది; ప్రపంచం అతి కష్టకాలాన్ని, గొప్ప సంక్షోభం, అశాంతి, భయాందోళనలు నిండిన సమయాన్ని ఎదుర్కోబోతో౦దని అందులో నేను చూశాను. నేను పైకి ఏడ్చాను, ఏ౦ జరిగిందని మిగిలిన వాళ్ళు అడిగారు. నేనప్పుడా అనుభవం గురించి మాట్లాడదల్చుకోలేదు కానీ, దానిలో కేవలం దయామాగారుకు మాత్రమే కాక ప్రపంచానికి సంబంధించి లోతైన అర్థం ఉందని నాకు తెలుసు. ఆ దివ్యదర్శనంలో ఒక పెద్ద దట్టమైన కారుమేఘం విశ్వమంతటా ఆవరిస్తో౦ది; దాని అరిష్టదాయకమైన చీకటి చూడ్డానికి భయంకరంగా ఉంది. కాని మరుక్షణంలోనే దివ్యప్రేమతోనూ పూర్తిగా పరమానందంతోనూ నిండిన భగవంతుని దేదీప్యమానమైన వెలుగు ఆ మేఘం యొక్క నల్లటి అలలను వెనక్కి నెట్టి వెయ్యడం నేను చూశాను. చివరికి అన్నీ బాగవుతాయని అప్పుడు నాకు తెలిసింది.

ఆ అనుభవంలో ముందుగానే చెప్పినట్టు ఆ కష్టకాలాలనే మనమిప్పుడు అనుభవిస్తున్నాము. ప్రతి దేశంలోనూ ఇది జరుగుతో౦ది — యుద్ధాలు, కరువు, నయం కాని రోగాలు, ఆర్థిక సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, మతపరమైన, సామాజిక కలహాలు. అన్నిటికన్నా ఘోరంగా ముంచుకొస్తున్న అస్తవ్యస్త పరిస్థితుల సముఖంలో పెరుగుతున్న భయం, నిస్సహాయత నిండిన భావన అందులో ఉంది.

ఈ బాధలన్నీ మనల్ని ఎందుకు పీడిస్తున్నాయి? సనాతన ఈజిప్షియన్లు దైవ సంకల్పాన్ని ఉల్లంఘించినందుకు ప్లేగు వ్యాధి చేత, విపత్తుల చేత పీడింపబడినట్లు పవిత్ర గ్రంథాలలో నమోదు చేయబడి ఉంది. మన పరిస్థితి అలాగే ఉంది. అటువంటి సంఘటనలు బైబిలు కాలం నాడు మాత్రమే జరిగేవని మనం అనుకుంటూ ఉంటాము, కాని అది నిజం కాదు. ఈనాడూ మనల్ని ఎన్నో ప్లేగులు పట్టి పీడిస్తున్నాయి. మనం గుడ్డిగా ఇలా ఆలోచిస్తాము, “ఓహ్ ఇది మన నియమోల్లంఘన ఫలితం కాదు, అది కేవలం యాదృచ్ఛికము.” అది యాదృచ్ఛికం కాదు.

సరియైన ప్రవర్తనకు సంబంధించిన నియమాలు విశ్వం యొక్క విధివిధానంలో భాగాలు

మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకో౦డి: “మనం సత్యం నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాము?” “నీవు ఎవరినీ చంపకూడదు; నీవు వ్యభిచారం చేయకూడదు; నీవు దొంగతనం చేయకూడదు….” ఈ సత్య నియమాలు పది దైవాజ్ఞలలో, క్రీస్తు బోధనలలో, అంతకు చాలాముందు అష్టాంగ యోగమార్గంలో విశదీకరించ బడ్డాయి. పతంజలి యోగమార్గంలో మొదటి రెండు మెట్లు యమము, నియమము — మనం పాటించవలసిన సరైన ప్రవర్తనా నియమావళి, మనం త్యజించవలసిన దుష్ప్రవర్తనా నియమావళి.

