శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి రచనల నుండి సారాంశాలు
గతంలో మీ ప్రార్థనలకు సమాధానం లభించకపోవడంతో మీరు నిరాశ చెంది ఉండవచ్చు. కానీ విశ్వాసాన్ని కోల్పోకండి….భగవంతుడు భావరహితుడు కాదు. ఆయనే ప్రేమ. ఆయనతో సంపర్కం పొందడానికి ధ్యానం ఎలా చేయాలో మీకు తెలిస్తే, మీ ప్రేమపూర్వక అభ్యర్థనలకు ఆయన ప్రతిస్పందిస్తాడు.

ప్రార్థనలో మొదటి నియమం ఏమిటంటే, న్యాయబద్ధమైన కోరికలను మాత్రమే భగవంతుడికి విన్నవించుకోవడం. రెండవది, బిచ్చగాడిలా కాకుండా, ఒక పుత్రునిగా వాటి ఫలసిద్ధి కోసం ప్రార్థించడం: “నేను నీ బిడ్డను. నీవు నా తండ్రివి. నువ్వూ నేనూ ఒకటే.” మీరు లోతుగా, నిరంతరంగా ప్రార్థి౦చినప్పుడు, మీ హృదయ౦లో ఒక గొప్ప ఆన౦ద౦ వెల్లివిరుస్తుంది. ఆ ఆనందం వ్యక్తమయ్యే వరకు తృప్తి చెందవద్దు; ఎప్పుడైతే మీ హృదయ౦లో పరిపూర్ణమైన ఆన౦దాన్ని అనుభవిస్తారో భగవంతుడికి మీ ప్రార్థనను ప్రసారం చేసినట్లుగా మీరు గ్రహిస్తారు. ఆ తర్వాత మీ త౦డ్రిని ఇలా ప్రార్థి౦చ౦డి: “ప్రభూ, ఇది నా అవసరం. నేను దాని కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను; దయచేసి నాకు మార్గనిర్దేశం చెయ్యి మరియు సరైన ఆలోచనలను కలిగి ఉండటానికి మరియు సఫలత కోసం సరియైన పనులను చేయడానికి నాకు సహాయం చెయ్యి. నేను నా వివేకాన్ని ఉపయోగిస్తాను మరి దృఢ నిశ్చయంతో పని చేస్తాను, కానీ నేను సరియైన పనులు చేయడానికి నా వివేకానికి, సంకల్పానికి మరియు కార్యాచరణలకు నీవు మార్గనిర్దేశం చెయ్యి.”

మీరు భగవంతుడి బిడ్డగా ఆయన్ని ఆత్మీయంగా ప్రార్థించాలి. అపరిచితుడిగా, బిచ్చగాడిగా మీ అహం నుండి ప్రార్థించినప్పుడు భగవంతుడేమీ అభ్యంతరం చెప్పడు, కానీ ఆ విధమైన చైతన్యంతో మీ ప్రయత్నాలు పరిమితం చేయబడ్డాయని మీరు కనుగొంటారు. మీరు మీ స్వీయ సంకల్పశక్తిని వదులుకోవాలని భగవంతుడు కోరుకోడు, ఆయన బిడ్డగా అది మీ దివ్య జన్మహక్కు.

మన అవసరాల స్వభావాన్ని బట్టి, ఎప్పుడు, ఎలా ప్రార్థించాలో ఖచ్చిత౦గా తెలుసుకోవడం ద్వారా, ఆశించిన ఫలితాలను వస్తాయి. సరైన పద్ధతిని అన్వయించినప్పుడు, అది దేవుని సరియైన నియమాలను అమలులోకి తెస్తుంది; ఈ నియమాల పనితీరు శాస్త్రీయమైన ఫలితాలను అందిస్తుంది.

ప్రార్థన తరచుగా భిక్షాటన యొక్క చైతన్యాన్ని సూచిస్తుంది. మన౦ బిచ్చగాళ్ళం కాదు, దేవుని బిడ్డల౦, కాబట్టి మనం దివ్య వారసత్వానికి అర్హులమవుతాము. మన ఆత్మలకు మరియు దేవునికి మధ్య ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, మన న్యాయబద్ధమైన ప్రార్థనలను నెరవేర్చమని ప్రేమపూర్వక౦గా కోరే హక్కు మనకు ఉ౦టు౦ది.

దేనికోసమైనా, ఎడతెగకుండా అర్థిస్తూ, అలుపెరగని ఉత్సాహంతో, మొక్కవోని ధైర్యసాహసాలతో, విశ్వాసంతో మానసికంగా గుసగుసలాడుతూ ఉంటే, అది ఒక క్రియాశీల శక్తిగా అభివృద్ధి చెందుతుంది. ఇది మనిషి యొక్క చేతన, అవచేతన, అధిచేతన శక్తుల మొత్తం వైఖరిని ప్రభావితం చేసి కోరుకున్న వస్తువును పొందుతుంది. మార్పులకు భయపడకుండా మానసిక గుసగుసల యొక్క ఆంతర్య పనితీరు నిరంతరంగా కొనసాగాలి, అప్పుడు కోరుకున్న వస్తువు సాకారమవుతుంది.
మరింతగా చదవడానికి
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి In the Sanctuary of the Soul: A Guide to Effective Prayer
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి, దేవుడితో మాట్లాడ్డం ఎలా
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి Journey to Self-realization లో "Receiving God's Answers to Your Prayers"
- శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి మానవుడి నిత్య అన్వేషణ లో "ఫలించిన ప్రార్థనలు"
- శ్రీ శ్రీ దయామాతగారి ప్రేమ మాత్రమే లో "ప్రార్థనకు సమయం, ఆత్మసమర్పణకు సమయం"
