ఆధ్యాత్మిక అన్వేషణలో గురువు పాత్ర

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు

గురువు యొక్క పాత్ర

గురు గీత (17వ శ్లోకం)లో గురువును “చీకటిని పారద్రోలేవాడు” (గు, “చీకటి” మరియు రు, “తొలగించేవాడు”) అని సముచితంగా వర్ణించబడింది. నిజమైన, దివ్య జ్ఞానసంపన్నుడైన గురువు, తాను స్వీయ-నియంత్రణ సాధించడం వలన, సర్వవ్యాపకమైన పరమాత్మతో ఏకత్వము అనుభూతము చెందినవాడు. అటువంటి గురువు సాధకుని అంతర్ముఖ ప్రయాణంలో అతని లేదా ఆమెను పరిపూర్ణత వైపు నడిపించడానికి ప్రత్యేకమైన అర్హత కలవాడు అవుతాడు.

“గ్రుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు,” అన్నారు పరమహంసగారు. “భగవంతుణ్ణి తెలుసుకున్న గురువు మాత్రమే, పరమాత్ముని గురించి ఇతరులకు సరిగా బోధించగలడు. మన యొక్క దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి అటువంటి ఉపదేశకుడు లేదా గురువు ఉండాలి. నిజమైన గురువును విశ్వాసముగా అనుసరించేవాడు అతనిలా అవుతాడు, ఎందుకంటే శిష్యుడిని తన స్వీయ సిద్ధి స్థాయికి పెంచడానికి గురువు సహాయం చేస్తాడు.”

స్నేహం యొక్క అత్యున్నత వ్యక్తీకరణ గురు-శిష్య సంబంధం, ఎందుకంటే ఇది షరతులు లేని దివ్యప్రేమ మరియు జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఇది అన్ని సంబంధాలలోకెల్లా సర్వోత్క్రుష్టమైనది మరియు అత్యంత పవిత్రమైనది. క్రీస్తు ఆయన శిష్యుల౦దరూ పరమాత్మలో ఒక్కటే, అలాగే భగవంతుని దివ్య ప్రేమ యొక్క సహజ బంధం కారణంగా నా గురుదేవులు [స్వామి శ్రీయుక్తేశ్వర్] మరియు నేను అలాగే నాతో అనుసంధానమైనవారు కూడా పరమాత్మలో ఒక్కటే….ఈ సంబంధంలో పాలుపంచుకున్న వ్యక్తి జ్ఞానం మరియు స్వేచ్ఛ మార్గంలో ప్రయాణిస్తాడు.

సముద్రతీరంలో నిలబడి ఉన్న పరమహంస యోగానందగారు

జీవిత౦ యొక్క అన్ని ఇతర అ౦శ౦లోలాగే దైవ శోధనలో విజయ౦ సాధి౦చాల౦టే దైవ నియమాలను అనుసరి౦చడ౦ ఆవశ్యకం. ఒక పాఠశాలలో లభ్యమయ్యే లౌకిక జ్ఞానాన్ని అర్థ౦ చేసుకోవడానికి, అది తెలిసిన ఒక ఉపాధ్యాయుని ను౦డే మీరు నేర్చుకోవాలి. అదే విధంగా ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోవడానికి దైవ జ్ఞానము పొందిన ఆధ్యాత్మిక భోదకుడు లేదా గురువుని కలిగి ఉ౦డటం అవశ్యకం.

మీరు అంధకారంలో తడబడుతూ, జీవన లోయలో గుడ్డిగా సంచరిస్తున్నప్పుడు, మీకు ఎవరైనా కనులున్న వ్యక్తి సహాయం అవసరం. నీకు గురువు అవసరము. ప్రపంచంలో సృష్టించబడిన గొప్ప అలజడి నుండి బయటపడటానికి, జ్ఞానోదయం పొందిన వ్యక్తిని అనుసరించడమే ఏకైక మార్గం. నా పట్ల ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న, నాకు మార్గనిర్దేశం చేసే జ్ఞానం కలిగిన నా గురువును కలుసుకునే వరకు నేను నిజమైన ఆనందాన్ని, స్వేచ్ఛను కనుగొనలేదు.