ఇవన్నీ దైవ నియమాలు, విశ్వవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా పరిగణించబడే సూత్రాలు; వీటిని మన ప్రియతమ భగవంతుడే మానవజాతి ముందుంచాడు. అతడు ఈ ప్రపంచాన్ని అత్యంత శాస్త్రీయంగా, గణిత శాస్త్రాన్ని అనుసరించి ఖచ్చితమైన విధానంలో సృష్టించాడు; దానిలోని ప్రతి అంశమూ నియమాల చేత పాలించబడ్తూ ఉంటుంది. ఆయన తన నియమాలను ఏసు, భారతదేశంలోని ఋషులు వంటి మహాత్ములకు దివ్యదర్శనాల రూపంలో వెల్లడి చేయడం ద్వారా మనకి స్పష్టం చేస్తున్నాడు. మన జీవితాలను భగవంతునితో అనుసంధానంలో ఉంచడానికి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోడానికి మనకి మార్గదర్శకాలుగా పనికివస్తాయని ఆయన ఈ నియమాలను మన ముందుంచాడు.

ఎన్నో యుగాలుగా గొప్ప దైవారాధకులు తమ దివ్య సందేశాలతో మన ముందుకు వస్తూనే ఉన్నారు. పూర్వకాలంలో మోజెస్ వివరించిన నియమాలు మన వద్ద ఉన్నాయి; ఉదాహరణకు, “కన్నుకి కన్ను, పన్నుకి పన్ను.” మీరు ఏ విత్తనం నాటుతారో దాన్నే పంటగా పొందుతారు అనే దివ్య నియమము అనివార్యమైనదని అతడు ఎత్తి చూపాడు. శతాబ్దాల తరువాత మహాకరుణ నిండిన బోధనను తెస్తూ ఏసుక్రీస్తు వచ్చారు. ఆ సమయంలో మానవాళి క్షమ, దయల గురించి కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది; “కన్నుకి కన్ను, పన్నుకి పన్ను” అంటూ ఎన్నో సంవత్సరాలు ప్రతీకారంలో గడిచాయి. క్షమ, పంచుకోవడం, దివ్యప్రేమలనే బోధనల ద్వారా క్రీస్తు, నియమానికి ఖచ్చితమైన, రాజీపడని ప్రాముఖ్యత ఇవ్వడాన్ని సమతుల్యం చేయాలని కోరాడు. ఆయన ప్రభావం ప్రస్తుతకాలం వరకూ కూడా కొనసాగుతో౦ది.

ఇప్పుడు మనం ఇంకొక యుగంలోకి ప్రవేశించాము — ఈ కాలంలో మహావతార్ బాబాజీ ఏసుక్రీస్తుతో అనుసంధానంలో ఉంటూ మానవాళి క్రీస్తు బోధనల గురించి కేవలం వినడం, మాట్లాడడం లేదా భారతదేశపు గొప్ప పవిత్ర గ్రంథమైన భగవద్గీతను చదవడం లేదా పారాయణ చేయడాన్ని దాటి వెళ్ళే౦దుకు సమర్థులుగా చేసే బోధనను పంపారు; ఎందుకంటే మానవాళి ఇప్పుడు మరింత లోతైన దానికోసం తపిస్తో౦ది.

ఆ “లోతైనది” ఏదంటే దివ్యప్రియతమునితో ప్రత్యక్ష సంసర్గం. మనలో ఏ ఒక్కరూ ఆ దివ్యస్పృహకు బాహ్యంగా లేరు. మనమందరమూ ఆయన ప్రతిరూపంగా తయారు చేయబడ్డాం. మన వర్ణము, మన జాతి, మన నమ్మకాలు ఏవైనా మనమందరమూ ఆయనలో ఒక భాగమే; మనలో ప్రతి ఒక్కరిలో ఆ దివ్య విస్ఫులింగం ఉంది. పవిత్ర గ్రంథం ఇలా మనకి చెప్తో౦ది: “నీవు భగవంతుని దేవాలయమని, పరమాత్మ నీలో ఉన్నాడని నీకు తెలీదా?”

మనలో ఉన్న ఆ పరమాత్మ ఏమిటి? అదే ఆత్మ; మనలో సారభూతమైన పదార్థం. మనం దివ్యాత్మలమని మనలో ఎంతమందికి తెలుసు? చాలామంది ఆ జ్ఞానం నుంచి ఎంత దూరంగా వెళ్ళారంటే రోజులో ఒక్క నిమిషం కూడా వారికి దాని గురించి గుర్తులేదు. ఇంద్రియాలను దుర్వినియోగం చేయడం వల్ల వారి చైతన్యం ఉత్సాహాన్ని కోల్పోయింది. మద్యపానం, దురాశ, తప్పుడు ఆహారపుటలవాట్ల వల్ల రుచి పటుత్వాన్ని కోల్పోయింది. మన దైనందిన జీవితంలో మనం శృ౦గారానికి అధిక ప్రాముఖ్యతను ఇవ్వడం చూసిన మన కళ్ళు మసకబారాయి. మనం వినే చెడు విషయాలన్నిటితో చెవులు మొద్దుబారాయి. అసహ్యకరమైన ఆలోచనలను ప్రతిబింబించే అశ్లీల పదాలు మాట్లాడి నాలుకలు మందకొడిగా మారాయి.

