వై.ఎస్.ఎస్. గురు పరంపర

భగవాన్ కృష్ణ

భగవాన్ కృష్ణ

శ్రీ కృష్ణ భగవానుడు భారతదేశమంతటా గొప్ప అవతార పురుషునిగా (భగవంతుని అవతారంగా) పూజింపబడతారు.
ఉత్కృష్టమైన ఆయన బోధనలు భగవద్గీతలో పొందుపరచబడ్డాయి. బహు ప్రశంసలు పొందిన తమ రెండు-సంపుటాల ‘గీతా’ వ్యాఖ్యానంలో పరమహంస యోగానందగారు ఇలా అన్నారు:

“భగవద్గీత భారతదేశ ప్రజలకెంతో ప్రీతికరమైన గ్రంథం. ఆధ్యాత్మిక గ్రంథాలకే తలమానికమైనది. ఆధ్యాత్మిక జ్ఞాన బోధకులందరు తమ ఆధ్యాత్మిక అవగాహనకు మూలాధారంగా భావించి ఆధారపడే ఏకైక గ్రంథం భగవద్గీత….”

“అత్యంత సంక్లిష్టమూ అనంతమూ అయిన నాలుగు వేదాల, నూట ఎనిమిది (108) ఉపనిషత్తుల, మరియు హిందూ మత సిద్ధాంతాన్ని విశదీకరించే ఆరు విధానాల పరిపూర్ణ సారాంశమే భగవద్గీత. ఈ బ్రహ్మాండానికి సంబంధించిన సమస్త పరిజ్ఞానం గీతలో పొందుపరచబడింది. అత్యంత నిగూఢమైన విషయ పరిజ్ఞానాన్ని కూడా, సులభ శైలిలో, ఊరటనిచ్చే ధోరణిలో, అతి సుందరంగా విపులీకరించి బోధించిన గీతను – జనావళి అర్థం చేసుకొని, వారివారి సమస్త భౌతిక, ఆధ్యాత్మిక ప్రయత్నాలలో అవలంబిస్తున్నారు. భిన్నమైన స్వభావాలతో, సమస్యలతో సతమతమవుతున్న ఎంతో మందికి భగవద్గీత స్వాంతనతో కూడిన ఆశ్రయాన్ని ఇస్తోంది. ఎక్కడెక్కడ, మనిషి భగవంతుని అన్వేషిస్తూ ప్రయాణిస్తాడో, ఆ మార్గంలో వెలుగును ప్రసరింపజేసి ముందుకు నడిపిస్తుంది భగవద్గీత….”

“తూర్పున, యోగవిద్యకు నిలువెత్తు దివ్య దర్పణం శ్రీకృష్ణుడు; దైవసాయుజ్యానికి ఒక ఉదాహరణగా పశ్చిమాన క్రీస్తును ఎంచుకున్నాడు భగవంతుడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి నేర్పిన క్రియాయోగ ప్రక్రియే భగవద్గీత నాల్గవ అధ్యాయంలో మరియు అయిదవ అధ్యాయంలోని 27, 28 శ్లోకాల్లో ఉదహరించబడిన జ్ఞానం – ఉన్నతమయిన ఆధ్యాత్మిక, యోగ, ధ్యాన విజ్ఞాన శాస్త్రము. ప్రాపంచిక విషయాలపై ప్రాధాన్యత పెరిగిన యుగాల్లో అంతర్ధానమైన – ఈ మహత్తరమైన, నాశరహితమైన, ఈ క్రియాయోగము మహావతార్ బాబాజీగారి ద్వారా మళ్ళీ పునరుద్ధరింపబడి, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గురువుల ద్వారా అందరికీ నేర్పబడుతున్నది.”

ఏసు క్రీస్తు

ఏసుక్రీస్తు

పరమహంస యోగానందగారి ఆశయాల్లో ముఖ్యమైన విషయం – “భగవాన్ శ్రీకృష్ణులు చెప్పిన యోగ మార్గానికి ఏసుక్రీస్తు ద్వారా చెప్పబడిన అసలైన క్రైస్తవ సిద్ధాంతాలకు బేధంలేదనీ; మరియు ఈ నిత్యసత్యమైన సూత్రాలు, నిజమైన మత మార్గాలన్నిటికీ పునాది స్థంభాలని చూపించడం.”