మీ హృదయంలో నిరంతరం దేవుని కోసం తపించండి. మీరు ప్రభువు పట్ల మీ ఆకాంక్షను నిరూపించినప్పుడు, ఆయనను ఎలా తెలుసుకోవాలో మీకు బోధించడానికి ఆయన ఎవరినైనా ఒకరిని — మీ గురువును — పంపుతాడు. భగవంతుణ్ణి ఎరిగినవాడు మాత్రమే ఆయనను ఎలా తెలుసుకోవాలో ఇతరులకు చూపించగలడు. అలాంటి వ్యక్తి, నా గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారిని నేను కనుగొన్నప్పుడు, భగవంతుడు మర్మము ద్వారా కాకుండా, జ్ఞానోదయమైన ఆత్మల ద్వారా బోధిస్తాడని నేను గ్రహించాను. భగవంతుడు అగోచరుడు, కాని ఆయనతో నిరంతర అనుసంధానంలో ఉన్న వ్యక్తి యొక్క జ్ఞానము మరియు ఆధ్యాత్మిక అవగాహన ద్వారా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఒకరి జీవితంలో చాలా మంది ఉపదేశకులు ఉండవచ్చు, కానీ గురువు మాత్రం ఒకరే ఉంటారు. ఏసు జీవిత౦లో ప్రదర్శి౦చబడినట్లుగా, బాప్టిస్ట్ గా యోహానును తన గురువుగా అ౦గీకరి౦చినప్పుడు, గురు శిష్యుల స౦బ౦ధ౦లో ఒక దివ్య శాసనము నెరవేరింది.

ఎవరైతే దైవసాక్షాత్కారం పొంది, మరియు ఆత్మలను విముక్తం చేయుటకు భగవంతుని ద్వారా ఆదేశింపబడతాడో ఆయన మాత్రమే గురువు. కేవలం తాను అనుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి గురువు కాలేడు. నిజమైన గురువు కేవల౦ దేవుని ఆజ్ఞ అనుగుణంగా పనిచేస్తాడని ఏసు చూపి౦చాడు, ఆయనిలా అన్నాడు: “నన్ను ప౦పిన త౦డ్రి పంపితే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు.” ఆయన దైవ సంకల్పానికే పూర్తి ఘనతను అపాదించాడు. ఒక బోధకుడు కనుక అహంకార రహితుడైతే, ఈశ్వరుడు మాత్రమే ఆతని శరీర మందిరంలో నివసిస్తున్నాడని మీరు గ్రహించవచ్చు; మరియు మీరు ఆయనతో అనుసంధానమైనపుడు భగవంతునితో మీరు అనుసంధానము పొందుతారు. ఏసు తన శిష్యులకు ఇలా గుర్తుచేశాడు: “నన్ను అంగీకరించువాడు, నన్ను గాక, నన్ను పంపినవానినే (పరమాత్మను) స్వీకరించును.”

ఇతరుల యొక్క ఆరాధనను స్వీయ స్వీకారమొందే బోధకుడు కేవలం తన సొంత అహం యొక్క ఆరాధకుడు మాత్రమే. ఒక మార్గం సత్యమైనదా కాదా అని తెలుసుకోవడానికి, దాని వెనుక ఎటువంటి బోధకుడు ఉన్నాడో, ఆయన చేసే పనులు భగవంతునిచే నడిపించబడ్డవా లేదా స్వంత అహంతో నడిపించబడ్డవా అనే విచక్షణతో తెలుసుకొనండి. ఆత్మసాక్షాత్కారం పొందని నాయకుడు, అతని శిష్యగణం ఎంత పెద్దదైనా, దైవ సామ్రాజ్యాన్ని మీకు చూపించలేడు. చర్చిలన్ని మేలే చేశాయి, కానీ మతపరమైన సిద్ధాంతంపై గుడ్డి నమ్మకం ప్రజలను ఆధ్యాత్మిక అజ్ఞానులుగాను మరియు స్తబ్దులుగానూ ఉంచుతుంది. భారీ ప్రార్థనా సమావేశాలలో దేవుని నామాన్ని కీర్తించడం నేను చాలాసార్లు చూశాను, కానీ దేవుడు వారి చేతనకు సుదూర నక్షత్రాల వలె దూర౦గా ఉన్నాడు. కేవలం చర్చికి హాజరు కావడం ద్వారా ఎవరూ సంరక్షింపబడరు. స్వేచ్ఛకు నిజమైన మార్గం యోగం, శాస్త్రీయమైన స్వీయ విశ్లేషణతో, మరియు మతపరమైన ఛాందస వాదన అనే అడవిని దాటించి మిమ్మల్ని సురక్షితంగా భగవంతుని వద్దకు తీసుకెళ్ళగల వ్యక్తిని అనుసరించడంలో ఉంది.