ప్రపంచ పరిస్థితుల సృష్టికర్తలం మనమే

మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల సృష్టికర్తలం మనమే. జీవితంలోని అన్ని వర్గాలలోనూ అనైతిక ప్రవర్తన, నైతిక విలువల పతనం యొక్క మొత్తమే ఇవి.

నాగరికత యొక్క మనుగడ, సరైన ప్రవర్తనా ప్రమాణాలను పాటించడం పైనే ఆధారపడి ఉంది. నేను మారుతున్న కాలంతో పాటు మారే మనుష్యులు తయారు చేసిన నియమ నిబంధనల గురించి మాట్లాడడం లేదు; ఆరోగ్యకరమైన, సంతోషం నిండిన వ్యక్తులు, సమాజాలను ప్రోత్సహించే, కాలానికి అతీతమైన సార్వజనీన ప్రవర్తనా నియమావళి గురించి నేను చెప్తున్నాను — ఇవి భిన్నత్వంలో సామరస్యంతో నిండిన ఏకత్వాన్ని అనుమతిస్తాయి.

భగవంతుడి వ్యవస్థీకృత నిర్మాణం కలిగిన విశ్వం వెనుకనున్న సత్యాల పరిమాణాన్ని అర్థం చేసుకోవడం మన సాధారణ చేతనాస్థితిలో ఒక్కోసారి మనకు కష్టమౌతూ ఉంటుంది. కాని ఆ అంతిమ సత్యాలు ఉన్నాయి, విశ్వాన్ని, అందులోని జీవులని పట్టి ఉంచే ఖచ్చితమైన నియమాల విషయంలో భగవంతుడు రాజీపడే ప్రసక్తే లేదు. ఈ విశ్వంలో ప్రతిదీ మిగిలిన వాటితో సంబంధం కలిగి ఉంది. మానవులుగా మనం ఒకరితో ఒకరు మాత్రమే కాకుండా ప్రకృతి అంతటితోనూ అనుబంధాన్ని కలిగి ఉన్నాము; ఎందుకంటే జీవులన్నీ ఒకే మూలం — భగవంతుడు — నుంచే వచ్చాయి. ఆయన పరిపూర్ణ సామరస్య స్వరూపుడు; కాని మానవుడి చెడు ఆలోచనలు, పనులు ఈ ప్రపంచం కోసం ఆయన రచించిన సామరస్య పూరిత ప్రణాళిక రూపుదాల్చడంపై అనిశ్చితమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక రేడియో స్టేషన్ ను మీరు ట్యూన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వినిపించే అర్థం లేని శబ్దాలు, మీరు కార్యక్రమాన్ని స్పష్టంగా విననీయకుండా అడ్డుపడినట్లే, మనిషి దుష్ప్రవర్తన అనే “అర్థం లేని గోల” ప్రకృతి శక్తుల మధ్య నున్న సామరస్యాన్ని చెదరగొడ్తుంది. దాని ఫలితమే ఈనాడు మనం ఎదుర్కొంటున్న యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక అశాంతి, ఇతర సమస్యలు.

“భగవంతుని వెలుతురు, ఆనందాలతో నిండి ఉండడం”

మనం మారాలి. అదే పరమహంస యోగానందుల వారి సందేశం; అందువల్లనే ఆయన స్థాపించిన ఈ సంస్థ పెరుగుతూనే ఉంటుంది — ఎందుకంటే జనులు మారడానికి అది దోహదం చేయగలదు, చేస్తుంది కూడా.