ఏసు సమస్త ప్రజానీకానికి – విశ్వాసం, ప్రేమ, క్షమ అనే సరళమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాలను ఆయన, తరచూ సులభతరమైన ఉపమానాలతోనూ, నిత్యసత్యమైన నీతి సూత్రాలతోనూ బోధించేవారు. కాని ఆయన సన్నిహిత శిష్యులకు మాత్రం, ప్రగాఢమైన సత్యాలను బోధించేవారు. ఆ సత్యాలకు, సనాతనమైన యోగ సిద్ధాంతాలలోని అధిభౌతిక విధానాలకూ అతి దగ్గర సంబంధం ఉంది.

“మీరు వాళ్ళకు ఉపమానాల రూపంలో ఎందుకు బోధిస్తారు?” అని ఆయన శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏసు ఇలా అన్నారు: “స్వర్గ సామ్రాజ్యపు రహస్యాలను అర్థం చేసుకునే సామర్ధ్యం మీకివ్వబడింది. వారికి ఇవ్వబడలేదు. వారు చూస్తున్నట్టే ఉంటారు కానీ చూడలేరు. వింటున్నట్టే ఉంటారు కానీ వినలేరు. అర్థం కూడా చేసుకోలేరు. అందుకే వారికి ఉపమానాల రూపంలో వివరిస్తాను.” (మాత్యూ 13:10, 11, 13 బైబిలు).

ఏసు స్వయంగా తెలియచేసిన బోధనల సంపూర్ణ అవగాహన, అలాగే ఆయన శిష్యులకు అనుగ్రహించిన యోగ, ధ్యాన సంబంధమయిన రహస్య ప్రక్రియలు అన్నీ కూడా – పరమహంస యోగానందగారు రచించిన లోతైన సువార్త వ్యాఖ్యానం: ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్: ది రిసరక్షన్ ఆఫ్ ది క్రైస్ట్ వితిన్ యూ (The Second Coming of Christ: The Resurrection of the Christ Within You) పుస్తకంలో చెప్పబడింది. ఈ పుస్తకం పరిచయ వాక్యాలలో యోగానందగారు ఇలా అన్నారు:

“ఏసుక్రీస్తు ఈనాటికీ క్రియాశీలకంగా మనమధ్యనే ఉన్నారు. ప్రపంచ పునరుద్దీపన కోసం, అదృశ్య స్ఫూర్తితో, అప్పుడప్పుడు మనుష్య రూపంలో జన్మించి కూడా జనావళికి అగుపడకుండా కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన స్వర్గంలో లభించే చైతన్యానందాన్ని తాను మాత్రం అనుభవించడంతో సంతృప్తి పడక ఆ ప్రేమను అందరికీ పంచాలనుకుంటున్నారు. దేవుని అఖండ సామ్రాజ్యంలోనికి అడుగుబెట్టడానికి కావలసిన స్వాతంత్ర్యం తన అనుచరులకు కూడా ఇవ్వాలని, ఆ సాన్నిధ్యం లభించక ఆరాటపడుతున్న మానవాళిని ఉద్ధరించాలని ఆయన అభిలషిస్తున్నారు. ఆయన ఒక విషయంలో నిరుత్సాహంతో ఉన్నారు. తన పేరు మీద దేవాలయాలు, చర్చిలు ఎన్నెన్నో వెలిసాయి. వాటిలో కొన్ని ఆర్థికంగా కూడా బలపడుతున్నాయి. కానీ వాటివల్ల తాను ఆశించిన ‘దైవ సాయుజ్యం’ జనావళికి లభించడం లేదు. దేవునితో ‘నిజమైన సాంగత్యం’ అనుభవంలోకి రావడంలేదు. ‘తమ తమ హృదయాలలో దేవాలయాలు ప్రతిష్టించుకోవాలి; ఆ తరువాతే భౌతికమైన దేవాలయాలు నిర్మించుకోవాలి’ అని ఏసు కోరుకుంటున్నారు. ‘కానీ అలా జరగడంలేదు. లెక్కలేనన్ని పెద్ద పెద్ద చర్చిలు వెలసి, గొప్ప గొప్ప భక్త సమావేశాలను ఏర్పాటు చేసి, జనాలను ‘చర్చితత్వం’ అనే మత్తులో ముంచెత్తుతున్నారు. కానీ అందులో ఎవ్వరికైనా వారు చేసే ప్రార్థనలవల్ల, ధ్యానం వల్లా క్రీస్తు సాంగత్యం లభిస్తోందా’ అని మధనపడుతున్నారు.