సత్యం యొక్క సజీవ స్వరూప౦

వ్యక్తుల ప్రగాఢ ప్రార్థనలకు ప్రతిస్పందనగా వారికి సహాయం చేయడానికి దేవునిచే నియుక్తమైనవాడు గురువు, అటువంటి గురువు ఒక సామాన్య ఉపదేశకుడు కాదు; ఆతని శరీరం, వాక్కు, మనస్సు, మరియు ఆధ్యాత్మికతను దారి తప్పిన ఆత్మలను ఆకర్షించడానికి మరియు తన అమరత్వ గృహానికి తిరిగి మార్గనిర్దేశం చేయడానికి భగవంతుడు గురువును ఒక వాహకంగా వినియోగిస్తాడు. సత్యాన్ని తెలుసుకోవాలనే అస్పష్టమైన అభిలాష ద్వారా మనము ప్రారంభంలో వివిధ బోధకులను కలుస్తాము. కానీ గురువు ధార్మిక సత్యానికి సజీవ ప్రతిరూపం మరియు దేహబంధం నుండి విముక్తి కోసం భక్తుని యొక్క నిరంతర విజ్ఞాపనలకు ప్రతిస్పందనగా భగవంతుడు నియమించిన మోక్ష ప్రతినిధి.

సత్ సాంగత్యం, సాధువుల సాంగత్యం, భగవంతుని దూతల పట్ల భక్తితోనూ మాయ నాశన౦ కావింపబడుతు౦ది. కేవలం సాధువుల గురించిన ఆలోచన కూడా మాయను పరిహరించటానికి మీకు సహాయపడుతుంది. దేవుని దూతతో వ్యక్తిగత సహవాసం కన్నా చాలా వరకు మన ఆలోచనలను ఆయనతో అనుసంధానం చేయడంతోనే మాయ హరిస్తుంది. నిజమైన గురువుకు ఇతరుల హృదయాలలో తనను తాను నిలుపుకోవాలనే కోరిక ఉండదు, వారి చేతనలో భగవంతుని చేతనను మేల్కొల్పడమే వారి కోరిక. గురుదేవులు [స్వామి శ్రీయుక్తేశ్వర్గ గారు] అలాంటివారు: ఆయన మాలో ఒక్కరుగా ఉండేవారు — ఆయన తన గొప్పతనాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆశ్రమంలో ఎవరైనా గుర్తింపు లేదా ఉన్నత అధికార పీఠం కావాలనుకుంటే, గురుదేవులు అతనికి ఆ పదవిని ఇచ్చేవారు. కాని నేను గురువుగారి హృదయాన్ని, ఆయనలోని దివ్య చైతన్యాన్ని కోరుకున్నాను; తత్ ఫలితంగా, వారు నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. మహా పురుషులతో మీరు కోరుకోవలసిన అనుసంధానము అదే.

మా గురుదేవులు నాతో ఇలా అన్నారు: “నీవు అత్యల్ప మానసిక స్థితిలో ఉన్నా, లేదా జ్ఞానం యొక్క అత్యున్నత స్థాయిలో ఉన్నా సరే, ఇప్పటి నుండి శాశ్వతంగా నేను నీకు స్నేహితుడిగా ఉంటాను. నీవు తప్పుచేసినా నేను నీ స్నేహితుడిగానే ఉంటాను, ఎందుకంటే ఇతర సమయాల్లో కంటే అపుడే నీకు నా స్నేహం ఎక్కువ అవసరం.”

నేను మా గురువుగారి బేషరతు స్నేహాన్ని అంగీకరించినప్పుడు, ఆయన ఇలా అన్నారు: “నీవు అదే బేషరతు ప్రేమను నాకు ఇస్తావా?” శిశుతుల్యమైన నమ్మకంతో ఆయన నా వైపు చూశారు.