బాధలతో పీడించబడ్తూ జనులు సాధారణంగా ఇలా అంటారు: “భగవంతుడు నాకెందుకిలా చేశాడు?” ఆయన మనకి వాటిని కలుగజేయలేదు. మనకు, మన పనులకి మనమే బాధ్యత వహించాలి. మనం ఒక రాతిగోడను గుద్దినప్పుడు, గోడ మనకి హాని కలిగించాలనుకోదు; కాని మనం మన మెటికలు లేదా మన తలనే పగలగొట్టుకోవచ్చు! దాని కోసం మనం గోడను నిందించలేము. మనమిలా విలపించవచ్చు, “కాని అక్కడ గోడ ఉందని నాకు తెలీదు; లేకపోతే నేను దాన్ని గుద్దేవాడిని కాను!” అందువల్లనే భగవంతుడు దివ్యనియమాలను తయారుచేసి, వాటిని మార్గదర్శకాలుగా ప్రపంచంలోని గొప్ప మతాలన్నిటిలో ఉంచాడు. మనలో ప్రతి ఒక్కరితో ఆయన ఇలా అంటున్నాడు, “నా బిడ్డా, నీవు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవి.” మనం బలహీనులమని ఆయనకు తెలుసు; మనం పెళుసైన వారమని ఆయనకు తెలుసు. మనం ఆయనతో సంబంధాన్ని కోల్పోయామని ఆయనకు తెలుసు. ఈ భౌతిక ప్రపంచంలో అతిగా నిమగ్నమై పోవడం వలన మన దృష్టి, విచక్షణ మసకబారి పోయాయని ఆయనకు తెలుసు. అందువల్లనే మనం తప్పు చేసినప్పుడు తెలియజెప్పడానికే ఆయన ఆ నియమాలను ప్రవక్తలు, ఋషుల ద్వారా మనకు అందించాడు. ఆ నిత్యమైన దివ్య నియమాలను ఉల్లంఘించినప్పుడు మనం బాధపడ్తాము.

మనం వాటిని తిరిగి అమలు చేయాలి. క్రీస్తు చెప్పినట్లు మన సామ్రాజ్యం ఈ ప్రపంచానికి చెందినది కాదని మనం గ్రహించాలి. అది ఈ ప్రాపంచిక రాజ్యానికి ఆవల ఉంది — దివ్యాత్మలు ఎక్కడ ఉన్నారో, గొప్ప ఋషులు, గురువులు ఎక్కడ ఉన్నారో అక్కడే అది ఉంది. పరమహంసగారు తన గదిలో హఠాత్తుగా ఏకాంతం కోరుతూ చాలా నిశ్శబ్దంగా అయిపోవడం నేనెన్నిసార్లు చూశానో. ఆ సందర్భాలలో ఆయన పాదాల వద్ద కూర్చుని ధ్యానించే మహద్భాగ్యం మాలో కొంతమందికి లభించింది. కళ్ళు తెరచిన తర్వాత ఆయన పరలోకం గురించి మాట్లాడే వారు: “ఈ పరిమితమైన ప్రపంచాన్ని చూశారా? అది ఎ౦తో అసంపూర్ణంగా ఉంది. దీనికి ఆవలనున్న భగవంతుడి వెలుగుతో, ఆనందంతో నిండిన ఆ గొప్ప లోకాన్ని నేను చూసినట్టు మీరు కూడా చూడగలిగితే!”

నా ప్రియతములారా, మీ రాజ్యం కూడా ఈ లోకానికి చెందినది కాదు. మన నిజమైన సామ్రాజ్యం గురించిన జ్ఞానాన్ని మనం కోల్పోవద్దు; మన సమయాన్ని, ధ్యాసను అంతటినీ ఈ ప్రాపంచిక విషయాలపై ఉంచొద్దు, ఎందుకంటే ఒకరోజు మనం దీన్ని వదిలివేయాలి.

“సర్వనాశనం మరియు చీకటి”ని అంగీకరించకండి

అయితే “మనం ఈ ప్రపంచంలోని ‘సర్వనాశనం మరియు చీకటి’ని ఎలా ఎదుర్కొంటాం?” అని మీరు నన్ను అడిగినప్పుడు నేను మీతో ఇలా అంటాను: దాన్ని అంగీకరించకండి! అది అలా అస్తిత్వం కలిగి లేదు. దాన్ని మీ చైతన్యంలో పేరుకున్న చీకటిగా ఉండడానికి మీరు సమ్మతిస్తే తప్ప. మీ చైతన్య కే౦ద్రాన్ని మార్చడానికి ప్రయత్నించండి. రోజులో ఎంత తరచుగా మనం భగవంతుని కోసం లోపలికి మళ్ళుతున్నాము? ఎల్లప్పుడూ ఆయన సన్నిధానపు స్పృహతో, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా దైవమా” అనే ఆలోచనతో ఎప్పుడూ జీవించడం ఎంతో అద్భుతం కదూ. అది ఎటువంటి పులకరింతో కదా. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను మొదట ప్రేమిస్తున్నాను కాబట్టే మానవాళి అంతటినీ ప్రేమించగలుగుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుకనే నన్ను అపార్థం చేసుకున్న వారిని క్షమించ గలుగుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నేను ఈ ప్రపంచంలో మంచిని మాత్రమే చేయాలనుకుంటున్నాను.” ఈ విధంగా మనం జీవించాలి.