“క్రీస్తు, శ్రీకృష్ణుడు స్వయంగా బోధించిన దైవ-సాయుజ్య విధానాలను పునరుద్ధరించి తద్వారా మనుషుల హృదయాలలోనే దేవాలయాలను ప్రతిష్టించుకునేట్టు చేయించేందుకే మహావతార్ బాబాజీ నన్ను పాశ్చాత్య దేశాలకు పంపారు…..

“బాబాజీ శ్రీకృష్ణునితో ఎల్లప్పుడూ సంభాషిస్తూనే ఉంటారు. వారిరువురు కలసి, ఈ తరం మానవాళి, ఆధ్యాత్మికపరమైన మోక్షాన్ని పొందడం కోసం అణుగుణమైన ప్రకంపనలు పంపుతూ ఉంటారు.”

మహావతార్ బాబాజీ ఆధ్యాత్మిక గురువు

మహావతార్ బాబాజీ

మహావతార్ బాబాజీ పుట్టుక గురించిగాని, ఆయన జీవిత విశేషాలకు సంబంధించి గాని చారిత్రక ఆధారాలేమీ లేవు. పరమహంస యోగానందగారు రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకంలో, అమరులైన బాబాజీ హిమాలయాల్లోని గుహల్లో లెక్కపెట్టలేనన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారనీ, ఆశీస్సులు పొందిన కొద్దిమందికి మాత్రం, అప్పుడప్పుడు దర్శనమిచ్చే వారని చెప్పారు.

మరుగుపడిపోయిన, శాస్త్రీయమైన క్రియాయోగ ప్రక్రియను ఈ యుగంలో మళ్ళీ పనరుద్ధరించింది మహావతార్ బాబాజీయే. ఆయన తన శిష్యులైన లాహిరీ మహాశయులకు క్రియాయోగ దీక్షనిచ్చినప్పుడు ఇలా అన్నారు – “ఈ పందొమ్మిదవ శతాబ్దంలో, ప్రపంచానికి నీ ద్వారా నేనందిస్తున్న ఈ క్రియాయోగ – వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునునికిచ్చినదే; ఆ తర్వాత పతంజలి మహర్షి, ఏసు క్రీస్తు, ఇంకా సెయింట్ జాన్, సెయింట్ పాల్, మరి కొంతమంది శిష్యులు ఈ యోగం గురించి తెలుసుకున్నారు.”

1920లో పరమహంస యోగానందగారు అమెరికా వెళ్ళబోయే ముందు, మహావతార్ బాబాజీ కలకత్తాలోని వారి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో యువ సన్యాసి యోగానందగారు తాను చేపట్టబోతున్న మహత్కార్యం విజయవంతం కావడం కొరకు, భగవంతుని ఆశీర్వచనం కోరుతూ గాఢమైన ప్రార్థన చేస్తున్నారు. బాబాజీ ఆయనతో ఇలా అన్నారు: “మీ గురువుగారి ఆదేశాలను అనుసరించి అమెరికా వెళ్ళు. భయపడవద్దు, నీకు రక్షణ లభిస్తుంది. క్రియాయోగమును పాశ్చాత్యదేశాలలో వ్యాప్తి చేసే పనికి నేను ఎన్నుకున్నది నిన్నే.”