“గురుదేవా! మిమ్మల్ని అనంతకాలం శాశ్వతంగా ప్రేమిస్తాను.”

“కోర్కెల్లోకి తృప్తుల్లోకీ గుప్తంగా వేళ్ళు పారిన మామూలు ప్రేమ స్వార్ధంతో కూడుకున్నది. కాని దివ్య ప్రేమ షరతులు లేనిది, ఎల్లలు లేనిది, మార్పులేనిదీ. స్థిరపరిచే లక్షణం గల విశుద్ధ ప్రేమ స్పర్శతో మానవ హృదయ చాంచల్యం మటుమాయమయిపోతుంది.” నమ్రతతో, ఆయన ఇంకా ఇలా అన్నారు: “నేనెప్పుడైనా దైవసాక్షాత్కార స్థితినించి దిగజారుతున్నట్టు కనుక నీకు కనిపిస్తే, నువ్వు నా తల ఒళ్ళో పెట్టుకొని, మనమిద్దరం కొలిచే విశ్వప్రేమమయుడైన భగవంతుడి సన్నిధికి మళ్ళీ నన్ను తీసుకువస్తావని మాట ఇయ్యి.”

మేము ఈ ఆధ్యాత్మిక ఒడంబడిక చేసుకున్న తరవాతనే శిష్యుడుగా నా గురువు యొక్క ప్రాముఖ్యతను నేను పూర్తిగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నా గురువు యొక్క దివ్య చేతన పట్ల బేషరతు విశ్వసనీయత మరియు భక్తితో నన్ను నేను అనుసంధానం చేసుకునే వరకు నేను సంపూర్ణ తృప్తి, అనుసంధానం మరియు దైవ సంపర్కం పొందలేదు.

ఉత్తమ దాత

భగవంతుడు లోకానికి తన జ్ఞానోదీప్తులైన భక్తుల ద్వారా మాత్రమే బహిర్గతమవుతాడు. కాబట్టి, మీ ఆత్మ యొక్క కోరికకు ప్రతిస్పందనగా భగవంతుడు మీ దరికి పంపిన గురువు యొక్క సంకల్పానికి అనుగుణంగా ఉండటమే సకల చర్యలలో శ్రేష్ఠమైనది. అలాగని ఆయన స్వయం ప్రకటిత గురువు కాదు; ఇతరులను తిరిగి తన వద్దకు తీసుకురమ్మని భగవంతునిచే అదేశింపబడ్డ గురువు ఆయన. రవ్వంత ఆధ్యాత్మిక కోరిక ఉన్నా, భగవంతుడు మిమ్మల్ని మరింత ప్రేరేపించడానికి పుస్తకాలు మరియు బోధకులను పంపుతాడు; మరి మీ కోరిక గాఢమైనపుడు, ఆయన నిజమైన గురువును పంపుతాడు….

తమ అనుచరులు ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉండాలని, తక్షణ విధేయత చూపడానికి సిద్ధంగా ఉండాలని ఆశించే బోధకులున్నారు; అలా చేయకపోతే, వారు ఆగ్రహమొందుతారు. కానీ భగవంతుణ్ణి తెలుసుకున్న ఆధ్యాత్మిక బోధకుడు, సరైన గురువు అయినవాడు తనను తాను బోధించేవాడుగా అస్సలు భావించడు. ఆయన ప్రతి ఒక్కరిలోనూ దేవుని ఉనికిని చూస్తాడు, కొ౦తమ౦ది విద్యార్థులు ఆయన అభీష్టమును విస్మరిస్తే వారిపై ఎటువంటి తిరస్కారము చూపడు. నిజమైన గురువు యొక్క జ్ఞానంతో అనుసంధానమైన వారికి గురువు సాయపడడం వీలవుతుందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. “అది గ్రహించిన (గురువు నుండి వచ్చిన జ్ఞానాన్ని) నీవు, ఓ అర్జునా! మళ్ళీ మాయలో పడవు.”

గురువు మరియు శిష్యుల మధ్య ఉన్న స్నేహం శాశ్వతమైనది. ఒక శిష్యుడు గురువు యొక్క శిక్షణను స్వీకరించినప్పుడు, సంపూర్ణ శరణాగతి ఉంటుంది, నిర్బంధముండదు.