ఈ “సర్వనాశనం మరియు చీకటి” వల్ల నిరుత్సాహపడకండి; అది వెళ్ళిపోతుంది. ఈ లోకంలో ఎన్నో నాగరికతలు వచ్చాయి. కనుమరుగై పోయాయి. ఈ రోజు మనం చూస్తున్నటువంటి లెక్కలేనన్ని సంక్షోభాలు ఏర్పడ్డాయి — ఎన్నో జన్మల సుదీర్ఘ ప్రయాణంలో మన ఆత్మలు అటువంటి కాలాలెన్నిటిలోనో ప్రయాణించినప్పటికీ మనం తెలుసుకోగలిగిన లేక గుర్తుంచుకోగలిగిన వాటికన్నా అవి చాలా ఎక్కువ. అయితే ఇది అంతా కాదు. పరలోకంలో దీనికన్నా మంచిది మన కోసం ఉంది. ఈ గోళంతో మన శరీరానికి గల వ్యామోహం నుంచి మన మనస్సులను మనం ఎంత ఎక్కువగా దూరం పెడ్తే అంత ఎక్కువగా మన చైతన్యాన్ని ఆ దైవ సామ్రాజ్యంలోకి పైకెత్తగలం.

ఇంద్రియాలను ఆధ్యాత్మీకరించడానికి ప్రయత్నించడం ద్వారా మనం ప్రారంభిస్తాం. మంచినే చూడండి, మంచే ఆలోచించడానికి ప్రయత్నించండి. దానర్థం మనం గుడ్డి ఆశావాదం గల వ్యక్తులం అవుతామని కాదు; దానర్థం మనలో ఇలా అనడానికి కావలసిన సంకల్పం, శక్తి, భక్తి, విశ్వాసం ఉన్నాయని: “నా ప్రియ దైవమా, నేను నీ వాడను. ఇతరులను ఉత్సాహపరచడానికి, పైకెత్తడానికి నా చిన్న ప్రపంచంలో నేను చేయగలిగినదంతా చేస్తాను — అది నా కుటుంబమో, నా పొరుగువారో, నా సమాజంలోని వారో, నేను చేరగలిగిన వారెవరైనా సరే. నేనే స్వయంగా కష్టాలలో ఉన్నప్పటికీ నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను.”

మన గురుదేవులు తరచుగా ఇలా అనేవారు: “నిజమైన సాధుపురుషులు ఎవరంటే, తాము కష్టాలు పడుతున్నప్పటికీ తమ వద్దకు వచ్చిన వారందరి జీవితాల్లో ఉత్సాహాన్ని, స్వస్థతను నింపేవారు.” నిజమైన దైవ ప్రేమికుని దృక్పథం ఇలాగే ఉంటుంది. అతడు కాని ఆమె కాని దేన్ని అనుభవిస్తున్నా ఫరవాలేదు, ఆ వ్యక్తి వద్దకు వెళ్ళినవారెవరూ పీడితులుగా, నిరుత్సాహంలో ఉన్నట్టుగా, ఒక పరాజితుడిగా ఎన్నడూ భావించరు. మనమందరమూ భగవంతుని సంతానం; జీవితంలో వచ్చే కష్టాలను జయించే శక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. కాని దాన్ని మనం నమ్మాలి, దాన్ని మనం ఉపయోగించాలి, మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించాలి.

పరమహంసగారు అనేవారు, “దుఃఖించే సాధువు ఒక దుఃఖభరిత సాధువు!” ఎల్లవేళలా ఆయన చాలా ఆనందంగా ఉండేవారు – యోగదా సత్సంగ సొసైటీ/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థల నిర్మాణంలో బ్రహ్మాండమైన కష్టాల నడుమ కూడా. భగవంతుడికి సేవ చేయడం అంత సులువేమీ కాదు; ఈ ప్రపంచంలో జీవించడం అంత సులువు కాదు! కాని మనం ఆనందంగా ఉత్సాహంగా, మనం జయిస్తామనే దృఢ సంకల్పంతో, మనం బాగానే ఉంటామని జీవిద్దాం, ఎందుకంటే దైవం మన వెనుకనే ఉన్నాడు.