మహావతార్ బాబాజీ గురించి మరికొన్ని విషయాలు చదవండి: ఆధునిక భారతదేశపు యోగి-క్రీస్తు (యోగీశ్వరులు) బాబాజీ

మహావతార్ బాబాజీ ఆశీస్సులు

యోగావతార్ శ్యామచరణ్ లాహిరీ మహాశయులు క్రియాయోగా గురువు

లాహిరీ మహాశయ

లాహిరీ మహాశయ, భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రం, ఘుర్ణి గ్రామంలో, 1828 సెప్టెంబరు 30న జన్మించారు. తన ముప్ఫైమూడవ ఏట, ఒకరోజు హిమాలయాలలో రాణిఖేత్ సమీపంలో కాలినడకన వెలుతుంటే, ఆయన తన గురువుగారయిన మహావతార్ బాబాజీని కలిశారు. జన్మజన్మలుగా కలిసే ఉన్న ఆ ఇద్దరి దివ్యమైన కలయిక అది. నిద్రాణమైన శక్తిని మేల్కొలప గలిగే ఆయన యొక్క ఆశీర్వాదభరితమైన స్పర్శతో, లాహిరీ మహాశయులు ఆ దివ్య సాక్షాత్కారం యొక్క ఆధ్యాత్మిక ప్రకాశంలో మునిగిపోయారు, ఆ అనుభవము ఆయన జీవితాంతం వరకూ అంటిపెట్టుకుని ఉంది.

మహావతార్ బాబాజీ, ఆయనకు క్రియాయోగ దీక్షనిచ్చి, ఆ పవిత్రమైన ప్రక్రియను, శ్రద్ధగా సాధన చేయగల వారికందరికి ప్రసాదించ వలసిందిగా మార్గ నిర్దేశకం చేశారు. లాహిరీ మహాశయులు బెనారస్ లో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చి ఈ మహత్కార్యాన్ని పూర్తి చేయడానికి పూనుకున్నారు. ఈ విధంగా, ఈ కనుమరుగైన ప్రాచీన క్రియా విజ్ఞాన యోగ ప్రక్రియ యొక్క పునరుద్ధరణ, పంతొమ్మిదవ శతాబ్దం రెండవ భాగంలో ప్రారంభింపబడి, ఈనాటికీ కొనసాగడానికి కారకులైన లాహిరీ మహాశయులు, సమకాలీన ప్రపంచంలో, క్రియాయోగమును నేర్పగల్గిన మొట్టమొదటి గురువుగా, యోగ పునరుద్ధరణ చేసిన మహానుభావుల్లో ఒక ఉన్నత వ్యక్తిగా గౌరవింపబడుతున్నారు.

పరమహంస యోగానందగారు, “ఒక యోగి ఆత్మకథ” పుస్తకంలో ఇలా అన్నారు: “పూలవాసనని ఎవ్వరూ అణిచిపెట్టలేరు; అలాగే, ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరీ మహాశయులు, సహజ సిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు. భక్త భ్రమరాలు, ఈ విముక్త సిద్ధ పురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ, భారతదేశంలో ప్రతి బాగంనుంచీ రావడం మొదలుపెట్టాయి. సమతుల్యమైన, శాంతియుతమైన జీవితాన్ని గడుపుతున్న గొప్ప గృహస్థ గురువుగా, దేశంలోని వేలాది మంది స్త్రీ పురుషులకు, ఆయన ప్రేరణగా నిలిచిపోయారు.”

మన ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయగలిగే యోగమార్గం యొక్క ఉన్నత లక్ష్యాలను, లక్ష్యాలకు ఉదాహరణగా నిలిచి, లాహిరీ మహాశయులు “యోగవతార్”గా (యోగము యొక్క అవతారముగా) పూజించబడ్డారు.

పరమహంస యోగానందగారి తల్లిదండ్రులు లాహిరీ మహాశయుల శిష్యులు. తల్లి పొత్తిళ్లలో పసిబిడ్డగా ఉన్నప్పుడే, ఆమె యోగానందను లాహిరీ మహాశయుల ఇంటికి తీసుకెళ్ళారు. పసి యోగానందను ఆశీర్వదిస్తూ, లాహిరీ మహాశయులు ఇలా అన్నారు: “చిన్న తల్లీ! నీ బిడ్డ యోగి అవుతాడమ్మా. ఒక ఆధ్యాత్మిక యంత్రశక్తి రీతిలో అతను ఎన్నో ఆత్మలను పరమాత్మ సాన్నిధ్యానికి చేర్చగలడు.”

