ఒక ఆశాభావం: ప్రపంచ పరిస్థితి గురించి ఆధ్యాత్మిక దృక్కోణం

ప్రపంచం మరింత ఆధ్యాత్మికతను కలిగి ఉండే, ఉన్నత యుగాల వైపుకు పరిణతి చెందే క్రమంలో ఎటువంటి మార్పులకు లోనౌతుందో పరమహంస యోగానందగారు వివరించి అర్ధ శతాబ్ది దాటింది. ఆయన దీని విషయమై ఒక ప్రత్యేక కాల ప్రణాళిక ఏదీ ఇవ్వక పోయినా అటువంటి కష్ట కాలాన్ని ఎదుర్కోవడానికి తగిన ఆధ్యాత్మిక బోధ చేస్తూనే ఆచరణాత్మకమైన సలహాలు ఎన్నో ఇచ్చారు. పరమహంసగారి గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు తాను రచించిన ద హోలీ సైన్స్, అనే గ్రంథంలో అణుయుగం (ద్వాపర యుగం) మన భూమి జీవిత కాలంలో ఒక నూతన ఆరోహణ దశ అని వెల్లడించారు. అయితే ఇంతక్రితమే గడచిన అంధకార యుగ (కలి యుగం) ప్రభావం వర్తమాన నాగరికత మీద చాలా అధికంగా ఉంటుందని పరమహంసగారు స్పష్టం చేశారు. వేల ఏళ్ల భౌతికవాద ఆసక్తుల వల్ల ఏర్పడిన ఆలోచనా విధానం ప్రస్తుతం మనిషిని మనిషినుండి, దేశాన్ని దేశంనుండి వేరుచేసే ఇప్పటి విభిన్న ఆచారాలు, వ్యవహారాల్లో, మూఢ నమ్మకాల్లో ప్రతిఫలిస్తోంది. మానవజాతి పాతబడిన భ్రాంతులు, అసమతౌల్యాలు, వదిలించుకొనే క్రమంలో ఆయా సంఘాలు, దేశాలు ఎన్నో ఎత్తుపల్లాలగుండా ప్రయాణిస్తాయని, తద్ద్వారా ప్రపంచమంతటా జరిగే అభివృద్ధి కొంతకాలం పాటు అసమానంగా ఉంటుందని చెప్పారు.

ఈ విషయంలో పరమహంస యోగానందగారి సలహాను గురించి వివరిస్తూ, మన మూడవ అధ్యక్షులు శ్రీ శ్రీ దయామాతగారు — గురువుగారి మొట్టమొదటి సన్నిహిత శిష్యులలో ఒకరు — ఇలా అన్నారు:

“ఎప్పుడెప్పుడు ప్రపంచ పరిస్థితులు, లేదా నాగరికతలు గణనీయమైన మార్పుకు లోనవుతాయో అప్పుడు దానికి వెనుక సూక్ష్మమైన కారణం ఒకటి ఉంటుంది — వ్యక్తుల జీవితాల్లోనూ, స్థూలంగా అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ కర్మ సిద్ధాంతం దాగి ఉండి పని చేస్తుంటుంది, అని పరమహంస యోగానందగారు మాకు వివరించేవారు. మన వ్యక్తిగత జీవితాల్లో ఎదురయే సవాళ్ళకు సరైన దృక్పథం ఏమిటంటే, ‘దీనినుండి నేనేమి నేర్చుకోవాలి?’ అన్నది. అదే విధంగా ప్రపంచం మొత్తమూ తన పరిణామంలోని ఈ దశలో దైవం తనను ఏ పాఠాలు నేర్చుకొమంటున్నాడు అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంది.

“మానవజాతి సమతుల ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తూ, ప్రపంచమంతా ఒకే కుటుంబమన్న భావనతో కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. విజ్ఞానశాస్త్రంలో సాంకేతికం విస్ఫోటనం సంభవిస్తున్న ఈ శకంలో మనం అనుభవిస్తున్న ఒత్తిళ్ళు, మనను బాధ పెడుతున్న ఆందోళనలు మనం కాస్త ముందో వెనుకో ఈ పాఠాలు నేర్చుకొనేలా చేస్తాయి.

“చాలా ఏళ్ల క్రితమే పరమహంసగారికి ఇలా జరగనున్నదని తెలుసు, ఆ విషయం ఎన్నోసార్లు మాకు చెప్పారు: ‘ప్రపంచం నిరాడంబరంగా జీవనం సాగించే దశకు వెనక్కు మరలే రోజు వస్తోంది. ఈశ్వరుడి కోసం సమయం మిగుల్చుకోవడానికి మనం మన జీవితాలను సరళతరం చేసుకోవాల్సి ఉంది. మనం సోదర భావంతో జీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాగరికత ఉన్నత పరిణామ దశలకు చేరే కొద్దీ ప్రపంచం చిన్నదైపోతుంది. మూఢ విశ్వాసాలు, అసహనం పోవాలి.’

“నిజమైన శాంతి, ఆధ్యాత్మిక అవగాహనను పెంపొందించే ఈ లక్ష్యాలను, విలువలను అలవరచుకోవడానికి మనం సమయం పెడితే — వ్యక్తిగత కుటుంబాలకు, ప్రపంచ కుటుంబాలైన దేశాల మధ్య సంబంధాలకు కూడా — అది సాధ్యమవుతుందన్న ఆశ ఉంది.”

—శ్రీ శ్రీ దయామాత

“ఏసు ఇలా అన్నాడు: ‘తనకు వ్యతిరేకంగా తాను విడిపోయిన ఇల్లు నిలబడలేదు.’ విజ్ఞానశాస్త్రం దేశాలన్నిటినీ ఒకదానికొకటి సన్నిహితం చేసింది, అందువల్ల ఈ విశాల ప్రపంచం ఇప్పుడొక కుటుంబంలాగే ఉండి, ప్రతి ఒక సభ్యుడూ ఒకరితో ఒకరు సంబంధం కలిగి, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఒక చిన్న కుటుంబం కూడా కలిసి ఉండడం కష్టమైన నేటి విభజనపూరిత ప్రపంచ విధానాల్లో వసుదైక కుటుంబకం సాధ్యమయేదేనా? మనకు నిజంగా శాంతిని ఆధ్యాత్మిక అవగాహననూ పెంపొందించే ఆ విలువలనూ, లక్ష్యాలనూ పెంపొందించుకోవడానికి మనం సమయం పెడితే వ్యక్తిగత కుటుంబాలకూ, వివిధ దేశాలతో కూడిన ప్రపంచ కుటుంబానికీ కూడా ఐక్యత ఉంటుందనే ఆశ ఉంది.”

ఇతరులతో షేర్ చేయండి