మూడీగా ఉండకండి; ప్రతికూల ఆలోచనలను వ్యాపింపజేసే వారిగా ఉండకండి. గుర్తుంచుకో౦డి: ఈ ప్రపంచం ద్వంద్వత్వ నియమంపై ఆధారపడి సృష్టించబడింది; ప్రతిదానికీ రెండు పార్శ్వాలు ఉంటాయి — ఒకటి సానుకూలమైనది, ఒకటి ప్రతికూలమైనది — వీటిలో ఏదో ఒకదానితో తన చైతన్యాన్ని సామరస్యంలో ఉంచుకునే ఎంపిక ప్రతి మనిషికీ ఉంటుంది. దుర్గంధభరితమైన కసింద మొక్క పక్కన ఉండాలని ఎవరూ కోరుకోరు. అది ప్రతికూలమైనది, మనలను నిరాశాజనకంగా చేస్తుంది. కాని మన గురూజీ చెప్పినట్లు తియ్యని సుగంధాన్ని వ్యాపింపజేసే గులాబీ పక్కన ఉండాలని ప్రతివారూ కోరుకుంటారు. ఒక సానుకూలమైన మానవ గులాబీలా ఉండండి.

సానుకూలంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలని మీ మనస్సులో నిశ్చయించుకో౦డి. మీరలా చేస్తే, మంచి మీవైపు వస్తో౦దని మీరు తెలుసుకుంటారు; ఎందుకంటే ఆలోచనకు ఆకర్షించే శక్తి ఉంది. మన ఆలోచనలు అలవాటు ప్రకారం ప్రతికూలంగా ఉంటే, మనం ప్రతికూల పరిస్థితులనే ఆకర్షిస్తాం. మనం సానుకూలంగా జీవిస్తూ, ఆలోచిస్తూ ఉంటే సానుకూల ఫలితాలను ఆకర్షిస్తాము. ఇది అంత సరళమైన విషయం: ఒక విధమైనది అదే విధమైన దాన్ని ఆకర్షిస్తుంది.

ప్రార్థనకున్న ప్రపంచాన్ని మార్చే శక్తి

నేను వివరించిన దివ్యదర్శనం చివర, ఆధ్యాత్మిక సూత్రాలకు అనుగుణంగా జీవించే వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ మన ప్రపంచాన్ని భయపెడ్తున్న చీకటిని వారి ద్వారా భగవంతుడు పారద్రోలాడు. ఆధ్యాత్మికత, నైతికతతో ఆరంభమౌతుంది; ఇవి ప్రతి మతానికి ఆధారమైన సరియైన ప్రవర్తనా నియమావళి — సత్యసంధత, ఆత్మ-నిగ్రహం, పెళ్ళినాటి ప్రమాణాలపట్ల నిబద్ధత, అహింస వంటివి. మనం మన ప్రవర్తననే కాక ఆలోచనా సరళిని కూడ సరిచేసుకోవాలి. మనం ఒక విధంగా ఆలోచించడాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఆ ఆలోచనలు చివరికి క్రియలుగా పరిణమిస్తాయి. కాబట్టి మనలో మార్పు రావాలంటే మనం మన ఆలోచనలతో మొదలుపెట్టాలి.

ఆలోచన ఒక శక్తి; దానికి అపారమైన బలం ఉంది. అందువల్లనే పరమహంస యోగానందగారు ప్రారంభించిన ప్రపంచవ్యాప్త ప్రార్థనామండలిని నేను గాఢంగా విశ్వసిస్తాను. మీరందరూ దానిలో పాల్గొంటున్నారని నేను అశిస్తున్నాను. ప్రపంచవ్యాప్త ప్రార్థనామండలి ఉపయోగిస్తున్న స్వస్థత చేకూర్చే ప్రక్రియలో వలే జనులు ఏకాగ్రతతో శాంతి, ప్రేమ, సద్భావన, క్షమలతో నిండిన సానుకూల ఆలోచనలను బాహ్యంగా పంపినపుడు అది గొప్ప శక్తిని ఉత్పన్నం చేస్తుంది. జన సమూహాలు దీన్ని చేస్తే, నేను వాగ్దానం చేస్తున్నాను, అది మంచితనమనే ప్రపంచాన్ని మార్చే శక్తి గల ఒక స్పందనను తయారు చేస్తుంది.