లాహిరీ మహాశయులు ఆయన జీవితకాలంలో తమ ఉపదేశాల ప్రచారంకోసం ఎటువంటి సంస్థను నెలకొల్పలేదు. అయితే ఈ విషయంలో ఆయన ఒక జోస్యం చెప్పేవారు. “నేను గతించిన తరువాత సుమారు యాభై ఏళ్ళకి, పడమటి దేశాల్లో యోగవిద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా, నా జీవిత వృత్తాంతం ఒకటి వ్రాయడం జరుగుతుంది. యోగవిద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సోదరత్వాన్ని – అంటే, మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనం మీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని – నెలకొల్పడానికి తోడ్పడుతుంది,” అని చెప్పారు.

1895 సెప్టెంబరు 26న లాహిరీ మహాశయులు మహాసమాధి చెందారు. వారు గతించిన ఏభై ఏళ్ళకి, ఆయన చెప్పిన జోస్యం అమెరికాలో నిజమయ్యింది. యోగము నేర్చుకోవాలన్న ఆసక్తి అక్కడి ప్రజల్లో బాగా అభివృద్ధి చెంది పరమహంస యోగానందగారు తన జీవిత విశేషాలను ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకంగా వ్రాయడానికి ప్రేరణనిచ్చింది. ఆ పుస్తకం ద్వారా, లాహిరీ మహాశయుల జీవిత విశేషాలను అందంగా తెలియజేయడం జరిగింది.

జ్ఞానావతార స్వామి శ్రీ యుక్తేశ్వర్, లాహిరీ మహాశయుల శిష్యుడు

స్వామి శ్రీ యుక్తేశ్వర్

స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు భారతదేశంలోని బెంగాలు రాష్ట్రంలో 1855 మే నెల 10వ తేదీన శ్రీరాంపూర్ లో జన్మించారు. శ్రీ యుక్తేశ్వర్ గారు లాహిరీ మహాశయుల శిష్యులు మరియు “జ్ఞానావతార్” – (జ్ఞానం యొక్క అవతారము), యొక్క ఆధ్యాత్మిక స్థాయిని పొందారు.

పాశ్చాత్య దేశాలలో జరుగుతున్న శాస్త్రసాంకేతిక విజ్ఞానాన్ని, తూర్పు దేశాలలో అనాదిగా నెలకొన్న ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను సమ్మేళనం చేస్తే, అది ఈ ఆధునిక యుగంలో మానవాళి ఎదుర్కుంటున్న భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక బాధలన్నిటికీ ఒక ఉపశమనం అవుతుందని శ్రీ యుక్తేశ్వర్ గారు గుర్తించారు. 1894లో లాహిరీ మహాశయుల గురువుగారైన మహావతార్ బాబాజీని కలిశాక యుక్తేశ్వర్ గారికి ఈ దృక్పథం మరింత బలపడింది.

మహావతార బాబాజీ, యుక్తేశ్వర్ గారితో ఇలా అన్నారు: “స్వామీ, నా కోరికను మన్నించి, ‘క్రిస్టియన్ మరియు హిందూ పురాణాలలో అంతర్గతంగా ఉన్న సామరస్యాన్ని తెలియజేస్తూ’ ఒక చిన్న పుస్తకం వ్రాయగలరా? వాటి యొక్క సహజమైన ఏకత్వం ప్రస్తుతం మనుషుల్లోని మత విబేధాల వలన మరుగున పడిపోయింది. దైవంచే ప్రేరేపించబడిన ఆయన కుమారులు ఇద్దరూ ఒక్కటే సత్యాన్ని బోధించారని – సమాంతర ప్రస్తావనల ద్వారా వివరించండి.”

శ్రీ యుక్తేశ్వర్ గారు ఈ సందర్భంలో ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు “బైబిల్ కు, సనాతనధర్మ గ్రంథాలకూ గల సామరస్యాలను విశ్లేషిస్తూ ఎన్నో నిశ్శబ్దమైన రాత్రులు గడిపేవాడిని. ఏసు క్రీస్తు మాటలను ఉదహరిస్తూ ఆయన చేసిన బోధనల సారాంశం, వేదాల్లో చెప్పబడ్డ ఉద్బోధలతో ఏకీభవిస్తున్నదని చూపించగల్గాను. నా పరమ గురువుల కృప వలన ది హోలీ సైన్స్ (The Holy Science) అనే నా పుస్తకం అనతి కాలంలోనే పూర్తి చేయడం జరిగింది.”