1935లో శ్రీయుక్తేశ్వర్ గారు మరియు పరమహంస యోగానందగారు

ఈ లోకంలో నా గురుదేవులతో నాకున్న సంబంధానికి మించిన గొప్ప సంబంధమేదీ నేను ఆలోచించలేను. ప్రేమ యొక్క సర్వోత్కృష్ట రూపంలో గురు-శిష్య సంబంధం ఉంటుంది. హిమాలయాల్లో భగవంతుణ్ణి మరింత విజయవంతంగా అన్వేషించగలనని భావించి, నేను ఒకసారి వారి ఆశ్రమాన్ని విడిచిపెట్టాను. నేను తప్పుగా భావించాను; మరి నేను తప్పు చేశానని త్వరలోనే గ్రహించాను. అయినప్పటికీ నేను తిరిగి వచ్చినప్పుడు, నేను ఎన్నడూ విడిచిపోనట్లుగానే ఆయన నన్ను ఆదరించారు. గురుదేవుల పలకరింపు చాలా సాధారణంగా ఉంది; ఆయన నన్ను మందలించుటకు బదులు, “మనం ఈ పూట ఏమి తినాలో చూద్దా౦” అని ప్రశా౦త౦గా అన్నారు.

“కానీ గురుదేవా, వెళ్ళిపోయినందుకు నా మీద మీకు కోపం లేదా?” అన్నాను.

“నాకెందుకు వుంటుంది?” అని జవాబిచ్చారు. “నేను ఇతరుల నుండి ఏమీ ఆశించను, కాబట్టి వారి చర్యలు నా కోరికలకు విరుద్ధంగా ఉండవు. నేను నిన్ను నా స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోను; నీ నిజమైన ఆనందంలో మాత్రమే నేను సంతోషంగా ఉంటాను.”

ఆయన అలా అన్నప్పుడు, నేను ఆయన కాళ్ళపై పడి, “మొదటిసారిగా నన్ను నిజ౦గా ప్రేమి౦చే వ్యక్తి ఒకరున్నారు!” అని రోదించాను…

నేను దేవుడిని వెతుక్కుంటూ ఆశ్రమం నుంచి పారిపోయినా, నాపై ఆయనకున్న ప్రేమ మాత్రం మారలేదు. ఆయన నన్ను మందలించలేదు….ఎవరకీ నాపై ఇంత ఆసక్తి ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. గురుదేవులు నన్ను నన్నుగా ప్రేమించారు. ఆయన నాలో పరిపూర్ణతను కోరుకున్నారు. నేను అత్యంత సంతోషంగా ఉండాలని ఆశించారు. అదే ఆయన ఆనందం. నా హృదయం కోరుకునే జగన్మాతతో ఉండటానికి; నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఆయన కోరుకున్నారు.

దయ మరియు ప్రేమ మార్గంలో నిరంతరం నన్ను నడిపించాలని కోరుకోవడం? అది ఆయన వ్యక్త౦ చేసిన దివ్య ప్రేమ కాదా? గురువుకు, శిష్యుడికి మధ్య ఆ ప్రేమ పెంపొందినప్పుడు, శిష్యుడికి గురువును మోసగించాలనే కోరిక ఉండదు, గురువు శిష్యునిపై నియంత్రణనూ కోరుకోడు. సర్వోత్కృష్టమైన హేతు, వివేకాలు వారి సంబంధాన్ని నియంత్రిస్తాయి; ఇలాంటి ప్రేమ ఎక్కడా ఉండదు. నా గురుదేవుల నుండి అటువంటి ప్రేమను రుచి చూశాను.