మిమ్మల్ని మీరు మార్చుకో౦డి, ఆపైన మీరు వేలమందిని మారుస్తారు

మన పాత్ర ఏమిటంటే, మన జీవితాలను భగవంతునితో అనుసంధానంలో ఉంచుకోడానికి మనం చేయగలిగినదంతా చేయడం; ఆ విధంగా మన ఆలోచనలు, మన మాటలు, మన ఆదర్శప్రాయమైన ప్రవర్తన బాహ్యంగా మిగిలిన ప్రపంచంపైన కొంత ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపగలవు. మనిషి జీవితంలో ప్రత్యక్షంగా వ్యక్తమవకపోతే అతడి మాటలకు ఏ విలువా ఉండదు. క్రీస్తు పలుకులు రెండు వేల సంవత్సరాల క్రితం ఎంత శక్తివంతంగా ఉండేవో ఈరోజూ అలాగే ఉన్నాయి, ఎందుకంటే ఆయన దేన్ని బోధించాడో అలాగే జీవించాడు. మన జీవితాలు కూడా నెమ్మదిగానే అయినా శక్తిమంతంగా మనం ఏ సిద్ధాంతాలను నమ్ముతున్నామో వాటిని ప్రతిఫలించాలి. మన గురూజీ తరచుగా అన్నట్లు, “మిమ్మల్ని మీరు సంస్కరించుకో౦డి, మీరు వేలమందిని సంస్కరించిన వారవుతారు.”

మీరిలా అనవచ్చు, “కాని ప్రపంచంలో సరిచేయవలసింది చాలా ఉంది; ఎ౦తో చేయాల్సి ఉంది.” అవును, అవసరాలు బలీయమైనవి; కాని మనం బాహ్య విషయాలను సరి చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన ప్రపంచంలోని సమస్యలు ఎక్కడికీ పోవు. ఈ సమస్యలకు మూలకారణమైన మనుష్యుల స్వభావమనే అంశాన్ని సరిచేయాలి, మనం మనతోనే మొదలుపెట్టాలి.

ఒక వ్యక్తిని సిగరెట్లు కాల్చవద్దని మీరు వెయ్యిసార్లు చెప్పవచ్చు, కాని అతడు తనకు సిగరెట్లంటే ఇష్టమని తన మనస్సులో నిశ్చయించుకుంటే మీరు చెప్పినది ఏదీ అతడి అలవాటును మార్చలేదు. అతడు దగ్గడం మొదలుపెట్టి పొగ త్రాగడం వల్ల కలిగే ప్రతికూల ఫలితాల వల్ల బాధపడినప్పుడు మాత్రమే మీ సలహా గూటికి చేరుతుంది, అతడు గ్రహిస్తాడు, “ఇది నన్ను ప్రభావితం చేస్తో౦ది; ఇప్పుడు ఇదేదో నేను ఆలోచించాల్సిందిలా తయారైంది.” అదే విధంగా ఒక సామరస్యం లేని వ్యక్తి మరింత ప్రశాంతంగా ఉండడానికి మీ మాటలు మాత్రమే ప్రభావితం చేయగల శక్తిని కలిగి ఉండవు. కాని స్వయంగా మీ శాంత స్వభావం నుంచి పొంగి వస్తున్న సామరస్యం, మంచితనాల భావనను ఆ వ్యక్తి పసిగడ్తే, అది స్పష్టంగా కనిపిస్తుంది; అది అతనిపై ప్రయోజనకారియైన ప్రభావాన్ని చూపిస్తుంది.

మీ ఆత్మతోనూ, భగవంతునితోనూ ఒక ఆంతరిక సామరస్యాన్ని ఏర్పరచుకో౦డి

అత్యవసరంగా అందరూ కోరుకునే శాంతి, సామరస్యాలు ప్రాపంచిక వస్తువుల ద్వారా కాని, బాహ్యమైన ఏ అనుభవం ద్వారా కాని లభించవు; అది అసలు సంభవం కాదు. బహుశా ఒక అందమైన సూర్యాస్తమయం చూడడం ద్వారా కాని, కొండల వద్దకు లేదా సముద్ర తీరానికి వెళ్ళడం వల్ల కాని తాత్కాలికంగా మీకు కొంత ప్రశాంతత లభించవచ్చు. కాని మీ లోపల మీకు సామరస్యం లేకపోతే అత్యంత స్ఫూర్తినిచ్చే దృశ్యాలు కూడా శాంతిని ఇవ్వలేవు.