శ్రీ యుక్తేశ్వర్ గిరి వద్దకు పరమహంస యోగానందగారు ఒక యువకుడిగా వెళ్ళడం జరిగింది. తన యువ శిష్యునితో శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు, తాను 1894లో మహావతార్ బాబాజీని కలిసినప్పుడు బాబాజీ వారు అన్న విషయాన్ని ఇలా వివరించారు: “ఓ స్వామీజీ, రాబోయే కాలంలో ప్రాచ్య, పాశ్చాత్యాల మధ్య జరగబోయే సామరస్యపూరితమైన సాంగత్యంలో మీరూ పాలుపంచుకోవాలి. ఇంకొన్ని సంవత్సరాలలో నేను మీ వద్దకు ఒక శిష్యుణ్ణి పంపిస్తాను. ఆయనకు మీరు పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగమును ప్రచారంచేసే క్రమంలో తర్ఫీదును ఇవ్వండి. అక్కడ, ఆధ్యాత్మికత కోరుకుంటున్న చాలామంది నుండి నాకు ప్రకంపనల వెల్లువ వచ్చిచేరుతోంది. అమెరికా, యూరోప్ దేశాల్లో సమర్థత కలిగిన సన్యాసులు ఆత్మ సాక్షాత్కారం కోసం నిరీక్షిస్తూ ఉన్నారన్న విషయం నాకు ద్యోతకమవుతోంది.”

ఈ విషయం చెప్పిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు యోగానందులతో ఇంకా ఇలా అన్నారు, “నాయనా, సంవత్సరాల క్రితం బాబాజీ నా వద్దకు పంపుతానని వాగ్దానం చేసిన శిష్యుడవు నీవే.”

శ్రీ యుక్తేశ్వర్ గారి క్రమశిక్షణా భరితమైన ఆధ్యాత్మిక శిక్షణ వలన, శ్రీ యోగానందగారు ప్రపంచవ్యాప్తమైన తన బాధ్యతను చేబట్టడానికి పూర్తిగా సంసిద్ధులైనారు. శ్రీ యుక్తేశ్వర్ గారు పరమహంస యోగానందను తన ఆధ్యాత్మిక వారసునిగాను, ఆశ్రమ స్థిరాస్తులకు కూడా సంపూర్ణ వారసునిగా నియమించారు.

పరమహంస యోగానందగారు, పదిహేను సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన సమయంలో 1936 మార్చి నెల 9వ తేదీన స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు మహాసమధి చెందారు.

 ప్రేమావతార్ పరమహంస యోగానంద వై.ఎస్.ఎస్. / ఎస్.ఆర్.ఎఫ్. వ్యవస్థాపకులు

పరమహంస యోగానంద

పైన చెప్పిన విధంగా, పరమహంస యోగానందగారు తన ఆధ్యాత్మిక గురుపరంపరలోని ముగ్గురు మహాత్ములు – మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు మరియు స్వామి శ్రీ యుక్తేశ్వర్ – లచే స్వయంగా ఆశీర్వదించబడ్డారు. క్రియాయోగమును ప్రపంచవ్యాప్తి చేయడమనే మహత్కార్యమే వారి లక్ష్యం.

ఒక యోగి ఆత్మకథలో ఆయన ఇలా వ్రాశారు: “ఆధ్యాత్మిక తేనెను అందించే తేనెతుట్ట లాంటి ‘సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్’ సంస్థను పాశ్చాత్య దేశాల్లో స్థాపించడం అనే బాధ్యతను శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు మరియు మహావతార్ బాబాజీ నాకు అప్పగించారు.

ఆయన తన జీవితకాలాన్నంతా వెచ్చించి సాధించిన ఈ బృహత్కార్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ సంక్షిప్త వివరణ చదవండి.

Share this on

This site is registered on Toolset.com as a development site.