గురువు మేలుకొన్న భగవంతుడు, శిష్యునిలో నిద్రిస్తున్న భగవంతుణ్ణి మేల్కొలుపుతాడు. కరుణ మరియు లోతైన దర్శనశక్తి ద్వారా, నిజమైన గురువు శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక అభాగ్యులలోని బాధను వీక్షిస్తాడు, అందుకే వారికి సహాయం చేయడం తన ఆహ్లాదకరమైన కర్తవ్యంగా భావిస్తాడు. ఆకలితో అలమటిస్తున్న భగవంతునికి అభాగ్యుల్లో అన్నం పెట్టడానికి, నిద్రపోతున్న భగవంతుణ్ణి అజ్ఞానుల్లో ఉత్తేజపరచడానికి, శత్రువులో అపస్మారక స్థితిలో ఉన్న భగవంతుడిని ప్రేమించడానికి, గాఢ ఆకాంక్షగల భక్తుడిలో సగం నిద్రలో ఉన్న భగవంతుణ్ణి మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాడు. మరియు మృదువైన ప్రేమస్పర్శతో, గురువు పరిణితిపొందిన సాధకునిలో దాదాపు పూర్తిగా మేల్కొన్న భగవంతుడిని క్షణంలో జాగృతం చేస్తాడు. మానవులందరిలో, ఉత్తమ దాతగురువు. పరమాత్మునిలా, ఆతని దాతృత్వానికి హద్దులు లేవు.

గురు వాగ్దానం

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు చిత్తసుద్ధితో అంతర్గత ఆధ్యాత్మిక సహాయం ఆశిస్తూ వచ్చిన వారందరూ భగవంతుడి నుండి కోరినదాన్ని పొందుతారు. నేను ఈ శరీరంలో ఉండగా వచ్చినా, ఆ తర్వాత వచ్చినా, వై.ఎస్.ఎస్. గురు శ్రేణి ద్వారా భగవంతుని శక్తి భక్తుల్లోకి ప్రవహించి, వారి మోక్షానికి కారణం అవుతుంది….

వై.ఎస్.ఎస్. బోధనలను క్రమం తప్పకుండా, విశ్వసనీయంగా ఆచరించే భక్తులందరూ తమ జీవితాలు పావనమై పరివర్తనం చెందాయని గ్రహిస్తారు. తమ పట్టుదల, నిలకడలతో, ఈ మార్గం యొక్క నిజమైన భక్తులు విముక్తిని పొందుతారు. వై.ఎస్.ఎస్. సాధన ప్రక్రియలు మరియు బోధనలలో అంతర్లీనంగా వై.ఎస్.ఎస్. గురువుల సహాయ, ఆశీర్వాదాలు ఉంటాయి. వై.ఎస్.ఎస్. సిద్ధాంతాలకు అనుగుణంగా తమ జీవితాలను గడిపే భక్తులు వై.ఎస్.ఎస్. గురు శ్రేణి యొక్క అంతర్గత మరియు ప్రత్యక్ష మార్గదర్శంతో ఆశీర్వదించబడతారు. అమరులైన బాబాజీ చిత్తశుద్ధి గల వై.ఎస్.ఎస్. భక్తులందరి పురోగతిని పరిరక్షిస్తానని, మార్గనిర్దేశం చేస్తానని హామీ ఇచ్చారు. లాహిరీ మహాశయులు, శ్రీయుక్తేశ్వర్ గారు, వారి భౌతిక రూపాలను విడిచిపెట్టినా, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా — అందరూ వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క చిత్తశుద్ధి గల సభ్యులను పరిరక్షించి, నడిపిస్తారు.

పరమహంస యోగానందగారి చివరి చిరునవ్వు

భగవంతుడు నిన్ను నా దగ్గరికి పంపాడు. నేను నిన్ను ఎన్నటికీ విఫలం కానివ్వను….నేను గతించినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు నా సహాయం ఎల్లప్పుడూ లభిస్తుంది. భౌతికంగా నేను మీకు దూరంగా ఉన్నప్పుడు, నేను మీతో లేను అని ఒక్క క్షణం కూడా అనుకోకండి. నేను ఇప్పుడున్న ఈ దేహంలో లేనప్పుడు కూడా మీ ఆధ్యాత్మిక సంరక్షణ పట్ల అంతే గాఢంగా శ్రద్ధ చూపుతాను. నేను ఎల్లప్పుడూ మీలో ప్రతి ఒక్కరినీ గమనిస్తూనే ఉంటాను, అలాగే ఒక నిజమైన భక్తుడు తన ఆత్మ యొక్క నిశ్శబ్ద లోతుల్లో నన్ను గురించి ఆలోచించినప్పుడల్లా, నేను సమీపంలో ఉన్నానని అతను తెలుసుకుంటాడు.

మరింతగా అన్వేషించడానికి:

ఇతరులతో షేర్ చేయండి