మీ జీవితంలోని బాహ్య పరిస్థితులలో సామరస్యాన్ని తెచ్చే రహస్యం ఏదంటే మీ ఆత్మతోనూ భగవంతుడితోనూ ఒక ఆంతరిక సామరస్యాన్ని సుస్థిరం చేసుకోడం….

మానవాళిలో ఎక్కువ మంది ఆ స్థితి కోసం కృషి చేస్తే, మన ప్రపంచాన్ని భయపెడ్తున్న సంక్షోభాలు తగ్గుముఖం పడ్తాయి. కాని ఈ భూమి ఎన్నడూ పరిపూర్ణంగా ఉండదన్న విషయాన్ని మనం గ్రహించాలి, ఎందుకంటే ఇది మన శాశ్వత గృహం కాదు; ఇది ఒక పాఠశాల, దీనిలోని విద్యార్థులు విద్యలోని వివిధ దశలలో ఉన్నారు. జీవితంలోని మంచివి, దుఃఖకరమైనవి అన్ని అనుభవాలను అనుభవించడానికి, ఆ విధంగా వాటినుంచి నేర్చుకోడానికి మనమిక్కడికి వచ్చాము.

భగవంతుడు శాశ్వతుడు, మనం కూడా అంతే. ఆయన విశ్వం ఒడుదుడుకులతో అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆయన సృష్టి నియమాలతో మనల్ని మనం సామరస్యంలో ఉంచుకోడం మనపైనే ఆధారపడి ఉంది. అలా చేసినవారు తమ బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా, వారు ఏ ప్రత్యేక ప్రాపంచిక చక్రంలో పుట్టినప్పటికీ పరిణామం చెందుతూనే ఉంటారు; తమ చైతన్యాన్ని మెరుగుపరచుకోడం ద్వారా వారు భగవంతుడిలో స్వేచ్ఛను పొందుతారు.

అంతిమ అర్థంలో, మనలో ప్రతి ఒక్కరి ముక్తి పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంది — మనం జీవితాన్ని ఎలా ఎదుర్కొంటాము; ఎలా ప్రవర్తిస్తాము; మన జీవితాలను నిజాయితీ, చిత్తశుద్ధి, ఇతరుల పట్ల గౌరవం, అన్నిటినీ మించి ధైర్యము, విశ్వాసం, భగవంతుడిలో నమ్మకంతో నడుపుతున్నామా అన్నదాని మీద ఆధారపడి ఉంది. భగవంతుడిపట్ల గల ప్రేమ మీద మనం మనస్సును ఏకాగ్రం చేస్తే జీవితం చాలా సరళమౌతుంది. అప్పుడు మనం మంచి చేయాలనుకుంటాము, మంచిగా ఉండాలనుకుంటాము; ఎందుకంటే మనమెక్కడ నుంచి వచ్చామో ఆ భగవంతుని నుండి శాంతి, జ్ఞానము, ఆనందాలు మనలోకి జాలువారుతున్నట్టు మీరు కనుగొంటారు.

మన జీవితాలు ఆనంద స్వరూపుడైన భగవంతునిలో జీవించాలని ఎంత తరచుగా పరమహంసగారు మాచేత ఇలా మననం చేయించేవారో:

నేను ఆనందం నుంచి వచ్చాను. ఆనందంలోనే జీవిస్తున్నాను, కదులుతున్నాను, అందులోనే నా అస్తిత్వం ఉంది. ఆ పవిత్రానందంలోనే నేను మళ్ళీ లీనమైపోతాను.

ఈ సత్యాన్ని పట్టుకో౦డి, మీ జీవితంలో ఏ౦ జరిగినా ఫరవాలేదు, ఆ ఆనందం మీ అంతరంగాన్ని ఎలా పోషిస్తు౦దో మీరు చూస్తారు. ఎప్పుడూ మారుతూ ఉండే ఈ చిత్రదర్శిని వంటి ప్రపంచం కంటే ఆ ఆనందమే మీకు ఎక్కువ వాస్తవమైనదిగా తెలుస్తుంది.

ఇతరులతో షేర్ చేయండి