గురుపూర్ణిమ 2012

ప్రియతములారా,

ఈ పూజ్యమైన గురు పూర్ణిమ రోజున, వారి గురువుకు గౌరవపూర్వక భక్తిని అందించే భారతీయ సంప్రదాయాన్ని అనుసరించే భక్తులందరితో మేము కలుస్తాము. మన ప్రియమైన గురుదేవులైన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారిపై దృష్టి సారించి, ఆయన తన అపరిమితమైన ప్రేమ మరియు వివేకం నుండి ప్రతి శిష్యునికి ఎడతెగని కృపను అందించినందుకు మేము ఆయనను ఆరాధిస్తాము. “ఒక వ్యక్తి పారవశ్యకరమైన దివ్యప్రేమ యొక్క సర్వశక్తిమంతమైన సామర్థ్యాన్ని వ్యక్తీకరించగలిగినప్పుడు, అది ఇతరుల జీవితాలలో దివ్యప్రేమ యొక్క సజీవ హృదయాన్ని మేల్కొల్పుతుంది” అని ఆయన చెప్పారు. ఆయన మాటలు మరియు ఆశీర్వాదాలలో మనలను ఉద్ధరించి దేవుని సన్నిధికి చేర్చగల ఒక స్పష్టమైన ప్రకంపన సామర్థ్యం ఉంది. “విముక్తి పొందిన గురువులు అనంతత్వపు సర్వవ్యాప్తిలో నిర్బంధం లేకుండా ఉంటారు. శారీరక మరణం తర్వాత కూడా వారి ఆశీర్వాదాలను అందజేస్తాను” అని ఆయన మాకు చెప్పారు.

అంకితభావంతో ఉన్న శిష్యుడు నిజమైన గురువులో మానవ రూపంలో వ్యక్తమయ్యే దైవ ప్రేమను చూస్తాడని గురువుగారు మనకు బోధించారు. ఆయన వ్రాసిన ఈ మాటలను మీ హృదయంలోకి గ్రహించండి:

స్నేహితుల యొక్క స్వచ్ఛమైన ప్రేమలో పాక్షికంగా కనిపించే అదృశ్యమైన దేవుడిని చూస్తారు, కానీ గురువులో అతను వాస్తవంలో ప్రత్యక్షమవుతాడు. గురువు ద్వారా, నిశ్శబ్దమైన దేవుడు బహిరంగంగా మాట్లాడతాడు. అవ్యక్తుడైన భగవంతుడి కోసం హృదయం ఉప్పొంగగా ఆయన సాక్షాత్తు గురువుగా వస్తే అంతకంటే గొప్ప సంతృప్తి ఏముంటుంది?… శిష్యుడు చీకటి మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు ప్రకాశమార్గాన్ని అనుసరించడానికి సహాయం చేయాలనే గురువు కోరికతో భగవంతుడు భక్తుని విముక్తి అనే తన కోరికను కలుపుతాడు. భగవంతుడు పంపిన గురువును అనుసరించేవాడు భగవంతుని నిత్య వెలుగులో నడుస్తాడు. మౌనం గురువు స్వరం ద్వారా వ్యక్తమవుతుంది; గురువు దైవ-సాక్షాత్కారంలో అవ్యక్తమైనది వ్యక్తమవుతుంది….

గ్రహణశీలత కలిగిన వారు భగవంతుని యొక్క ఉన్నత చైతన్యంలోకి రవాణా చేయబడినట్లు – గురువు తన మాటలతో దైవానుభవం వారి హృదయాలు మరియు మనస్సులలోకి పోసినట్టు భావిస్తారు. గాఢమైన, ఆరాధనాత్మకమైన ధ్యానం అనే అంతరంగ ఆలయంలో గురువు యొక్క అనుగ్రహాన్ని అతను పిలిచినప్పుడల్లా ఈ అనుభూతి భక్తుని చైతన్యాన్ని అత్యున్నతంగా నింపుతుంది.

ఈ సందర్భంగా మీరు గురువు యొక్క జ్ఞాన బోధల “స్వరాన్ని” నిష్టగా, శ్రద్ధగా వింటే, మీ దైనందిన జీవితంలో ఆయన పరివర్తక ఉనికిని మీరు క్రొత్తగా గ్రహించాలని నేను ప్రేమపూర్వక ప్రార్థనలు చేస్తున్నాను; మరియు దివ్య సంసర్గానికి గురువుగారు ఇచ్చిన యోగ పద్ధతులను అంకితభావంతో సాధన చేయండి. ఆయన ఆశీర్వాదాల సమృద్ధికి మీ హృదయం ఎప్పుడూ పూర్తిగా తెరిచి ఉండుగాక. జై గురు!

దేవుడు మరియు గురుదేవుల దివ్య ప్రేమతో,


శ్రీ శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2012 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులూ ఆరక్షితమైనవి.

ఇతరులతో షేర్ చేయండి