శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు
“దేవుని గురించి ఎల్లవేళలా ఆలోచించడం ఆచరణీయంగా అనిపించదు,” అని ఒక సందర్శకుడు వ్యాఖ్యానించాడు. పరమహంసగారు ఇలా బదులిచ్చారు:
“ప్రపంచం మీతో ఏకీభవిస్తుంది, అయితే ఈ ప్రపంచం సంతోషకరమైన స్థలమా? భగవంతుణ్ణి విడిచిపెట్టే మనిషికి నిజమైన ఆనందం దూరమవుతుంది, ఎందుకంటే ఆయనే పరమానందం కాబట్టి. భూమి మీద ఆయన భక్తులు శాంతి యొక్క అంతర్గత స్వర్గంలో జీవిస్తారు; కానీ ఆయనను మరచిపోయిన వారు తమకు తాము సృష్టించుకున్న అభద్రత మరియు నిరాశలతో తమ రోజులు గడుపుతారు. ప్రభువుతో ‘స్నేహ౦ చేయడ౦’ నిజ౦గా ఆచరణీయమే!”

భగవంతునితో సాన్నిహిత్యం పెంపొందించుకోండి. మీ ఆప్త మిత్రడిని మీరు తెలుసుకున్నట్లే దేవుణ్ణి తెలుసుకొనడం కూడా సాధ్యమే. ఇది నిజం.

మొదట మీరు భగవంతుడి గురించి సరియైన భావన కలిగి ఉండాలి – ఒక నిశ్చితమైన ఆలోచన ద్వారా మీరు ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి – ఆపై మీరు ధ్యానం చేసి ఆ మానసిక భావన నిజమైన అవగాహనగా మారే వరకు ప్రార్థించాలి. అప్పుడు మీరు ఆయనను తెలుసుకుంటారు. మీరు పట్టు విడువకుండా ఉంటే, ప్రభువు వస్తాడు.

అజ్ఞానపు అపోహతో, శిక్షా జ్వలనంతో మనిషిని నిర్దాక్షిణ్యంగా పరీక్షించే వ్యక్తిగా, మానవుని చర్యలను నిర్దయగా నిశిత పరీక్షతో పరిశీలించి తీర్పునిచ్చే వ్యక్తిగా సృష్టికర్తను కొంతమంది చిత్రీకరిస్తారు. ఆ విధ౦గా వారు, ప్రేమపూర్వకంగా, దయ చూపించే దివ్యలోకపు తండ్రిగా దేవుని యొక్క నిజమైన భావనను కఠినాత్ముడిగా, నిరంకుశుడిగా మరియు ప్రతీకార నిర్దయుడిగా తప్పుడు ప్రతిరూపం కల్పిస్తూ వక్రీకరిస్తారు. కానీ భగవంతునితో అనుసంధానం పొందిన భక్తులకు, ఆయన సకల ప్రేమకు, మంచితనానికి అనంత భాండాగారమైన కరుణామయుడిగా కాకుండా వేరే విధంగా భావించడం మూర్ఖత్వమని తెలుసు.

భగవంతుడు శాశ్వత పరమానందం. ఆయన అస్తిత్వం ప్రేమ, జ్ఞానం మరియు ఆనందం. భగవంతుడు వ్యక్తిగతంగాను మరియు అవ్యక్తంగాను ఉంటాడు, అంతేకాక తనను తాను తనకు నచ్చిన విధంగా సాక్షాత్కరించుకుంటాడు. తన సాధుపుంగవుల ప్రతి ఒక్కరికి వారి ఇష్ట రూపంలో దర్శనమిస్తాడు: ఒక క్రైస్తవుడు క్రీస్తును దర్శిస్తాడు, ఒక హిందువు కృష్ణుడిగా లేదా జగన్మాతగా మరియు వివిధ రూపాలలో దర్శిస్తాడు. అవ్యక్తంగా ఆరాధించే భక్తులు, భగవంతుడిని అనంతమైన కాంతిగా లేదా ఓం అనే ఆది నాదమైన పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన ధ్వనిగా చేతన పొందుతారు. దివ్యత్వం యొక్క ప్రతి ఇతర అంశం – ప్రేమ, జ్ఞానం, అమరత్వం – పూర్తిగా కలిగి ఉన్న ఆనందాన్ని అనుభూతి చెందడం, మనిషి పొందే అత్యున్నత అనుభవం.

కానీ భగవంతుని స్వభావాన్ని నేను మాటల్లో మీకు ఎలా చెప్పగలను? ఆయన అనిర్వచనీయుడు, వర్ణింపశక్యముగానివాడు. గాఢమైన ధ్యానంలో మాత్రమే మీరు ఆయన విశిష్ట సారాన్ని తెలుసుకోగలుగుతారు.
ప్రతిజ్ఞ
ప్రతిజ్ఞ యొక్క సిద్ధాంతం మరియు సూచనలు

“ప్రతి ఆలోచన, కార్యకలాపాల ఆలయంలో నిన్ను కనుగొనేలా నన్ను ఆశీర్వదించు. లోపల నిన్ను కనుగొని, బయట సకల జనులలోను, అన్ని పరిస్థితులలోనూ నిన్ను కనుగొంటాను.”
– శ్రీ శ్రీ పరమహంస యోగానంద,
మెటాఫిజికల్ మెడిటేషన్స్
మరింతగా అన్వేషించడానికి
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి దేవుడితో మాట్లాడ్డం ఎలా
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి మానవుడి నిత్యాన్వేషణ, "ఈశ్వరా, నీ ప్రేమతో మమ్మల్ని సొంతం చేసుకో"
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి మానవుడి నిత్యాన్వేషణ, "సమయాన్ని వృధా చేయడమెందుకు? భగవంతుడే మీరు వెతుకుతున్న ఆనందం"
- శ్రీ శ్రీ దయామాతగారి ప్రేమ మాత్రమే, "భగవంతుణ్ణి ప్రేమించడానికి గల ప్రాముఖ్యం"
- శ్రీ శ్రీ దయామాతగారి Finding The Joy Within You, "Living a God-Centered Life"
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి వెలుతురున్న చోట, "చరమ లక్ష్యము"